Andhra Pradesh : ‘హోం ఓటింగ్’ వద్ద వైసీపీ రచ్చరచ్చ
ABN , Publish Date - May 09 , 2024 | 06:13 AM
హోం ఓటింగ్‌లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులు టీడీపీకి అనుకూలంగా ఓటేస్తున్నారన్న అసహనంతో మంత్రి అంబటి రాంబాబు అనుచరులు బుధవారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో అరాచకం సృష్టించారు
టీడీపీకి అనుకూలంగా ఓటేస్తున్నారని దాడులు
ముప్పాళ్ల, వెల్దుర్తి, మే 8: హోం ఓటింగ్‌లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులు టీడీపీకి అనుకూలంగా ఓటేస్తున్నారన్న అసహనంతో మంత్రి అంబటి రాంబాబు అనుచరులు బుధవారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో అరాచకం సృష్టించారు. ‘కమ్మవారైనా మరెవరైనా వైసీపీకి ఓటు వేయాల్సిందే, లేకుంటే బయటకు లాగి తంతాం’ అంటూ టీడీపీ మద్దతుదారుల గృహాల వద్ద అధికారుల సమక్షంలోనే రాళ్ల దాడిచేశారు. దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత.. మాదలలో వృద్ధుడైన పెదపరిమి భూషయ్యతో ఓటు వేయించేందుకు అధికారులు అతడి ఇంటి వద్దకు వెళ్లారు. వైసీపీకే ఓటు వేయాలని అధికారుల ముందే అతడితో వైసీపీ వర్గీయులు గొడవపెట్టుకున్నారు.
వారిని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన రావిపాటి నాగేశ్వరరావు, కందుల నరశింహారావుల తలకు గాయాలయ్యాయి. ప్రతిదాడిలో వైసీపీకి చెందిన పుల్లారెడ్డి తలకు కూడా గాయమైంది. మరో నలుగురికి స్వల్ప గాయాలవగా సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తలించారు.
వీడియోలు తీస్తే బాగోదని పోలీసుల ముందే విలేకర్లను వైసీపీ వారు బెదిరించారు. 17 ఓట్లకే ఇలా ఉంటే 13న జరిగే పోలింగ్‌లో ఎంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, హోం ఓటింగ్‌లో టీడీపీకి అనుకూలంగా వేస్తున్నారన్న అసహనంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు.
బొడ్రాయి సెంటర్లో ఉన్న ఓ దివ్యాంగుడితో ఓటు వేయించేందుకు అధికారులు బుధవారం అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. టీడీపీకి చెందిన అందుగుల లచ్చయ్యపై వైసీపీ మూకలు దాడి చేశాయి. పదునైన ఆయుధంతో వైసీపీ నేతలు చేసిన దాడిలో లచ్చయ్య చేయి, తలకు తీవ్ర గాయమైంది.