Somireddy: పత్రికారంగంలో మకుటంలేని మహారాజు
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:40 PM
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి మరణంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీరావుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని..1991లో నెల్లూరులో పుట్టిన సారావ్యతిరేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉద్యమం విజయవంతం కావడాన్ని బాధ్యతగా భావించారని వెల్లడించారు.
నెల్లూరు: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి మరణంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీరావుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని..1991లో నెల్లూరులో పుట్టిన సారావ్యతిరేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉద్యమం విజయవంతం కావడాన్ని బాధ్యతగా భావించారని వెల్లడించారు. సారా వ్యతిరేక ఉద్యమ అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన తనను ప్రోత్సహించి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ సభ పెట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇవ్వడం, ఆ వెంటనే అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి సారాను నిషేధించడం...ఈ విషయాల్లో ఈనాడు, రామోజీరావు పాత్ర కీలకమని సోమిరెడ్డి పేర్కొన్నారు.
కరువులు, వరదలు, సునామీ తదితర ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఈనాడు సంస్థల తరఫున ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. పత్రికారంగంలో మకుటంలేని మహారాజుగా రామోజీరావు గుర్తింపు పొందారన్నారు. ఈనాడు పత్రికను జాతీయ స్థాయిలో నిజాయతీకి మారుపేరుగా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సామాన్య ప్రజల గొంతుకగా నడిపించారన్నారు. 50 ఏళ్ల ప్రస్థానంతో ప్రతి తెలుగు కుటుంబానికి ఈనాడు పత్రికతో అనుబంధం ఏర్పరచడంలో విజయవంతమయ్యారని సోమిరెడ్డి తెలిపారు. ఈనాడు పఠనంతోనే లక్షలాది తెలుగు కుటుంబాల దినచర్య ప్రారంభమయ్యేలా పత్రికను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఏ రంగంలో అయినా నీతి, నిజాయతీలతో పనిచేసి సక్సెస్ సాధించడం ద్వారా తెలుగు ప్రజలకు ఐకాన్ గా నిలిచారన్నారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సోమిరెడ్డి తెలిపారు.
Updated Date - Jun 08 , 2024 | 12:40 PM