Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 26 , 2024 | 10:57 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.
శ్రీకాకుళం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులోనే కల్తీ ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆవాలు, అవిశలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవులు ఇచ్చే పాల నుంచి ఈ నెయ్యి తయారయ్యి ఉండొచ్చని అన్నారు.
లడ్డూ వ్యవహారంలో వైసీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కల్తీ పరీక్షలో కచ్చితత్వం లోపించే అవకాశం ఉండొచ్చని ఎస్‌డీబీబీ తన రిపోర్ట్‌లో పేర్కొందని ఆయన ప్రస్తావించారు. ఇక కూటమి పార్టీల నేతలు చెబుతున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే.. అవి లోపలికి అనుమతించినవారు మీరే అవుతారని ఆయన అన్నారు. ఇక ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకున్నట్టు అవుతుందని ఆయన సెలవిచ్చారు.
సీతారాం చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సీతారాం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Updated Date - Sep 26 , 2024 | 11:34 AM