Minister N. Manohar : ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:15 AM
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్ములు వేగంగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,731 మంది రైతుల నుంచి 40,811 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి..
రైతులకు చెల్లింపులు వేగవంతం
ఒక్క రోజే 40,811 టన్నుల సేకరణ
48 గంటల్లోనే ఖాతాల్లో సొమ్ము జమ
జగన్ హయాంలో రైతులను వేధించారు
పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్ములు వేగంగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,731 మంది రైతుల నుంచి 40,811 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రూ.94.01 కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,67,299 మంది రైతుల నుంచి 11,63,510 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 5.22 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని, ర్యాండమైజేషన్ పేరుతో నిర్దేశించిన మిల్లులకే తరలించాలనే నిబంధన వల్ల ధాన్యం తరలింపు రైతులకు తలకుమించిన భారంగా పరిణమించిందన్నారు. ధాన్యం సంచుల కోసమే రోజుల తరబడి రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. అయినప్పటికీ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి లారీల్లో సుదూర ప్రాంతాల్లోని మిల్లులకు తరలించినా.. రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు.
పైగా తేమ శాతం పేరుతో మిల్లర్లు భారీగా కోతలు విధించడం, ఆ తరుగుకు సమానమైన సొమ్మును రైతులు ముందుగా చెల్లిస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం.. ఇలా అడుగడుగునా సాగిన దోపిడీతో రైతులు నష్టపోయారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు రెండు, మూడు నెలల వరకు సొమ్ము చెల్లించకుండా గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో సమూల మార్పులు చేసిందన్నారు. ర్యాండమైజేషన్ నిబంధనను తొలగించి రైతులు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని ఏ రైసు మిల్లుకైనా తరలించుకునే సౌలభ్యం కల్పించిందని మంత్రి చెప్పారు. మద్దతు ధర ప్రకారం 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నట్టు వివరించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం జిల్లాలతోపాటు కోస్తాలోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని నాదెండ్ల తెలిపారు.
Updated Date - Dec 07 , 2024 | 04:15 AM