New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:28 PM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు.
న్యూఢిల్లీ, జులై 21: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు. వైఎస్ జగన్ పాలనలో చేసిన అప్పులు ఘనంగా.. అభివృద్ధి శూన్యంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మొత్తంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్ట పరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ ఆర్థిక విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుందని ఈ భేటీలో ఆయన వెల్లడించారు. ఇక ఇదే భేటీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. నీట్ అవకతవకలు, ఈడీ, సీబీఐలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపాటు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి అంశాన్ని సైతం ఆ పార్టీ నేతలు లేవనెత్తారు.
ఇక ఎన్డీయే మిత్రపక్షం జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసింది. అలాగే వైయస్ఆర్ సీపీ అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్జప్తి చేసింది. అలాగే కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ యాత్ర సాగే ప్రాంతంలో తినుబండారశాలలు, హోటళ్ల వద్ద యాజమాన్యం పేర్లు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని ఈ అఖిల పక్ష భేటీలో సమాజవాదీ పార్టీ (ఎస్పీ) ప్రస్తావించింది.
ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఆర్థిక సర్వేను కేంద్రం విడుదల చేయనుంది. ఆ మరునాడు అంటే మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఆదివారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది.
టీడీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేశ్, కె.ఎస్. సురేశ్.. ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ నుంచి అభయ్ కుశ్వా, ఆప్ నుంచి సంజయ్ సింగ్, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22న ప్రారంభమై.. ఆగస్ట్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఆ సమావేశంలో ఆరు బిల్లులను ఆమోదించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News