AP News: ఏపీకి డబుల్ బొనాంజా.. భారీగా నిధులు కేటాయించిన కేంద్రం..
ABN, Publish Date - Aug 28 , 2024 | 05:03 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బొనాంజా. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు.. రాష్ట్రంలో 2 ఇండిస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది.
న్యూఢిల్లీ, ఆగష్టు 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బొనాంజా. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు.. రాష్ట్రంలో 2 ఇండిస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది. బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును గతంలో నిర్మించిన నిర్మాణ సంస్థలకే పనులు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జగన్ నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనక్కి వెళ్లిందని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంపై దృష్టి పెట్టారన్నారు. ఆయన నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఏపీకి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
పోలవరం ఒక్కటే కాదు.. మరికొన్ని కేటాయింపులు కూడా చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇవాళ జరిగిన కేబినెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. పారిశ్రామిక కారిడార్లు దేశ వ్యాప్తంగా 12 ఏర్పాటు చేస్తే.. అందులో 2 ఏపీలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్‌లో చెప్పిన కొద్దిరోజుల్లోనే వాస్తవ రూపంలోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ - బెంగళూరు కారిడార్, విశాఖ - చెన్నై కారిడార్‌లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఓర్వకల్లులో ఒకటి, కొప్పర్తిలో ఒకటి ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఒక్క ఓర్వకల్లు నోడ్‌లో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. కొప్పర్తి నోడ్ కి రూ. 2,131 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. ఇక్కడ రూ. 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయన్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలగనుందన్నారు.
డబుల్ ఇంజన్ గ్రోత్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కారణంగా ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత కొన్నేళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. అందుకే ప్రజలు తిరుగులేని మెజారిటీతో చంద్రబాబు-మోడీ-పవన్ కళ్యాణ్ లను ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనా వ్యయం రూ 12,000 కోట్ల మేర నిధులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలుపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. పెండింగ్ అంశాలను కూడా త్వరగా పరిష్కరించే బాధ్యత తాము తీసుకుని ముందుకు నడిపిస్తామన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ సహా పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందన్నారు.
Also Read:
వైసీపీకి మరో బిగ్ షాక్.. ఇక దుకాణం మూసేయాల్సిందేనా..!?
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 28 , 2024 | 05:23 PM