కేసులకు భయపడి ఆర్జీవీ పారిపోయాడు: బుద్దా
ABN, Publish Date - Dec 02 , 2024 | 05:01 AM
వైసీపీ ప్రభుత్వ సహకారంతో ఆర్జీవీ ఇష్టం వచ్చినట్టు వాగాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్‌లో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు.
విజయవాడ వన్‌టౌన్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ సహకారంతో ఆర్జీవీ ఇష్టం వచ్చినట్టు వాగాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్‌లో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. దమ్ముంటే బయటికొచ్చి నిలబడాలి. తాను చేసింది కరెక్టేనని చెప్పుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాటి వర్మ తీసిన సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే ఇప్పుడు కేసులేమిటని జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నాడని, సినిమాల గురించి అతడు మాట్లాడటం ఏమిటని విమర్శించారు. తల్లీకూతుళ్లను వదిలేసిన వర్మను తల్లీ, చెల్లిని బయటకు పంపిన జగన్ వెనకేసుకురావటం సిగ్గుచేటన్నారు. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిగా జగన్ నియమించాడని, చంద్రబాబును కించపరిచేందుకే చెత్త సినిమాలను వర్మతో తీయించాడని విమర్శించారు.
జగన్ వ్యవహారం తెలిసి ఆ పార్టీని వీడేందుకు చాలామంది కీలక నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారని, వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. అమెరికాలోనూ ఏపీ పరువును జగన్ తీసేశాడన్నారు. ఆర్జీవీ పెట్టిన పోస్టులు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయన్నారు. వర్మకు దమ్ముంటే తానే స్వయంగా పోస్టులు పెట్టానని చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతల్లా కేసులకు భయపడి పారిపోయే వ్యక్తులు టీడీపీలో లేరని, ఐదేళ్లపాటు అరాచకాలను ఎదుర్కొని ధైర్యంగా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. చంద్రబాబు కోసం తాము ప్రాణాలిచ్చేందుకయినా సిద్ధంగా ఉంటామని వెంకన్న అన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 05:01 AM