నిస్వార్థంగా మెలగాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 02:51 AM
పనులను (కర్మలను) ఎలాంటి స్వార్థం లేకుండా ఆచరించడం అత్యుత్తమైన లక్షణమని, అటువంటి నిస్వార్థమైన కర్మలు సర్వోన్నతమైన శక్తిని కలిగి ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిస్వార్థమైన చర్యల గురించి...

గీతాసారం
పనులను (కర్మలను) ఎలాంటి స్వార్థం లేకుండా ఆచరించడం అత్యుత్తమైన లక్షణమని, అటువంటి నిస్వార్థమైన కర్మలు సర్వోన్నతమైన శక్తిని కలిగి ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిస్వార్థమైన చర్యల గురించి వివరించడానికి వర్షాన్ని ఆయన ఉదాహరణగా తీసుకున్నాడు. వేడి కారణంగా నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. అనుకూలమైన పరిస్థితుల్లో అది వర్షం రూపంలో తిరిగి భూమి మీదకు వస్తుంది. అంటే వర్షం అనేది ఒక ఆవృత్తి (సైకిల్)లో భాగం. నిస్వార్థ కర్మలను ‘యజ్ఞం’గా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. మహా సముద్రాలు నీటిని ఆవిరి చేసి, మేఘాలు ఏర్పడడానికి సహాయపడతాయి. వర్షంగా మారడం కోసం మేఘాలు కరుగుతాయి, తమనుతాము త్యాగం చేసుకుంటాయి. ఈ రెండూ యజ్ఞరూపమైన నిస్వార్థ కర్మలు. ఇవి అత్యంత శక్తిని గలిగి ఉంటాయనీ, ఆరంభంలో సృష్టికర్త ఈ శక్తిని ఉపయోగించి సృష్టిని చేశాడనీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని పరమ శ్రేయస్సును పొందాలని సూచించాడనీ ‘భగవద్గీత’ మూడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరించాడు. ఇదంతా యజ్ఞరూపమైన నిస్వార్థ కర్మ ద్వారా మన అస్తిత్వంతో మనల్ని అనుసంధానించుకొని... దాని శక్తిని ఉపయోగించుకోవడమే.
వర్షానికి సంబంధించిన ఈ పరస్పర అనుసంధాన ప్రక్రియలో.. మేఘాలు గర్వంతో నీటిని నిల్వ (జమ) చేసుకుంటే ఆ ఆవృత్తికి భంగం కలుగుతుంది. ‘‘ఇలా భంగం కలిగించేవారు దాచుకొనేవారు దొంగలు. వర్షం తాలూకు నిస్వార్థ కర్మ కొనసాగినప్పుడు... మేఘాలు మళ్ళీ, మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి’’ అని శ్రీకృష్ణుడు చెబుతూ... పరస్పరం సహాయం చేసుకొనేవారిని దేవతలుగా సంబోధించాడు. సముద్రం వర్షం ద్వారా నీటిని తిరిగి పొందినట్టే... నిస్వార్థ కర్మలు ఎన్నిటినో తిరిగి ఇస్తాయి. కాబట్టి దాచుకోకుండా ఆవృత్తిలో భాగం కావాలనీ, అది అన్ని పాపాలనుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుందనీ, దాచుకోవడమే అసలైన పాపం అని ఆయన స్పష్టం చేశాడు. స్వార్థ కర్మలు మనల్ని కర్మబంధనంలో బంధిస్తాయని హెచ్చరించాడు. అనుబంధం పెంచుకోకుండా కర్మలను యజ్ఞంలా నిర్వహించాలని సూచించాడు.
ఈ భౌతిక ప్రపంచంలో ఒకరిపై మరొకరు ఆధారపడడం తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ప్రతి వస్తువు, ప్రతి జీవి ఒక ఆవృత్తిలో లేదా మరొకదానిలో భాగం. అది మరో వస్తువు మీద లేదా మరొకరిమీద ఆధారపడి ఉంటుంది. మనలోని ఒక భాగం ఇతరులలో... ఇతరులలోని ఒక భాగం మనలో ఉంటుందనే అవగాహన కీలకం.
కె. శివప్రసాద్
ఐఎఎస్
ఈ వార్తలు కూడా చదవండి:
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..