Jaya Krishna: వైసీపీ నేతలు అవినీతిలో అరితేరిపోయారు
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:56 PM
వైసీపీ పాలనలో పాలకొండ నియోజకవర్గం రెండు కుటుంబాల కారణంగా వెనుకబడిందని టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ (Nimmaka Jaya Krishna) అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవంశ విక్రాంత్ బాబు అవినీతిలో అరితేరిపోయారని అన్నారు.
శ్రీకాకుళం: వైసీపీ పాలనలో పాలకొండ నియోజకవర్గం రెండు కుటుంబాల కారణంగా వెనుకబడిందని టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ (Nimmaka Jaya Krishna) అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవంశ విక్రాంత్ బాబు అవినీతిలో అరితేరిపోయారని అన్నారు. మంగళవారం నాడు పాలకొండలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ...ఈ రోజు ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక మాఫియానే కనుబడతోందని.. ఆ దొంగలిద్దరూ ఊళ్లను పంచుకుంటున్నారని ఆరోపించారు. నాగావళి నది, వంశధార నదుల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. పాలకొండలో కోట్లు విలువచేసే స్థలాలను కూడా ఎమ్మెల్సీ విక్రాంత్ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కళావతి గ్రామంలో ఉన్న 33ఎకరాల చెరువును కబ్జా చేశారని మండిపడ్డారు. దోచుకోవడం తప్ప వారిద్దరూ పాలకొండ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలకొండ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలను కేటాయించి అభివృద్ధి చేశారని తెలిపారు.
అప్పటి మంత్రి నారా లోకేష్ సీతంపేటలో స్టేడియం నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. 2024లో పాలకొండ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయడానికి టీడీపీ - జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నాలుగేళ్లుగా దోపిడీ తప్ప అభివృద్ధిని గాలికొదిలేసిన స్థానిక ఎమ్మెల్యే కళావతిని నియోజకవర్గ ప్రజలు సాగనంపాలని పిలుపునిచ్చారు. ఐటీడీపీల్లో గిరిజనులకు ఉద్యోగాలిచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీఓ నెం.3 తెస్తే, జగన్ ప్రభుత్వం ఆ జీఓను అమలుచేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ రోజు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాలకొండ ఏరియా ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా మార్చాలని లోకేష్‌ను కోరారు. వీరఘట్టం మండలానికి డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. తోటపల్లి ఎడమకాల్వ సగంలో ఆగిపోయిందని.. దీనిని కూడా పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. జగత్ పల్లి రిసార్ట్స్‌ను పూర్తిచేసి స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తూరు- బీమిలి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీరఘట్టం మండలంలో రోడ్లు పూర్తిచేయాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాలకొండ నియోజకవర్గంలో పెండింగ్ పనులన్నీ పూర్తిచేయాలని నిమ్మక జయకృష్ణ కోరారు.
Updated Date - Feb 13 , 2024 | 04:56 PM