Share News

వై నాట్‌ ప్రతిపక్ష నేత హోదా?

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:10 AM

ఎన్నికల ముందు ‘వై నాట్‌ 175’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన జగన్‌.. ఇప్పుడు ‘వై నాట్‌ ప్రతిపక్ష నేత హోదా’ అంటూ దేబిరిస్తున్నారు.

వై నాట్‌ ప్రతిపక్ష నేత హోదా?
YS Jagan

సంప్రదాయానికి భిన్నంగా జగన్‌ పాట్లు.. ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం

ఇప్పటికే స్పీకర్‌కు లేఖ, తాజాగా హైకోర్టుకు.. హోదాపై ఆదేశాల కోసం పిటిషన్‌

ఎన్నికల్లో ఏ ‘హోదా’ ఇవ్వని ప్రజలు.. అయినా సొంత ప్రయోజనాల కోసం పట్టు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు ‘వై నాట్‌ 175’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన జగన్‌.. ఇప్పుడు ‘వై నాట్‌ ప్రతిపక్ష నేత హోదా’ అంటూ దేబిరిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా జగన్‌ పడుతున్న పాట్లు చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తగలుగుతానని ఇదివరకే బెదిరింపు ధోరణితో స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. జగన్‌కు ఏ ‘హోదా’ ఇవ్వాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించేశారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా చిత్తుచిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా జగన్‌ మారడం లేదు.

రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

పార్లమెంటు, అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్నికల్లో పది శాతం సీట్లు రావాలి. దీనిపై నిర్దిష్టంగా రూల్‌ లేనప్పటికీ.. కౌల్‌ అండ్‌ షక్దర్‌ రూల్స్‌ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి పది శాతం మంది సభ్యులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సహజంగా శాసనసభా వ్యవహారాలన్నీ కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలోని నిబంధనల మేరకు నడుస్తుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి పదిశాతం సీట్లు అంటే.. 18మంది ఎమ్మెల్యేల బలం లేదు. జగన్‌తో సహా11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేదు.

సొంత లాభం కోసమే..

జగన్‌ తన స్వప్రయోజనాల కోసమే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తాలంటే ప్రతిపక్ష నేత హోదానే కాదు ఎమ్మెల్యే అయినా చాలు. 2014-19, 2019-24 లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా హుందా గా వ్యవహరించింది. కానీ జగన్‌ తన స్వార్థం కోసం, మంత్రి పదవికి సమానమైన పదవి కోసం, వ్యక్తిగత భద్రత కోసం ప్రతిపక్షనేత హోదాను కోరుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. జగన్‌ మాజీ సీఎం అయినా ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, అదే ప్రతిపక్ష నేత హోదా వస్తే కేబినెట్‌ మంత్రి హోదా వస్తుందని, అందుకే ఆయన పాకులాడుతున్నారని చెబుతున్నాయి.

నేటి ధర్నా కోసం ఢిల్లీకి జగన్‌

గన్నవరం, జూలై 23: అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బుధవారం ఢిల్లీలో ధర్నా చేసేందుకు జగన్‌ మంగళవారం అక్కడకు చేరుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్‌, కల్యాణి, జయమంగళం వెంకటరమణ, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 07:03 AM