బోధనాస్పత్రుల్లో వైసీపీ గ్యాంగ్!
ABN, Publish Date - Oct 02 , 2024 | 04:31 AM
బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌లను మార్చాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కీలకమైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌లను మారుస్తున్నారు.
కీలకమైన పోస్టులు వారికే
సీనియర్లను పక్కన పెడుతున్న వైనం
ఉన్నతాధికారులతో అంటకాగుతున్న వైద్యుడికి ప్రాధాన్యం
ఆయన కోసం ప్రత్యేకంగా జీవో 136 జారీ
డీఎంఈలో కీలక పోస్టింగ్‌కు రంగం సిద్ధం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌లను మార్చాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కీలకమైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి బోధనాస్పత్రుల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌లను మారుస్తున్నారు. సాధారణంగా ఏ శాఖ అయినా సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత కౌన్సెలింగ్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తుంది. అయితే, ఆరోగ్యశాఖలో పదోన్నతుల వరకూ మాత్రమే ఈ నిబంధన పాటించారు. పోస్టింగ్స్‌లో అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ వీరవిధేయులుగా వైద్యులను సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్‌లుగా నియమించుకున్నారు. వారు చేయని అరాచకాలు, చేయని అవినీతి లేవు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ వీరభక్తులకే కీలకమైన స్థానాల్లో పోస్టింగ్స్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాజధాని ప్రాంతాల్లోని బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఒక వైద్యుడికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తొలి నుంచి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయనవైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలిసి కూడా అందలం ఎక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ పోస్టుల్లో అదనపు డైరెక్టర్ స్థాయి వైద్యులకే అవకాశం కల్పించాలి. కానీ, ఆయన కోసమే ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పూర్తయితే సూపరింటెండెంట్ పోస్టుకు అర్హత ఉండేలా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వైసీపీ ప్రభుత్వంలో జీవో 136ను జారీ చేశారు.
దీనికి కృతజ్ఞతగా ఆ వైద్యుడు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్‌గా తన పరిధిలో ఉన్న కోట్ల రూపాయల నిధులను అవసరం లేకపోయినా ఖర్చు పెట్టించి, వాటిలోనూ కొంత అధికారులకు ముట్టజెప్పారు. అందుకు బహుమతిగా ప్రిన్సిపాల్ బాధ్యతనూ ఆ వైద్యుడికే అప్పగించారు. మరోవైపు కాలేజీలో ఉన్న నిధులను కూడా కాజేసేందుకు భారీ స్కేచ్‌లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ వైద్యుడిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు తీసుకువచ్చి అక్కడ కీలకమైన పోస్టు ఇవ్వాలని తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
సంబంధిత ఫైల్‌కు శరవేగంగా ఆమోదం తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలో కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టు చాలా కీలకమైనది. మొన్నటి వరకూ డాక్టర్ అశోక్‌కుమార్ ఆ విధులు నిర్వహిర్తించేవారు. ఆయనపై ఆరోపణలు రావడంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ శివనాథ్‌ను అధికారులు నియమించారు. నిబంధనల ప్రకారం సెలవుపై వెళ్లిన అధికారి సెలవు పూర్తి చేసుకుని రాగానే ఇన్‌చార్జి రిలీవ్ అవ్వాలి. కానీ విశాఖలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ అడ్డం తిరిగారు. అలాంటి పరిస్థితుల్లో అధికారులు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను మందలించాలి. కానీ అధికారులు ఇన్‌చార్జికి మద్దతుగా నిలిచి, రెగ్యులర్ సూపరింటెండెంట్‌ను డీఎంఈ ఆఫీ్‌సలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కానీ, గుంటూరు ఆస్పత్రిలో నెల రోజుల సెలవు తర్వాత సూపరింటెండెంట్ తిరిగిరాగానే ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రిలీవ్ అయిపోయారు. దీంతో విశాఖలో ఒక రూల్, గుంటూరులో మరొక రూల్ ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు మార్చాలి..
వైద్యులు చాలా కాలం వైద్యసేవలు చేసిన తర్వాత, రిటైర్‌మెంట్‌కు ముందు అదనపు డైరెక్టర్ హోదాలో సూపరింటెండెంట్ లేదా ప్రిన్సిపాల్ లేదా డీఎంఈ, అకడమిక్ డీఎంఈగా విధులు నిర్వర్తించాలని భావిస్తారు. అయితే, సీనియర్ వైద్యుల హక్కులను కాలరాసేలా జీవో 136ను విడుదల చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ జీవో ఆధారంగా జూనియర్ వైద్యులను సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్‌గా నియమిస్తుండటంతో అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన చాలా మంది వైద్యులు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తూనే రిటైరైపోతున్నారు. దీంతో జీవో 136ను రద్దు చేయాలన్న డిమాండ్లు వైద్యుల నుంచి వినిపిస్తున్నాయి.
కాకినాడలో ప్రిన్సిపాల్, డీఎంఈ ఒక్కరే..
ఏడాదిన్నర నుంచి కాకినాడ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌ను నియమించలేదు. ఇన్‌చార్జి డీఎంఈగా ఉన్న డాక్టర్ నరసింహంనే ప్రిన్సిపాల్‌గా కూడా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది అదనపు డైరెక్టర్లు వివిధ ఆస్పత్రుల్లో ఉన్నా, వారెవ్వరినీ ప్రిన్సిపాల్‌గా నియమించలేదు. కాకినాడలో మాత్రమే ఒకే వ్యక్తిని రెండు పోస్టుల్లో కొనసాగిస్తుండటం వెనుక మతలబు ఏమిటో ఉన్నతాధికారులకే తెలియాలి.
Updated Date - Oct 02 , 2024 | 04:31 AM