ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: నవ శకానికి నాడు నాంది!

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:40 AM

ఈ రోజు గడిస్తేచాలు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే చాలు’ అంటూ ఎప్పటికప్పుడు రాజకీయ లాభం చూసుకునే రోజులవి! అలాంటి రోజుల్లోనే...

‘నారా చంద్రబాబు నాయుడు అను నేను’... అంటూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడు దశాబ్దాలు! రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా... ఇప్పుడు రెండోసారి నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు సృష్టించిన రికార్డు నభూతో! సంక్షేమంతోపాటు అభివృద్ధి రాజకీయాలకు, ‘విజన్‌’ విధానాలకు శ్రీకారం చుట్టిన నాయకుడు! కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన... జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మూడు దశాబ్దాలైన సందర్భంగా... పాలనలో ఆయన ముద్రపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఎన్టీఆర్‌తో పోలిస్తే చంద్రబాబుకు బలమైన జనాకర్షణ శక్తి లేదు. అంతటి వాక్పటిమా లేదు. అయినప్పటికీ... కేవలం ‘పనితీరు’ అనే ఏకైక అస్త్రంతో అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై చంద్రబాబు పట్టు సాధించారు.

‘ఫైలు’... అంటే ‘పెండింగ్‌’ అనే అర్థం ఉన్న రోజులవి. అలాంటి సమయంలో ఫైళ్ల పరిష్కారానికి వారోత్సవాలు నిర్వహించిన ఘనత దేశంలో మొట్ట మొదట చంద్రబాబుకే దక్కింది.

ఐటీ వల్ల భవిష్యత్తులో అనేక అవకాశాలు రాబోతున్నాయని గ్రహించి హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ఆ సమయానికి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు.

హైదరాబాద్‌ భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఆ రోజుల్లోనే చంద్రబాబు ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైల్‌కు రూపకల్పన చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు భూ సేకరణ అంతా ఆయన హయాంలోనే పూర్తయింది.

  • చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్లు

  • సంక్షోభ సమయంలో పాలన, పార్టీ పగ్గాలు

  • పనితీరు, ప్రతిభతో పాలనలో కొత్త పుంతలు

  • సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలతో పరుగులు

  • ‘విజన్‌’ పాలిటిక్స్‌కు తొలిసారిగా శ్రీకారం

  • ‘సీఈవో - సీఎం’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు

  • నాలుగు సార్లు సీఎంగా బాబు ఘనత

  • నేటికీ అదే ఉత్సాహం... కొత్తదనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఈ రోజు గడిస్తేచాలు.. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే చాలు’ అంటూ ఎప్పటికప్పుడు రాజకీయ లాభం చూసుకునే రోజులవి! అలాంటి రోజుల్లోనే... ‘విజన్‌’ పాలిటిక్స్‌తో దేశంలో చరిత్ర సృష్టించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అత్యంత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో 1995 సెప్టెంబరు ఒకటో తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే... నేటితో 30వ ఏట అడుగు పెడుతున్నట్లు! సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఎంత కాలం ఆ పదవిలో ఉంటారోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ... తెలుగువారిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో 45 ఏళ్ల పిన్న వయసులో ఆ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి సీఈవోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

పని.. పని.. పని...

ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెగకుండా పనిచేస్తూ శ్రమించే ముఖ్యమంత్రిగా ముద్ర పొందారు. ఆ ముద్ర ఆయనను ప్రజలకు దగ్గర చేసి వారి హృదయాల్లో చోటు కల్పించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఆయన నాటి అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నేత పి.జనార్దన రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంప్రదాయానికి తెరదీశారు. ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్లేవారు. ఆయన నిర్వహించినన్ని అఖిలపక్ష సమావేశాలు తర్వాతి కాలంలో మరెవరూ నిర్వహించలేదు. అలాగే... అనేక వర్గాల ప్రజలతో జూబిలీ హాల్‌లో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని దానికి అనుగుణంగా విధానాలు రూపొందించారు. ముఖ్యమంత్రి హోదాలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచేవారు. హైదరాబాద్‌లో కనీస వసతుల అభివృద్ధికి ఈ ఆకస్మిక తనిఖీలు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే ఎక్కడ ఏ లోపాన్ని పట్టుకొంటారోనన్న భయంతో అధికారులు ఒకటికి రెండుసార్లు అన్నీ సరిచూసుకొనేవారు. పచ్చదనం- పరిశుభ్రం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టి నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత పెంచారు. ప్రతి నెలా రెండో శనివారం దీనికి కేటాయించారు.

‘క్లియర్‌’గా ఫైళ్లు...

‘ఫైలు’... అంటే ‘పెండింగ్‌’ అనే అర్థం ఉన్న రోజులవి. అలాంటి సమయంలో ఫైళ్ల పరిష్కారానికి వారోత్సవాలు నిర్వహించిన ఘనత దేశంలో మొట్ట మొదట చంద్రబాబుకే దక్కింది. ఏ స్థాయి అధికారి ఎన్ని రోజుల్లో ఫైళ్లు పరిష్కరించాలో గడువు విధించారు. భవన నిర్మాణ అనుమతులు వంటి దరఖాస్తులపై నిర్దిష్ట గడువులోపు నిర్ణయం తీసుకోకపోతే... దానంతట అదే అనుమతి మంజూరయ్యే విధానాన్ని కూడా ఆయనే తెచ్చారు. ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉన్నాయో ప్రతి మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు లెక్కరాసి ఇచ్చేవారు. తన వద్ద ఫైళ్ల క్లియరెన్స్‌కు ఎన్ని రోజులు పడుతోందో కూడా ఆయన బహిరంగంగా చెప్పేవారు. దీనివల్ల ఫైళ్లు వేగంగా కదలడం మొదలైంది.


కంప్యూటర్‌లకు స్వాగతం...

ప్రభుత్వ శాఖలను కంఫ్యూటరీకరించడం చంద్రబాబు సాధించిన అతి పెద్ద విజయం. అన్ని శాఖల పరిధిలోని మొత్తం సమాచారాన్ని కంఫ్యూటర్లలోకి ఎక్కించడానికి ఆయన అధికారుల వెంటపడ్డారు. చంద్రబాబు హయాంలోనే ‘ఈ-సేవ’ కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి అడుగు పెట్టకుండానే బిల్లుల చెల్లింపు, సర్టిఫికెట్లు తీసుకోవడం అప్పుడే మొదలైంది. తర్వాతి కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాయి. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను రాష్ట్ర రాజధానితో ఆన్‌లైన్‌లో అనుసంధానించడం, పలు శాఖలను ఒకే పోర్టల్‌ పరిధిలోకి తేవడం వంటి వినూత్న విధానాలు కూడా చంద్రబాబు హయాంలోనే పురుడు పోసుకొన్నాయి.

వినూత్నం... పారిశ్రామికం...

పరిశ్రమలు, పెట్టుబడుల సాధనలో చంద్రబాబు వినూత్నమైన పంథాలో సాగారు. అదీ ఇదీ అని కాకుండా... వీలైనన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించారు. హైదరాబాద్‌ శివార్లలో ఫార్మా కంపెనీల కోసం ఫార్మా పార్క్‌ ఏర్పాటు చేశారు. దేశంలో మొదటిసారిగా ప్రైవేటు రంగంలోని వారితో హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మింపచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెరగడానికి ఈ విమానాశ్రయం బాగా దోహదం చేసింది. హైదరాబాద్‌ సహా ఉమ్మడి రాష్ట్రమంతా రోడ్ల వెడల్పును భారీ స్థాయిలో చేపట్టింది చంద్రబాబే.

ఐటీకి శ్రీకారం

యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు దాని కోసం ఏం చేయాలన్నదానిపై అనేక సమావేశాలు నిర్వహించారు. ఐటీపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచంలో అగ్రగామి ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ తన డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించడంలో సఫలమైన చంద్రబాబు ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. హైదరాబాద్‌ు, ఆంధ్రప్రదేశ్‌ ‘బ్రాండ్‌’ పెంచేదుకు అమెరికాలో విస్తృతంగా రోజుల తరబడి పర్యటించి ప్రతి కంపెనీ వద్దకు తానే తిరిగారు. వచ్చిన కంపెనీలకు భవనాలు వెతికి పెట్టడం మొదలుకొని ఇంటర్‌నెట్‌ ప్యాకేజీలు మాట్లాడిపెట్టడం, ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడం వంటి మొత్తం పనులను ప్రభుత్వ అధికారులతో చేయించారు. ఫోన్‌ కంపెనీలతో మాట్లాడి ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీతో ప్యాకేజీలు ఇప్పించారు. వాటికి అవసరమైన వసతులతో మొదట హైటెక్‌ సిటీ భవనం నిర్మింప చేయడంతోపాటు తర్వాతి కాలంలో ఏకంగా సైబరాబాద్‌ నిర్మాణానికి బాటలు వేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో పనులు వేగంగా జరుగుతాయన్న పేరు రావడంతో... అనేక కంపెనీలు క్యూ కట్టాయి. అవినీతికి ఆస్కారం లేకుండా పెట్టుబడులు సాధించారు. ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరుల కోసం రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్‌ కళాశాలలు పెంచే ప్రక్రియ ఆయన హయాంలోనే మొదలైంది. ఇంకా... ప్రాథమిక విద్య నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేశారు. విద్య మీద దృష్టి పెరగడంతో ఐఐటీల్లో రాష్ట్రానికి భారీగా సీట్లు రావడం మొదలైంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడం కోసం పట్టుబట్టి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తెచ్చారు.


సంస్కరణల సారథి

ముఖ్యమంత్రిగా తన తొలి హయాంలోనే చంద్రబాబు సంస్కరణలను బలంగా ముందుకు తీసుకెళ్లారు. దీనివల్ల ఆయన రాజకీయంగా నష్టపోయినా... తర్వాతి కాలంలో అనేక రంగాలు దానివల్ల పురోగమించాయి. విద్యుత్‌ రంగంలో ఆయన చేపట్టిన సంస్కరణలు జవాబుదారీతనాన్ని పెంచాయి. ఆ రంగంలో మౌలిక వసతులను ఆయన బాగా అభివృద్ధి చేయడం తర్వాతి కాలంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సఫలం కావడానికి దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటు సంస్ధలు తమ పెట్టుబడులతో రోడ్లు వేసి టోల్‌ విధానాన్ని అమలు చేయించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా రోడ్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా అభివృద్ధి అయింది. ప్రభుత్వ రంగంలో ఉండి ఎదుగూ బొదుగూ లేని టెలిఫోన్‌ వ్యవస్థలోకి ప్రైవేటు కంపెనీలు అడుగు పెట్టడానికి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర స్ధాయి కమిటీ సిఫారసులు ఉపకరించాయి. కేవలం నివేదిక ఇవ్వడానికి పరిమితం కాకుండా... సిఫారసులు అమలయ్యేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.

ఇలా మొదలైంది...

యూనివర్సిటీ రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన చంద్రబాబు... 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో కీలక స్థానానికి చేరుకొన్నారు. లక్ష్మీ పార్వతి వ్యవహార శైలితో విసుగు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో... ఎన్టీ రామారావు స్ధానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అఽధిష్టించారు. ఆయన అప్పటికే ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు.

అదే ఉత్సాహం...

ముప్ఫై ఏళ్ళ తర్వాత కూడా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదే ఉత్సాహం, దూరదృష్టితో పనిచేస్తుండటం విశేషం. ఈసారి ఆయన ‘వికసిత ఆంధ్రప్రదేశ్‌-2047’ ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెట్టారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ పనిలో మునిగిపోతున్నారు. ‘అమరావతి’ అనే ఒక నగర నిర్మాణానికి పూనుకుని... నవ్రాంధ్య సమగ్ర ప్రగతిపై దృష్టి సారించారు.

కేంద్రంలో పలుకుబడి... రాష్ట్రానికి ఉపయోగపడి..

తన తొలి ముఖ్యమంత్రిత్వ కాలంలో చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో అపారమైన పలుకుబడి పొందగలిగారు. ఇది రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడింది. ఆయన మద్దతుతో మొదట దేవెగౌడ, తర్వాత గుజ్రాల్‌ ప్రధాన మంత్రులయ్యారు. ఆ ప్రయోగం విఫలమైన తర్వాత ఆయన వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీల బలంతోనే వాజపేయి ప్రభుత్వం నిలబడి ఉన్నా.... ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులను చంద్రబాబు తీసుకోలేదు. లోక్‌సభ స్పీకర్‌ పదవిని మాత్రం తీసుకొని బాలయోగిని ఆ పదవిలో కూర్చోబెట్టారు. చంద్రబాబు సిఫారసుతోనే అబ్దుల్‌ కలాంను వాజపేయి రాష్ట్రపతిని చేశారు. చంద్రబాబు పలుకుబడి, పాలనా దక్షత ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో దేశానికి ఏ విదేశీ ప్రముఖుడు వచ్చినా ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌కు వచ్చేవారు. ప్రపంచపటంలో చోటు హైదరాబాద్‌ సంపాదించడానికి ఈ పరిణామాలు ఉపయోగపడ్డాయి. జాతీయ క్రీడలను చంద్రబాబు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించడంతో ఆఫ్రో ఆసియా క్రీడలు నిర్వహించే అవకాశం కూడా ఆ సమయంలో రాష్ట్రానికి దక్కింది.

Updated Date - Sep 01 , 2024 | 07:47 AM

Advertising
Advertising