YS Jagan: ఖర్చు చేశారు.. తాళాలు వేశారు!
ABN, Publish Date - Sep 15 , 2024 | 05:52 AM
నాడు- నేడు పథకంతో బడుల రూపురేఖలు మారుస్తామన్నారు.. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు..
‘నాడు-నేడు’ పనులు చేశాక 73 స్కూళ్లు మూత
జగన్ ప్రభుత్వ అడ్డగోలు చర్యలతో విచిత్ర పరిస్థితి
ఆ స్కూళ్లపై రూ.5 కోట్లకు పైగా ఖర్చు.. ఆ తర్వాత తరగతుల విలీనం
ఫలితంగా మిగిలిన పిల్లలూ వెళ్లిపోయిన వైనం.. బడుల మూతతో శిథిలావస్థలోకి
నాడు- నేడు పథకంతో బడుల రూపురేఖలు మారుస్తామన్నారు.. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు.. చాలాచోట్ల పైపై పూతలతో సరిపెట్టారు. కొన్నిచోట్ల నిధులు ఖర్చుచేసి మెరుగులు దిద్దారు. కానీ అంతా చేశాక తరగతుల విలీనం పేరుతో ఆ బడుల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించారు.. దీంతో ఆ బడుల్లో మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇలా ఏకంగా 59 ప్రాథమిక పాఠశాలలు ఒక్క విద్యార్థీ లేక మూత పడ్డాయి. 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి. ఒక్కో పాఠశాలకు రూ.10లక్షల వరకు ఖర్చు చేశాక.. గత వైసీపీ సర్కారు అనాలోచితంగా తీసుకున్న విలీన నిర్ణయంతో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు ఆ బడులను ఏంచేయాలో కూడా ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు!!
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం నాడు- నేడు పేరుతో ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఉద్దేశం మంచిదే అయినా.. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎడాపెడా ఖర్చు చేసింది. బడులను మెరుగుపరిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆలోచించారా అంటే అదీ లేదు. పనులన్నీ చేశాక 2022-23లో అనాలోచితంగా తరగతుల విలీనం చేశారు. కిలోమీటరు పరిధిలో ఉన్నత పాఠశాల ఉంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 4200 ప్రాథమిక పాఠశాలలను విలీనం పేరుతో దెబ్బతీశారు. అవన్నీ ఇప్పుడు కనీసం 20 మంది విద్యార్థులు లేక ఏకోపాధ్యాయ బడులుగా మారాయి.
వాటిలో 59 పాఠశాలల్లో ఉన్న రెండు తరగతుల్లోని పిల్లలూ వెళ్లిపోయారు. దీంతో బడులు మూతపడ్డాయి. మూతపడిన ఈ 73 బడులకు సుమారు రూ.5.26కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులన్నీ వృథా అయిపోయాయి. మూతపడినవాటిలో అన్నమయ్య జిల్లాలో కె.వి.పల్లె ఎంపీపీ స్కూల్, గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడు ప్రాథమిక పాఠశాల (ఎస్.ఎల్.పురం), కడప జిల్లా జమ్మలమడుగులోని జె.రామిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలతోపాటు, కృష్ణా జిల్లా వెంట్రప్రగడలోని శివపురం ప్రాథమికోన్నత పాఠశాల, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపుల్లేరు ఎంపీపీ మెయిన్ పాఠశాల, ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని కరోళ్లపాడు ఎంపీపీ స్కూల్ తదితర 73 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 59 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
అన్నీ అరకొర పనులే..
విద్యార్థులు తక్కువగా ఉన్నా ప్రాథమిక పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేసిన జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల్లో పనులు పూర్తిచేసే విషయంలో విఫలమైంది. మూడేళ్లలో పనులు పూర్తిచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 15వేల పాఠశాలల్లోనే పనులు చేసింది. అందులోనూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో విడతలో 22వేల బడుల్లో పనులు ప్రారంభించినా నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్క డి పనులు అక్కడే నిలిచిపోయాయి. రూ.8 వేల కోట్లతో రెండో విడత పనులు ప్రారంభించగా అందు లో సగం నిధులే ఖర్చు చేశారు. నాడు-నేడు పేరుతో తీసుకొచ్చిన రుణాలను ఇతరత్రా అవసరాలకు మళ్లించడంతో వాటిని వెనక్కి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా.. నాడు నేడు పేరిట వైసీపీ ప్రభుత్వం నిధులు దుబారా చేసిందనడానికి ఇదో నిదర్శనం. ఇది వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలంలోని అయ్యవారిపల్లె ప్రాథమిక పాఠశాల. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు రెండో ఫేజ్‌లో దాదాపు రూ.10లక్షలతో అభివృద్ధి చేశారు. టైల్స్‌తో ఫ్లోరింగ్ వేశారు. టాయిలెట్లు ఆధునికీకరించారు. దెబ్బతిన్న గోడలకు మరమ్మతులు చేసి రంగులు వేశారు. ప్రహరీ గోడ నిర్మించారు. వేసవి సెలవుల అనంతరం ఈ ఏడాది జూన్‌లో పాఠశాల ప్రారంభమైంది. అయితే ఈ పాఠశాలకు ముగ్గురు మాత్రమే విద్యార్థులు వచ్చారు. దీంతో వీరికి టీసీలు ఇచ్చి వేంపల్లె రాజారెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇక్కడున్న ఏకోపాధ్యాయుడు భూమిరెడ్డి పురుషోత్తం రెడ్డిని వేంపల్లె పంపించారు. ఆతర్వాత పులివెందులకు బదిలీ చేశారు.
అప్పట్లోనే అనుమానాలు.. అయినా..!
నాడు- నేడు పథకంలో భాగంగా తరగతి గదులు, పాఠశాల ఆవరణలు, గోడలకు పెయిం ట్లు వేశారు. వాటర్ ప్లాంట్లూ ఏర్పాటుచేశారు. అప్పటికే అంతంతమాత్రంగా విద్యార్థులున్న పాఠశాలల్లోనూ ఈ పను లు చేశారు. నిధులన్నీ వృథా అవుతున్నాయని టీచర్లు ఆందోళన వ్యక్త ం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బడులను మూ సేయడంపై విమర్శలొస్తున్నాయి.
Updated Date - Sep 15 , 2024 | 12:19 PM