Temple Treasury : కోటి రూపాయల చెట్టు..!
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:40 AM
ఒక చెట్టు నుంచి మహా అయితే ఎంత ఆదాయం వస్తుంది! అది ఏ రకమైనా.. పండ్లు, పూలు లేదా ఆయుర్వేద ఔషధ రూపంలో వందల నుంచి వేల రూపాయల్లో ఉండొచ్చు.
అన్నవరం సత్యదేవుడి ఆలయంలో రావిచెట్టు
దీని వద్ద ఆవునెయ్యి దీపాల విక్రయానికి వేలంపాట ద్వారా భారీగా ఆదాయం
అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఒక చెట్టు నుంచి మహా అయితే ఎంత ఆదాయం వస్తుంది! అది ఏ రకమైనా.. పండ్లు, పూలు లేదా ఆయుర్వేద ఔషధ రూపంలో వందల నుంచి వేల రూపాయల్లో ఉండొచ్చు. అయితే కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టు వలన ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయం వస్తుందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం! ఈ రావి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తే కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందువల్ల దేవస్థానం ఈ చెట్టు వద్ద ఆవు నెయ్యి దీపాలు విక్రయించేందుకు ప్రతి ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది ప్రతినెలా రూ.7,51,599 చొప్పున చెల్లించేలా కాంట్రాక్టరు హెచ్చుపాటకు దక్కించుకున్నారు. ఈ ఏడాది కార్తీక మాసం ప్రారంభానికి ముందు 10శాతం అదనంతో నెలకు రూ.8,26,758 చెల్లించేంలా హెచ్చుపాట వెళ్లింది. ఈ లెక్కన ఈ ఏడాదికి రూ.99,21,096 ఆదాయం వస్తుంది. దీంతోపాటు అక్కడి ప్రత్యేక హుండీ ద్వారా ఏటా రూ.4 లక్షల వరకు వస్తాయి. వెరసి ఈ రావిచెట్టు ద్వారా మొత్తం రూ.1.03 కోట్ల వరకు సత్యదేవుడి ఖజానాకు జమ కానుంది.
Updated Date - Dec 03 , 2024 | 05:40 AM