Eluru: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పెళ్లి చేయాలంటూ ఏకంగా కత్తితో..
ABN, Publish Date - Dec 15 , 2024 | 05:18 PM
ఏలూరు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి 39వ పిల్లర్ వద్ద శనివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు గుర్తించారు.
ఏలూరు: దేశవ్యాప్తంగా ఆడవారిపై ప్రతి నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యాచారాలు చేస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నా, పెద్దా, ముసలి అనే తేడా లేకుండా వారిపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు ప్రేమ, పెళ్లి పేరుతో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారు. ఒప్పుకోకపోతే దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. యాసిడ్ దాడులు, కత్తులతో చెలరేగిపోతున్నారు. ప్రేమోన్మాదులు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తారోనని యువతులు భయాందోళనకు గరవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో యువతులకే కాదు.. వారి కుటుంబసభ్యులకు ప్రమాదం పొంచి ఉంటుంది. వారిపైనా కేటుగాళ్లు దాడి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. కుమార్తె వెంట పడొద్దని హెచ్చరించిన ఓ తండ్రిపై ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బిడ్డను వేధించవద్దని చెప్పిన పాపానికి బాలిక తండ్రిపై ఉన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అత్యంత దారుణంగా పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మృతదేహం లభ్యం..
ఏలూరు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి 39వ పిల్లర్ వద్ద శనివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు గుర్తించారు. హతుడు ఆటో డ్రైవర్ షేక్ వెంకట కనకరాజు అలియాస్ బెగ్గర్ రాజుగా పోలీసులు నిర్ధరించారు. వెంకటాపురం ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రేమ పేరుతో వేధింపులు..
ఏలూరు రామకృష్ణాపురం ప్రాంతంలో వెంకట కనకరాజు అలియాస్ బెగ్గర్ రాజు అనే ఆటోడ్రైవర్ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడు రాజు కుమార్తె (మైనర్)ను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించడం మెుదలుపెట్టాడు. నెలలు తరబడి అతను వెంటపడినా బాలిక మాత్రం ఒప్పుకోలేదు. ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ వేధిస్తుండడంతో తట్టుకోలేక విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ తర్వాత కార్తీక్ కుటుంబం వెంకటాపురం ప్రాంతానికి వెళ్లిపోయింది.
దారుణ హత్య..
అయితే ప్రాంతం మారినా నిందితుడు మాత్రం రామకృష్ణాపురానికి తరచూ వస్తూ బాలికను వేధించేవాడు. ఇదే క్రమంలో ఈనెల 13న మళ్లీ బాలిక ఉంటున్న ప్రాంతానికి నిందితుడు కార్తీక్ వచ్చాడు. పెళ్లి చేసుకోవాలంటూ బాలికను వేధించడం మెుదలుపెట్టాడు. ఇది గమనించిన కనకరాజు వెంటనే అతన్ని మందలించాడు. తన కుమార్తె వెంట పడొద్దని హెచ్చరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదంతో కోపోద్రిక్తుడైన కార్తీక్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక తండ్రిపై దాడికి తెగబడ్డాడు. గొంతుపై పలుమార్లు పొడిచి హత్యా చేశాడు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ఓవర్ బిడ్జి 39వ పిల్లర్ వద్ద పడేశాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా సృష్టిస్తోంది.
Updated Date - Dec 15 , 2024 | 05:19 PM