అసోంం చీఫ్ సెక్రటరీగా జిల్లా వాసి
ABN , Publish Date - Apr 01 , 2024 | 12:11 AM
జిల్లాకు చెందిన కోత రవికుమార్ అసోం రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.

- బాధ్యతలు చేపట్టిన కోత రవికుమార్
టెక్కలి, మార్చి 31: జిల్లాకు చెందిన కోత రవికుమార్ అసోం రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ రవి స్వగ్రామం సంతబొ మ్మాళి మండలం కోటపాడు గ్రామం. ప్రస్తుతం రవి అసోంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రవి ప్రాథమిక విద్యాభ్యాసం కొత్తూరు కోటపాడులో జరిగింది. హైస్కూల్ విద్యాభ్యాసం దండుగోపాలపురంలో, ఇంటర్మీడియట్ టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. బాపట్లలో ఏజీబీఎస్సీలో సీటు రావడంతో చేరారు. ఆ తరువాత బాపట్లలోనే అగ్రికల్చర్ ఎమ్మెస్సీ, కొన్నాళ్ల తరువాత ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ)లో పీహెచ్‌డీని పూర్తిచేశారు.
అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి..
కోత రవి తన మొదటి పోస్టింగ్ కింద అసోంలోని గొసాయిగాంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు. ఆ తరువాత జ్వరాఘాట్, సివసాగర్ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే అసోంలో అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీగా, న్యూఢిల్లీలోని మానవ వనరుల శాఖ, మైన్స్ శాఖల మంత్రుల వద్ద ఓఎస్‌డీగా పనిచేశారు. సౌత్ ఇండియాలో ఎఫ్‌సీఐలో సీనియర్ రీజనల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం అమెరికాలో మినిస్టరీ ఆఫ్ ఎకనమిక్స్ విభాగంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధిగా పనిచేశారు. అసోం ప్రాంతంలో ఐఏఎస్‌గా ఎక్కువకాలం విధులు నిర్వహించడం వలన ఆ ప్రాంత ప్రజానీకంతో అనుబంధం ఏర్పడింది. అస్సాం ప్రభుత్వం తరఫున ఊల్ఫా తీవ్రవాదులతో చర్చలు జరపడంలో ఆయన కీలక భూమిక పోషించారు. జ్వాలాగాట్‌లో ప్రజల భాగస్వామ్యంతో ఆసుపత్రి, జైలు నిర్మాణం చేయించి డబుల్ రోడ్లు, సోడియం వేపర్ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర నదిపై ఆరువేల కోట్ల రూపాయల ప్రపంచబ్యాంక్ నిధులతో వంతెన నిర్మాణానికి కృషి చేశారు. రవి సోదరులు భీమారావు హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తుండగా, మరో సోదరుడు మధు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.