ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VG Venkata Reddy : చిక్కడు.. దొరకడు!

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:32 AM

కోస్ట్‌గార్డ్‌ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి వ్యవహారం చిక్కడు..దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు.

  • అజ్ఞాతంలోనే ‘గనుల’రెడ్డి!

  • వైసీపీ ముఖ్య నేత సూచనతోనే

  • చెన్నైలో సేద తీరుతున్నారని ప్రచారం

  • ఈ నెల 31న వెంకటరెడ్డి పదవీ విరమణ

  • సర్వీసులో ఉండగా అరెస్టు చేస్తే తంటా

  • రక్షణ శాఖ నుంచి సమస్యలొచ్చే చాన్సు

  • అందుకే జగన్‌ శిబిరం సలహాతో మాయం

  • అటు ఏసీబీ తీరుపైనా సందేహాలు

  • ఆయనపై ఇంతవరకు కేసే పెట్టని వైనం

  • సెప్టెంబరులో ముందస్తు బెయిల్‌కు వెంకటరెడ్డి?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కోస్ట్‌గార్డ్‌ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి వ్యవహారం చిక్కడు..దొరకడులా మారింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు.

ఆయన ఆచూకీని ఏసీబీ ఇంతవరకు కనిపెట్టలేకపోయింది. ఈ నెల 31న రిటైరయ్యేవరకు ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వైసీపీ ముఖ్య నేత సలహాతో ఆయన ప్రస్తుతం చెన్నైలో సేద తీరుతున్నారని తెలుస్తోంది. గనుల శాఖలోని జోడు పదవుల నుంచి తప్పించిన సర్కారు.. ఆయన్ను తన నియంత్రణలో ఉంచుకోలేకపోయింది. ఇసుక టెండర్లలో అక్రమాలకు సంబంధించి జూలై 31న ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

అదే రోజున ఆయన డిప్యుటేషన్‌ కాలపరిమితి కూడా ముగిసింది. అదే రోజున సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీచేసినా.. వాటిని అందుకునేందుకు ఆయన అందుబాటులో లేరు. కడప జిల్లాలో సొంతింట్లో, హైదరాబాద్‌, తిరుపతి, చెన్నైల్లో పోలీసు బృందాలు గాలించినా లాభం లేకపోయింది. మాతృశాఖకు కూడా సమాచారం ఇవ్వకుండా మాయమయ్యారు.


ఇసుక టెండర్లలో అక్రమాలపై విచారణ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్‌తోపాటు జేపీ వెంచర్స్‌ను అడ్డంపెట్టుకుని ఇసుక మాఫియా నడిపిన వైసీపీ ముఖ్య నేతల పాత్రను వెలికితీయడం అన్న మాట. ఇటు ప్రభుత్వానికి, అటు జగన్‌ శిబిరానికి ఈ కేసు చాలా కీలకమైనది. వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేస్తే తమ మెడకూ చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో జగన్‌ శిబిరం ఆయన్ను అజ్ఞాతంలోకి పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ నెల 31న కోస్ట్‌గార్డ్‌ సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా వెంకటరెడ్డి పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ ప్రక్రియ సజావుగా సాగేంత వరకు ఏసీబీ కంటపడొద్దని వైసీపీ ముఖ్య నేత గట్టిగా సూచించినట్లు వెంకటరెడ్డి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందుకే చెన్నైలో వెంకటరెడ్డి సేదతీరుతున్నట్లు తెలిసింది.

రిటైర్మెంట్‌ తర్వాత సెప్టెంబరు మొదటి వారంలో అనారోగ్య కారణాలను చూపి ముందస్తు బెయిల్‌ తీసుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వెంకటరెడ్డి విషయంలో ఏసీబీ మెతగ్గా వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయు. ఇప్పటి వరకు ఆయనపై కేసే నమోదు చేయకపోవడం, లుకౌట్‌ నోటీసులు ఇవ్వకపోవడం వీటికి బలం చేకూరుస్తున్నాయి.


ఆయన కోసం పోస్టే సృష్టించారు!

వెంకటరెడ్డి కోస్ట్‌గార్డ్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌. 2019 వరకు ఆయనెవరో ఎవరికీ తెలియదు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక 2019 డిసెంబరులో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు.

సీఎం పేషీ అధికారి ధనుంజయరెడ్డి సహకారంతో స్పెషల్‌ సెక్రటరీ అనే పోస్టు సృష్టించి వెంకటరెడ్డిని నియమించారు. ఆ తర్వాత 2020లో గనులశాఖ డైరెక్టర్‌గా నియమించారు.

ఆ తర్వాత కొంతకాలానికే ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను, ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కి.. జగన్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారని తొలి నుంచీ విమర్శలు ఉన్నాయి. 2023లోనే ఆయన డిప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసిపోయింది. అయితే జగన్‌ సర్కారు కేంద్రం ద్వారా 2024 జూలై 31 వరకు పొడిగింపు ఇప్పించింది.


మళ్లీ రాష్ట్రంలో జగన్‌ సర్కారే వస్తుందని, తాను ఏపీఎండీసీ ఎండీగా కొనసాగుతానని వెంకటరెడ్డి ధీమాతో ఉండేవారు. ఆగస్టు 31న పదవీవిరమణ చేసినా గనులశాఖలోనే కొనసాగిస్తామని జగన్‌ శిబిరం నుంచి హామీలు లభించాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక..

ఆయన డిప్యుటేషన్‌ ముగిసిన రోజునే.. జూలై 31వ తేదీన ఇసుక టెండర్ల అక్రమాల ఆరోపణలపై సస్పెండ్‌ చేసింది. సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందుకునేందుకు వెంకటరెడ్డి అందుబాటులో లేరు. సస్పెండ్‌ చేయడానికి ఒక రోజు ముందే కోస్ట్‌గార్డ్‌ సర్వీసులో తిరిగి చేరిపోయారని, అక్కడే విధుల్లో ఉన్నారని ప్రచారం జరిగినా తర్వాత అది వాస్తవం కాదని తేలింది.


ఆయన ఇంటి గోడలకు సస్పెన్షన్‌ ఉత్తర్వుల కాపీలను అంటించారు. ఇసుక టెండర్లలో అక్రమాల కేసు విచారణను ఏసీబీకి అప్పగించారు. ఈ కేసులో వెంకటరెడ్డిని విచారించాల్సి ఉంది. అది జరగాలంటే ముందు ఇసుక టెండర్ల అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేయాలి. విచారణకు హాజరుకావాలని వెంకటరెడ్డికి నోటీసులివ్వాలి.

అసలీ ప్రక్రియ ఏసీబీ నుంచి జరిగిందా లేదా అన్న అనుమానాలున్నాయి. మరోవైపు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెంకటరెడ్డి కోస్ట్‌గార్డ్‌ సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా 31న పదవీ విరమణ చేసేందుకు.. రక్షణ శాఖలో ఉన్న జగన్‌ అనుయాయులు తెరవెనుక ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిసింది.

తమకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సర్వీసులో ఉండగానే ఏసీబీ అరె స్టు చేస్తే ఆ తర్వాత రక్షణ శాఖలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, అందుకే సేఫ్‌ రిటైర్మెంట్‌ కోరుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 31 వరకు ప్రభుత్వానికి, ఏసీబీకి అందుబాటులోకి రాకూడదని ఆయన అజ్ఞాతంలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

Updated Date - Aug 21 , 2024 | 04:32 AM

Advertising
Advertising
<