ఉపాసనాబలం వల్లనే పురాణపండకు ‘ఉగ్రం ... వీరం’ సాధ్యం: విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
ABN, Publish Date - May 25 , 2024 | 11:51 PM
పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్‌కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు
విజయవాడ, మే 25: చిరంజీవి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్యసాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్‌కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) పేర్కొ న్నారు. ప్రముఖ పారమార్ధిక ప్రచురణల సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ (Ugram Veeram) అపురూప గ్రంధాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ప్రత్యేక వేదికపై శనివారం సాయంకాలం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూల రచనల్ని, తత్వశాస్త్ర రచనల్ని, ప్రాచీన రచనల్ని సత్యానేషణతో చదివే అసాధారణ ప్రతిభాశాలి కావడం వల్లనే శ్రీనివాస్ ఇంత అందంగా ఈ ‘ఉగ్రం వీరం’ను చాలా చక్కగా పరమోత్తమరీతిలో... సరళాతి సరళమైన శైలిలో అందించారని అభినందించారు. తెలుగు నాదాత్మకమైన ఒక అద్భుత కవిత్వ భాషతో పురాణపండ రచనా సంకలనాలు భక్త పాఠకులను సమ్మోహన పరుస్తున్నాయని, మహా సరస్వతీ కారుణ్యం శ్రీనివాస్ కలంలో బలంగా ప్రవహిస్తోందని, ఇంతకంటే జీవన సార్ధకత పురాణపండకు ఏం కావాలని చాగంటి మంగళా శాసనం చేశారు.
కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు (EO KS Ramarao) సంస్కార సంపన్నతను, సమర్పణా భావనను, స్వచ్ఛమైన పవిత్ర హృదయాన్ని, నిస్వార్ధతను చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.
చాగంటి నుండి ‘ఉగ్రం ... వీరం’ తొలి ప్రతి స్వీకరించిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో భక్త పాఠకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తూన్న పురాణపండ శ్రీనివాస్ దివ్య గ్రంథ సంపదను తాను శ్రీశైలంలోనూ పారవశ్యంతో భక్తకోటికి అందించానని... నాటి భక్త సంద్రం అనుభూతి మాటలకందనిదని పేర్కొంటూ ఈ ‘ఉగ్రం వీరం’లోని ప్రహ్లాద నారసింహుల కథాకథనం అలతి అలతి పదాలతో మన మనసుల్ని కట్టేస్తుందని... పురాణపండ శ్రీనివాస్ భాషా సంస్కారాన్ని, నిస్వార్ధ గ్రంథ యజ్ఞ సేవను ప్రశంసించారు.
కనకదుర్గమ్మ పద సన్నిధిలో చాగంటి వారి ఆశీర్బలం తన జీవితంలో ఒక రసవత్ ఘట్టమని వివరిస్తూ చాగంటి వారికి వినయ సంపన్నతో వేదికపై నుంచే రామారావు ప్రణామాలు సమర్పించడం విశేషం.
దేవస్థాన అర్చక పండిత బృందాలతో పాటు ‘శ్రీశైల ఖండం’ గ్రంథ రచయిత సీతారామశర్మ పాల్గొన్న ఈ పవిత్ర కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి రామారావు ఆదేశంతో భక్త జనులకు ‘ఉగ్రం .. వీరం’ ప్రతులను ఆలయ సిబ్బంది పంచడంతో అనూహ్య స్పందన లభించింది.
రాజకీయాల్లో యోధులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామాత్యులు, ఇప్పటి తెలంగాణ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah), అరుణాదేవి దంపతులు ఇలాంటి గొప్ప గ్రంధానికి సమర్పకులుగా సౌజన్యకర్తలుగా వ్యవహరించడం.. జన్మ సార్ధకం చేసుకునే అంశంగా విజ్ఞులు, భక్తులు పేర్కొనడం ముదావహం.
Updated Date - May 26 , 2024 | 12:52 AM