Andhra Pradesh: శాంతి వ్యవహరంలో కొత్త ట్విస్ట్.. అసలు విషయంపై స్పందిస్తారా..!
ABN , Publish Date - Jul 22 , 2024 | 09:26 AM
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహరం రోజుకో మలుపుతిరుగుతోంది. శాంతి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్మోహన్ చేసిన డిమాండ్‌తో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహరం రోజుకో మలుపుతిరుగుతోంది. శాంతి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్మోహన్ చేసిన డిమాండ్‌తో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ (YSRCP) ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారానే శాంతి బిడ్డకు జన్మనిచ్చిందంటూ మదన్మోహన్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. తనకు ఏ పరాయి మహిళతో ఎలాంటి అక్రమ సంబంధం లేదంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. వాస్తవానికి మదన్మోహన్ చేసిన ఆరోపణలు శాంతికి సంబంధించి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. వీటితో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. శాంతి బిడ్డకు తండ్రి ఎవరనే విషయంపై మదన్మోహన్ అవసరమైతే న్యాయపోరాటం చేయ్యొచ్చు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్యకాదు. కానీ శాంతి ప్రభుత్వం అండతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తాజాగా దేవదాయ శాఖ కమిషనర్ ఆమెపై మోపిన అభియోగాల్లో పేర్కొన్నారు. దేవాదాయ భూముల లీజు విషయంలో నిబంధనలు పాటించలేదని.. శాంతికి సంబంధం లేని విషయాల్లో ఆమె జోక్యం చేసుకున్నారంటూ తాజా అభియోగాల్లో దేవదాయశాఖ పేర్కొంది. దేవాదాయ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి.. అంటే ప్రజల ఆస్తి.. ఈ విషయంలో మాత్రం శాంతి స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్దంగా ఆమె వ్యవహరిస్తే.. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది.
అసలు విషయం ఏమిటంటే..
మదన్మోహన్ ఓ రాజకీయ పార్టీ నాయకుడిపై ఆరోపణలు చేయడంతో విషయం సంచలనమైంది. కానీ అదే సమయంలో ఆ రాజకీయనాయకుడి అండతో శాంతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం విచారణ ద్వారా తేల్చాల్సి ఉంది. అసిస్టెంట్ కమిషనర్‌తో ప్రభుత్వ అధికారిగా తనకు పరిచయం ఉందని.. తనకు బిడ్డ పుట్టినప్పుడు వెళ్లి పలకరించానని, తాడేపల్లిలోని తన ఇంటికి శాంతి బిడ్డతో వస్తే ఆశీర్వదించానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇక్కడివరకు పర్వాలేదు. అది వారి వ్యక్తిగత విషయం. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి పరపతిని ఉపయోగించి శాంతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా.. శాంతి అధికారాన్ని ఉపయోగించి విజయసాయిరెడ్డి లేదా ఇతర వైసీపీ నాయకులు లేదా మరెవరైనా వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి లబ్ధిపొందారా అనేది తేలాల్సి ఉంది.
శాంతిపై ఆరోపణలు..
దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతికి అధికారం లేకపోయినా ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా పరిధిలో అనకాపల్లి సిద్ధేశ్వరస్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్డేంజ్ రెస్ట్‌హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజు విషయంలో శాంతి నిబంధనలు పాటించలేదని దేవాదాయశాఖ అభియోగాలు మోపింది. ప్రభుత్వబ నిబంధనల ప్రకారం భూముల లీజును మూడు సంవత్సరాలకు బదులు 11 సంవత్సరాలకు రెన్యువల్ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపగా.. అవి రెన్యువల్ కావడంపై వివరణ ఇవ్వాలంటూ శాంతిని దేవాదాయశాఖ కమిషనర్ కోరారు. వాస్తవానికి ఆ భూముల లీజు విషయంలో తుది నిర్ణయం తీసుకోవల్సింది దేవాదాయ కమిషనర్. శాంతి నిబంధనలకు విరుద్దంగా ప్రతిపాదనలు పంపిస్తే కమిషనర్ ఎలా అనుమతించారనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిషర్‌పై ప్రభుత్వం నుంచి ఎవరు ఒత్తిడి చేశారు. ఎవరి ఒత్తిడితో లీజుల రెన్యువల్ జరిగింది. ఈ రెన్యువల్ వల్ల లబ్ధిపొందింది ఎవరనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కొంతమందికి లబ్ధిచేకూర్చడం కోసం నిబంధనలు అతిక్రమిస్తే.. రూల్స్ పాటించని వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దేవాదాయశాఖకు శాంతి ఎలాంటి వివరణ ఇస్తారు. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఏమి చెబుతారనేది ఆసక్తిగా మారింది. ఈ ఎపిసోడ్ మరెన్ని మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News