Vijayawada : ఎంపీడీవో అదృశ్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు!
ABN, Publish Date - Jul 19 , 2024 | 05:21 AM
నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకట రమణారావు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఒక పక్క పోలీసు, మరోపక్క ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ
కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శ
ఇంటికెళ్లి మాట్లాడిన కలెక్టర్, ఎమ్మెల్యే
రెండో రోజూ ఏలూరు కాలువలో గాలింపు
ఇంకా లభించని వెంకట రమణారావు ఆచూకీ
విజయవాడ, భీమవరం, నర్సాపురం(ఆంధ్రజ్యోతి), నరసాపురం రూరల్, జూలై 18: నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకట రమణారావు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఒక పక్క పోలీసు, మరోపక్క ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ విజయవాడలోని ఏలూరు కాల్వలో చీకటిపడే వరకూ గాలింపు కొనసాగింది. మధురానగర్ నుంచి గన్నవరం మండలం కేసరపల్లి వరకు కాల్వలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 15వ తేదీన విజయవాడ కానూరులోని మహాదేవపురం కాలనీలో ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వాట్సా్‌పలో సూసైడ్ లేఖ పంపి అదృశ్యమైన విషయం తెలిసిందే.
నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ ఆయన జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఫోన్‌లో వెంకట రమణారావు సతీమణి సునీత, పెద్ద కుమారుడు సాయిరామకృష్ణతో మాట్లాడారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు? ఆయన ఒత్తిడికి లోనవ్వడానికి కారణాలు ఏమిటి? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేవు నిర్వహణ కాంట్రాక్టరు చిన్న రెడ్డప్ప దవేజీ సక్రమంగా కాంట్రాక్టు డబ్బులు చెల్లించకుండా రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి సౌరభ్‌మీనా, సంతోష్ అనే వ్యక్తులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడేవాడని, అలా తమ నుంచే రూ.4.5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా వసూలు చేశారని సునీత సీఎంకు వెల్లడించారు.
ఘటనపై పూర్తి దర్యాప్తు చేయిస్తామని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం ఫోన్ చేసినప్పుడు పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎంపీడీవో ఇంట్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వివరాలు తనకు తెలియజేస్తుండాలని మాధవనాయుడును చంద్రబాబు ఆదేశించారు.
మరోవైపు ఎంపీడీవో కుటుంబాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఆర్డీవో అంబరీష్ పరామర్శించారు. నరసాపురం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ స్వామి గురువారం మండల పరిషత్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. రేవుకు సంబంధించిన వివరాలను, రికార్డులను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డీఎస్పీ చెప్పారు. ఎంపీడీవో సెల్‌ఫోన్‌కు వచ్చిన అపరిచిత కాల్స్‌పై దృష్టి సారించి విచారణ చేస్తున్నట్టు పెనుమలూరు సీఐ రామారావు చెప్పారు.
1.30 కోట్లు నష్టపోయా: కాంట్రాక్టర్
ఎంపీడీవో అదృశ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై రేవు నిర్వహణ కాంట్రాక్టర్ చిన రెడ్డప్ప దవేజీ స్పందించారు. తాను ఏ త ప్పూ చేయలేదని, ప్రభుత్వానికి రూ.56 లక్షలు కట్టాల్సింది వాస్తమని, రేవు నిర్వహణ వల్ల రూ.1.30 కోట్లు నష్టపోయానని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి తనకు సహాయ సహకారాలు అందించలేదని, ఇదే క్రమంలో రూ. 50 లక్షల విలువ చేసే పంటును మండల పరిషత్ స్వాధీనం చేసుకుందని, ఇవి కాకుండా ప్రభుత్వం నుంచి తనకు రూ.11 లక్షలు రావాల్సి ఉందని, ఇవన్నీ లెక్కిస్తే తాను ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వీడియో లో పేర్కొన్నారు. పత్రికలకు కూడా ప్రకటనను విడుదల చేశారు. గతేడాది రూ.3.61 కోట్లకు రేవు పాడి పూర్తిగా చెల్లించానని పేర్కొన్నారు.
Updated Date - Jul 19 , 2024 | 05:21 AM