AP Politics: ఇదేం పద్ధతి ఎమ్మెల్యే గారూ.. కన్నెర్రజేస్తున్న టీడీపీ శ్రేణులు..
ABN, Publish Date - Dec 18 , 2024 | 07:26 PM
ఆయనో మోనార్క్. తన నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తారు. అక్కడ తాను చెప్పిందే వేదం..చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తారు. అధికారులు చేయాల్సిన పనులనూ తానే చేసేస్తారు. తనకు ఎదురు చెబితే..
ఆయనో మోనార్క్. తన నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తారు. అక్కడ తాను చెప్పిందే వేదం..చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తారు. అధికారులు చేయాల్సిన పనులనూ తానే చేసేస్తారు. తనకు ఎదురు చెబితే సొంత పార్టీ ప్రజాప్రతినిధి అయినా.. మీడియా ప్రతినిధులైనా సామాజిక మాధ్యమాలే వేదికగా విరుచుకుపడతారు. ఆయనే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
విజయవాడ/తిరువూరు, డిసెంబర్ 18: కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తన వివాదాస్పద వ్యవహార శైలితో టీడీపీకి ఇబ్బందులు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జూలైలో ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి, భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్నపళంగా భవనాన్ని పడగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే భైఠాయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీనివాస్‌ను పిలిపించుకుని మందలించారు. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించడమే కాకుండా ‘గుడ్డలూడదీసి తంతా’ అని బెదిరించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనం రేకెత్తించింది.
తిరువూరు నియోజకవర్గంలో కొందరు తెలంగాణ ప్రాంత వ్యక్తులు అక్రమంగా మట్టి తరలిస్తుండటంపై పత్రికల్లో కథనాలు రావడంతో మీడియా ప్రతినిధులపైనా సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అప్పటి నుంచి సంయమనంతో ఉన్న ఎమ్మెల్యే మంగళవారం ఒక్కసారిగా తన ప్రతాపాన్ని మళ్లీ ప్రదర్శించారు.
దగ్గరుండి షాపులకు తాళాలు..
మంగళవారం ఉదయం మద్యం షాపుల వద్దకు వెళ్లి బెల్టు షాపులు నిర్వహిస్తున్నారంటూ దగ్గరుండి షాపు నిర్వాహకులతోనే ఆయా షాపులకు తాళాలు వేయించారు. ఎవ్వరైనా షాపు తీస్తే ఊరుకునే ప్రశ్నే లేదని హుకుం జారీ చేశారు. పట్టణంలో ఉన్న షాపుల్ని పట్టణ శివారులో ఏర్పాటు చేసుకోవాలని, బెల్టుషాపులు 24 గంటల్లో తొలగించాలని, లేదంటే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాననడం.. షాపు వాళ్లను బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకే అని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
నిర్వహణే కష్టంగా ఉంటే..
నియోజకవర్గం పరిధిలో మొత్తం 16 మద్యం షాపులకుగాను తిరువూరు పట్టణంలో 4, రూరల్‌లో 2, గంపలగూడెంలో 4, ఎ.కొండూరులో 2, విస్సన్నపేటలో 4 బ్రాంది షాపులు ఉన్నాయి. ప్రస్తుతం షాపుల నిర్వహణనే కష్టసాధ్యంగా మారిందని, పెద్దగా గిట్టుబాటు కావడం లేదని మద్యం షాపుల యజమానులు గగ్గోలు పెడుతుంటే వారిని వేధించడం ఎంత వరకు సబబని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులు నిర్వహించే వారిలో ఎక్కువ శాతం కూటమి నాయకులే ఉన్నారని, అలాంటిది వారిపై వేధింపులకు దిగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపుల నిర్వహణలో లోపాలు ఉంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించాల్సిన ఎమ్మెల్యేనే ఇలా షాపులు మూయిస్తూ దాదాగిరి చేయడం ఏమిటనే చర్చ నడుస్తోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుంచి షాపులు పాడుకుని అప్పులు చేసి చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగామని, తమను ఎమ్మెల్యే స్వప్రయోజనాల కోసం ఇలా వేధించడం సరికాదని ఓ మద్యం దుకాణం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
కాంగ్రెస్ నా మాటలు వక్రీకరించింది.. అమిత్‌షా ఫైర్
అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 18 , 2024 | 07:26 PM