AP-TG: ‘పొత్తు’ లాభం.. ఏపీకి దక్కిన రూ. 2,500 కోట్లు..
ABN, Publish Date - Aug 23 , 2024 | 04:30 AM
అవి... హైదరాబాద్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు! వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగింది.
ఏపీకి దక్కిన రూ.2,500 కోట్లు
హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలూ, వడ్డీ చెల్లిస్తున్న ఏపీ
42 శాతం ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం
నాడు సహకరించని కేసీఆర్, పట్టించుకోని జగన్
సమస్యల పరిష్కారంపై చంద్రబాబు చొరవ
కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో స్పందించిన టీ-సర్కారు
ఏపీ ఖాతాకు నిధులు బదిలీ
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అవి... హైదరాబాద్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు! వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగింది. ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ, అసలును ఏపీ ప్రభుత్వమే కడుతోంది! ఏటా అందులో 42 శాతాన్ని తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. అలా కట్టేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి! కానీ... పదేళ్లు కేసీఆర్ సర్కారు కట్టలేదు! కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్‌కు ఈ విషయం అసలు పట్టనేలేదు. ఇప్పుడు... ‘పొత్తు’ లాభం ఫలించింది! పదేళ్లకు సంబంఽధించిన రూ.2500 కోట్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందాయి.
కేంద్ర ఆర్థిక శాఖ సూచన/ఆదేశాల మేరకు టీ-సర్కారు ఈ నిధులను ‘అంతర్ రాష్ట్ర నిధుల బదిలీ’ (ఐజీటీ) ద్వారా ఏపీ ఖాతాకు జమ చేసింది. ఇది న్యాయంగా ఏపీకి దక్కాల్సిన సొమ్మే. ఎవరికీ ఏమీ అభ్యంతరాలు లేవు. కానీ, పదేళ్ల పాటు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం... తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు. విభజన సమస్యల పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. ఇక... చెల్లింపుల సంగతి సరేసరి. అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేంద్రంవద్ద ఈ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తూ వచ్చారు. అంతా కొలిక్కి వచ్చే సమయానికి... ఎన్డీయేతో కటీఫ్ చెప్పాల్సి వచ్చింది. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. 2019లో జగన్ సీఎం అయ్యారు. విభజన సమస్యల గురించి పట్టించుకోనేలేదు. జగన్‌కు అటు కేంద్రంలో మోదీతో, తెలంగాణలో కేసీఆర్‌తో సత్సంబంధాలున్నప్పటికీ... అవి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడ లేదు.
కలిసి వచ్చిన కాలం... నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి కాగానే విభజన సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరించారు. పైగా... ఎన్డీయే సర్కారులో టీడీపీది కీలక పాత్ర కావడంతో కేంద్రం కూడా సహకరించింది. హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదే క్రమంలో హైదరాబాద్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఈఏపీ (విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు) రుణాల అసలు, వడ్డీ మొత్తాన్ని ఏపీ సర్కారే చెల్లిస్తున్న అంశం తెరపైకి వచ్చింది. ఇందులో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ చెల్లించాలి. కానీ... పదేళ్లుగా తెలంగాణ నుంచి చెల్లింపులే జరగలేదు. ఇప్పుడు, ఇన్నేళ్లకు దీనికి సంబంధించిన రూ.2500 కోట్లు ఏపీకి దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది. పొత్తు లాభాలను స్వప్రయోజనాలకు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read:
సంతకాల కోసం కేసీఆర్, హరీశ్ ఒత్తిడి చేశారు..
సీఎం చంద్రబాబుతో నాదిర్ గోద్రెజ్ భేటీ
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 23 , 2024 | 09:02 AM