AP Police : టీడీపీ పలాస- కాశీబుగ్గ అధ్యక్షుడి హత్యకు కుట్ర
ABN, Publish Date - Dec 22 , 2024 | 06:40 AM
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హతమార్చేందుకు కుట్రపన్నిన నలుగురు వైసీపీ నాయకులను...
నలుగురు వైసీపీ నాయకులు, బిహార్ ముఠా అరెస్టు
పలాస, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హతమార్చేందుకు కుట్రపన్నిన నలుగురు వైసీపీ నాయకులను, ముగ్గురు బిహార్ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఏడోవార్డు చిన్నబడాం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అంపోలు శ్రీనివాసరావు, కూర్మాపు ధర్మారావు, కోత శ్రీనివాసరావు, మందస మండలం జిల్లుండ గ్రామానికి రౌతు చంద్రశేఖర్.. చిన్నబడాంలోనే నివాసం ఉంటున్న బడ్డ నాగరాజును హత్య చేసేందుకు పథకం వేశారు. నాగరాజును హతమార్చేందుకు బిహార్ రాష్ట్రం నవడా జిల్లాకు చెందిన మహ్మద్ ఇక్బాల్ రాజాఖాన్, ఎండి.అమీర్, నిరంజన్‌కుమార్ పాశ్వాన్‌కు రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించారు. ఈ క్రమంలో ఈ నెల 20న శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌తో పాటు రాజాఖాన్, అమీర్ రెక్కీ నిర్వహించి.. నాగరాజును చంపేందుకు తుపాకులు సిద్ధం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు ఈ సమాచారం అందించడంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా.. టీడీపీ పట్టణ అధ్యక్షుడి హత్యకు కుట్ర వ్యవహారం బయటపడింది. ఆ నలుగురితోపాటు.. ధర్మారావు, కోత శ్రీనివాసరావు, నిరంజన్‌కుమార్ పాశ్వాన్‌ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరో పది మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Updated Date - Dec 22 , 2024 | 06:42 AM