AP NEWS: విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణాలు: బండారు సత్యనారాయణ మూర్తి
ABN, Publish Date - Feb 13 , 2024 | 03:35 PM
విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ఆరోపించారు.
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ఆరోపించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున విధులు చేపట్టి మూడేళ్లు అవుతుందన్నారు. ఆయనపై ఓట్ల చేర్పులు, తొలగింపుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. కలెక్టర్ హయాంలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. భూ కుంభకోణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కలెక్టర్ ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ముదపాక ఎస్సీ భూములను అక్రమంగా లాక్కున్నారన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి తెచ్చారన్నారు. బాధితులు కోర్టుకెళ్తే ఎమ్మార్వోని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. రుషికొండపై అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నీతివంతమైన జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్‌ను ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. ఇప్పటికైనా కలెక్టర్ సెలవు పెట్టి వెళ్లిపోవడం మంచిదన్నారు. కలెక్టర్‌పై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చేది జనసేన - టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులకు చర్యలు తప్పవని బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.
Updated Date - Feb 13 , 2024 | 03:35 PM