TDP : కోట్లు కుమ్మేశారు!
ABN, Publish Date - Jun 29 , 2024 | 04:59 AM
జగన్ జమానాలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. చివరకు బదిలీల ప్రక్రియను కూడా అభాసుపాల్జేశారు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఉపాధ్యాయుల బదిలీ అక్రమాలకు నాంది పలికితే అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
టీచర్ల బదిలీల్లో మరిన్ని అక్రమాలు
బొత్స, అధికారులు, సంఘాల నేతలు
వాటాలు వేసుకుని మరీ దోపిడీ
మొత్తం వసూళ్లు రూ.వంద కోట్ల పైనే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ జమానాలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. చివరకు బదిలీల ప్రక్రియను కూడా అభాసుపాల్జేశారు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఉపాధ్యాయుల బదిలీ అక్రమాలకు నాంది పలికితే అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దానిని పతాక స్థాయుకి తీసుకెళ్లారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా వీలైనంత మేర దోచేశారు. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా టీచర్ల బదిలీల కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. అంతకముందు ప్రభుత్వాల్లోనూ అడపాదడపా సిఫారసులతో బదిలీలు చేసినా అవి చాలా పరిమిత సంఖ్యలో ఉండేవి. కానీ, జగన్ జమానాలో ఏకంగా 2,400 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఏడాది కాలం వ్యవధిలో ఒకసారి 1,000 మందిని, మరోసారి 1,400 మందిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బదిలీ చేసింది. అయితే మొన్నటివరకూ ఈ సంఖ్య 1,200 మాత్రమేనని అధికారులు ప్రచారం చేశారు. కానీ 2,400 మంది టీచర్లను దొడ్డిదారిలో బదిలీ చేసిన విషయం ప్రభుత్వం మారాక వెలుగు చూసింది. ఒక్కో బదిలీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం.
జగన్ ఆఫీస్ నుంచి మొదలు
అప్పటి సీఎం జగన్ కార్యాలయం(సీఎంవో) నుంచే బదిలీల తతంగం ప్రారంభమైనట్టు తెలిసింది. బదిలీల పేరిట తొలుత 350 మంది టీచర్లను అడ్డదారిలో కోరుకున్న స్థానానికి పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రయత్నించింది. ఇది బయటికి రావడంతో వాటిని ఆపేశారు. ఆ తర్వాత 2022 చివర్లో మొదలు పెట్టి తరచూ జాబితాలు తయారుచేశారు. మొదట ఈ బదిలీలను అడ్డుకుంటున్నట్లు అప్పటి మంత్రి బొత్స కార్యాలయం ప్రచారం చేసింది. ఆ తర్వాత బదిలీలు చేసిపెట్టండి అంటూ ఆ జాబితాలో ఉన్న టీచర్లు ఆయన్నే ఆశ్రయించారు. ఇక అప్పటి నుంచీ అడ్డూ అదుపూ లేకుండా లంచాలు తీసుకుని ఇష్టానుసారం బదిలీలు చేశారు.
350 మందితో మొదలైన జాబితా 2400కు చేరింది. ఎన్నికల ముందు ఎంత వస్తే అంత అన్నట్టుగా అడిగిన వారందరికీ బదిలీ ఆర్డర్లు ఇచ్చేశారు. మొదట బదిలీ అయిన టీచర్లు కొత్త స్థానాల్లో చేరారు. కానీ, ఎన్నికలకు ముందు బదిలీ అయిన టీచర్లు ఆర్డర్లు పొందినప్పటికీ రిలీవ్ కాలేదు. ఇప్పుడు వారిని రిలీవ్ చేయొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. బొత్స కార్యాలయంలో పనిచేసిన కమలాకర్ అనే వ్యక్తి ద్వారా ఈ అక్రమ బదిలీల వ్యవహారం సాగినట్టు తెలిసింది. ఎవరైనా సరే ఆయన్ను కలిసి ముడుపులు సమర్పించిన తర్వాతే బదిలీ ఆర్డర్లు బయటికొచ్చాయి. ఈ క్రమంలో పాఠశాల విద్య కమిషనరేట్, సచివాలయంలోని విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. వేల సంఖ్యలో చేపట్టిన బదిలీల్లో తమ వాటా అంటూ దాదాపు 30కి పైగా బదిలీలు వారు చేసి జేబులు నింపుకొన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం ఈ వ్యవహారంలో తలదూర్చి బదిలీలు చేయించుకుని, ముడుపులు వసూలు దండుకున్నట్టు సమాచారం.
ప్రవీణ్ సహకారం... సురేశ్ మౌనం
టీచర్ల బదిలీల అక్రమాలకు అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పూర్తి సహకారం అందించారు. మంత్రి చెప్పారనే కారణంతో ఈ బదిలీలు చేయించి స్వామి భక్తి చాటుకున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఆయనే సచివాలయంలో అధికారులను కూర్చోబెట్టి మరీ ఆర్డర్లు ఇప్పించారు. ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా తనకేం పట్టదన్నట్టు మౌనంగా ఉండిపోయారు. బదిలీ ఆర్డర్ పొంది రిలీవ్ కాని టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతల మాటలు విని అడిగినంత ముడుపులు సమర్పించుకున్నారు. తీరా బదిలీ ఆదేశాలు పొందినా కొత్త స్థానానికి వెళ్లేలోగా ప్రభుత్వం మారడంతో ఆ బదిలీలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అటు డబ్బులు పోయి, ఇటు బదిలీ అవ్వక ఎటూ కాకుండా మిగిలిపోయారు.
బదిలీలు జరిగినప్పుడు ముడుపులు చేతులు మారడం చూస్తాం. కానీ, అసలు లేని బదిలీలను మధ్యలో సృష్టించి మరీ కోట్లు కుమ్మేయడం ఎక్కడైనా చూశారా?. కానీ, జగన్ ఏలుబడిలో ఏదైనా సాధ్యమేనని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ నిరూపించారు. సాధారణ టీచర్లకు బదిలీల ఎరచూపి రూ.లక్షల్లో లంచాలు పిండుకుని రూ.కోట్లు కుమ్మేశారు!!
ఇకపై రాజకీయ జోక్యం ఉండదు!
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ బదిలీల వ్యవహారం పెను వివాదానికి దారితీయడంతో ఇకపై జరిగే బదిలీల్లో రాజకీయ జోక్యం అనే మాట వినిపించకూడదని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. పూర్తి పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. అయితే గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మొత్తం అక్రమాలను వెలికి తీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో అక్రమాల జోలికి పోవాలంటే భయం ఏర్పడుతుందని, లేదంటే అధికారులు, సంఘాల నేతలు కూడా బదిలీలంటే కాసుల వర్షం అన్నట్టుగా భావిస్తూ జేబులు నింపుకొంటున్నారని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Updated Date - Jun 29 , 2024 | 04:59 AM