Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:58 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం: జిల్లాలో డయేరియా (Diarrhea)తో 8 మంది చనిపోయారని వైసీపీ (YCP) చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. గుర్ల మండలంలో డయేరియాతో ఒక్కరు మాత్రమే చనిపోయారని.. ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. జిల్లాలో డయేరియా కేసుల విషయంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు కూలిపోయాయని.. ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంత వరకు ఎందుకు గ్రామాన్ని సందర్శించలేదని కిమిడి నాగార్జున నిలదీశారు.
కాగా ఉమ్మడి జిల్లాలో డయేరియా విలయతాండవం చేస్తోంది. గత కొద్దిరోజులుగా వ్యాధి ప్రబలుతున్న తీరు చూస్తుంటే కలుషిత జలాలే కారణమని తెలుస్తోంది. ప్రధానంగా చంపావతి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. చంపావతి నదిలో నీరు కలుషితం కావడం, భూగర్భ జలాల్లో ఆ నీరు కలవడం, అదే నీటిని ప్రజలు తాగడం వల్లే డయేరియా వ్యాప్తికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యాధి నియంత్రణతో పాటు మరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు. దీంతో బాధితులను జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు.
ఆస్పత్రులు కిటకిట
జిల్లాలో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. జ్వరపీడితులు, డయేరియా, రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఏటా వర్షాకాలం నాటికి వైద్యారోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టేది. కానీ ఈ ఏడాది ఆ ప్రణాళిక కొరవడింది. దీనికితోడు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో వ్యాధులు పెరుగుతున్నాయి. మలేరియా శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు తేట తెల్లమైంది. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముందస్తు ప్రణాళిక లేక..
విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉంది. 11 సామాజిక ఆస్పత్రులు, 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. వేలాది మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ముందస్తుగా సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేసేవారు. ప్రమాదకర జ్వరాలు, వ్యాధుల నియంత్రణకు ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై ఉన్నతస్థాయిలో సమీక్షించేవారు. ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచేవారు. కానీ, ఈ ఏడాది యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఏడాది కావడంతో ఎలక్షన్ కమిషన్ పరిధిలో యంత్రాంగం వెళ్లిపోయింది. అందుకే ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అర్థమవుతోంది.
అదుపులోకి వస్తుంది..
గుర్లలో డయేరియా అదుపులోకి వస్తోందని, గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోందని విజయనగరం డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. లక్షణాలు తగ్గుముఖం పట్టి ఇంటికి వెళ్లిన వారి నుంచి కుటుంబసభ్యులకు సోకుతోందని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించామన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే వ్యాధి సోకినట్టు ప్రాథమిక నిర్ధారణ అయ్యిందని, వ్యాధి అదుపులోకి వచ్చే వరకూ గ్రామంలో వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గత ఐదేళ్లుగా దెబ్బతిన్న గ్రామాలు..
కాగా గత ఐదు సంవత్సరాలుగా గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కనీసం పారిశుధ్య పనులు చేపట్టాడానికి వీలులేని పరిస్థితి.. కొన్ని చిన్న పంచాయతీల్లో కనీస స్థాయిలో కూడా నిధులు లేవు. కేంద్రం అందించే ఆర్థిక సంఘ నిధులు కూడా వివిధ పద్దుల కింద ఇతర బకాయిలకు సర్దుబాటు చేశారు. జిల్లాలో 777 పంచాయతీల్లో.. కొన్ని మాత్రమే సొంతంగా నిధులు సర్దుబాటు చేసుకునేవి. మిగతావి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించుకోలేని స్థితిలోకి కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత
దివ్వెల మాధురికీ తిరుమల పొలీసుల నోటీసులు..
గ్రూప్1 పరీక్షలకు లైన్ క్లియర్
అమరావతికి నిధులు వస్తున్నాయి..
టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 20 , 2024 | 01:58 PM