Water Society Elections : నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి స్వీప్
ABN, Publish Date - Dec 15 , 2024 | 04:25 AM
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతి పక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
చేతులెత్తేసిన వైసీపీ
పులివెందులలో మొత్తం టీడీపీ కైవశం
వైఎస్ స్వగ్రామం బలపనూరు కూడా..
కృష్ణాలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతి పక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూడా మొత్తం సంఘాలు టీడీపీ కైవశమయ్యాయి. శనివా రం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 3 స్థాయిల్లో జరుగుతాయి. చెరువులు, పంట కాల్వల కింద సాగునీటి ని వాడుకొనే రైతులతో ప్రాథమిక స్థాయి నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిపైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల స్థాయిలో రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు స్థాయిలో మూడో దశ ఎన్నికలు ఉంటాయి. ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ ఈ సంఘాలను కూటమి గెలుచుకొంది. స్థానిక పరిస్థితులను బట్టి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ తమలో తాము సర్దుబాటు చేసుకొని వీటిని గెలుచుకొన్నాయి. కడప జిల్లాలో 203 నీటి సంఘాలు ఉండ గా కూటమి పార్టీలకు చెందిన వారు 202 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రా మం గుండ్లకుంట-3లో మాత్రం వైసీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ టీడీపీ పోటీ పెట్టలేదు. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాల ను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. వైఎస్ కుటుం బ స్వగ్రామం బలపనూరు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. కడప వైసీపీ ఎంసీ అవినాశ్ రెడ్డి కొన్ని రోజులుగా పులివెందులలో మకాంవేసి ఈ ఎన్నికల్లో పోటీ కి ప్రయత్నం చేసినా ఆ పార్టీ నేతలు ఎక్కడా పోటీ కూడా చేయలేదు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పులివెందులలో ఈ పరిస్ధితి నెలకొనడం ఇదే మొదటిసారి. అయితే, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరులో 3 సంఘాలు వైసీపీ పరమయ్యాయి.
సదుం మండలం చెరుకువారిపల్లెలో వైసీపీ గెలిచిం ది. తిమ్మానాయనిపల్లెలో టీడీపీ, వైసీపీ మధ్య టై అవగా, అధికారులు టాస్ వేస్తే వైసీపీ గెలిచింది. అలాగే తిమ్మానాయనిపల్లెలో మరో చెరువు కూడా వైసీపీకి ఏకగ్రీవమైంది. ప్రకాశం జిల్లాలో 342 సంఘాలు ఉండగా, 341 సంఘాలు కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. ఒక చోట చైర్మన్ ఎన్నిక జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 112 సంఘాలకుగాను 110 ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల రైతు లు ఎన్నికలను బహిష్కరించారు. తిరుపతి జిల్లాలో 610 సంఘాలు ఉండగా, 406 సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా అత్యధికం కూటమి పార్టీలు కైవశం చేసుకొన్నాయి. బీఎన్ కండ్రిక మండలం నీరుపకోట గ్రామంలో ఒక అభ్యర్థి మరో అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చించేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీలో గ్రూపుల విభేదాల వల్ల ఆరు సంఘాల ఎన్నికలు వాయిదాపడ్డాయి. గుంటూరు జిల్లాలో 106 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో 6,049 మేజర్, మీ డియం సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేయగా, 5,946 సం ఘాలకు(దాదాపు 90 శాతం) నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పిఠాపురంలో అస్వస్థత
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం మల్లవరం పీబీసీ నీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడిన అభ్యర్థులు ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కృష్ణాజిల్లా పెడన మండలం నందిగామలో ఎన్నికల అధికారిపై ఓ అభ్యర్థి కత్తితో దాడి చేశాడు. టీడీపీ మండలాధ్యక్షుడు చల్లపాటి ప్రసాదు బలపర్చిన పామర్తి వెంకటేశ్వరరావుకు రెండు ఓట్లు రావడంతో రెచ్చిపోయిన వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారి మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశాడు.
Updated Date - Dec 15 , 2024 | 04:25 AM