Jagan's Aministration : 165 కోట్లు మాయం!
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:38 AM
ప్రభుత్వంలో ఏదైనా బిల్లు పాస్ అయి చెల్లింపులు జరగాలంటే పరిపాలనాపరమైన అనుమతులు ఉండి తీరాల్సిందే! హెచ్‌ఓడీ, సచివాలయ శాఖ, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్‌వో)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బిల్లుకు ఆమోదం ...
కడప విమానాశ్రయం పేరుతో ‘కొట్టేశారు’?
పీఏవో స్థాయిలోనే ఆర్థిక అరాచకం
పనులు జరిగాయని తేలకుండానే బిల్లులు
ప్రభుత్వ అనుమతుల్లేకుండానే చెల్లింపులు
ముందుగా ఏపీఐఐసీ బ్యాంకు ఖాతాకు
అక్కడి నుంచి ఎవరి జేబులోకి వెళ్లాయి?
పీఏవో తీరుపై ఏజీ తీవ్ర అభ్యంతరం
బయటపెట్టకుండా దాచేసిన పీఏవో
వైసీపీ హయాం అంటేనే ఆర్థిక అరాచకాల కాలం! అడ్డగోలుగా అప్పులు, ఇష్టానుసారం బిల్లుల చెల్లింపులు! తాజాగా... ఇలాంటి అడ్డగోలు వ్యవహారం మరొకటి బయటికి వచ్చింది. పరిపాలనా అనుమతుల్లేకుండా, పనులు జరిగాయో లేదో తెలుసుకోకుండానే రూ.165 కోట్లను ‘మాయం’ చేసిన వైనం బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప విమానాశ్రయం అభివృద్ధి పేరిట నిధులు గోల్‌మాల్ చేసినట్లు తేలింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వంలో ఏదైనా బిల్లు పాస్ అయి చెల్లింపులు జరగాలంటే పరిపాలనాపరమైన అనుమతులు ఉండి తీరాల్సిందే! హెచ్‌ఓడీ, సచివాలయ శాఖ, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్‌వో)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం బిల్లుకు ఆమోదం ఉందో లేదో చూసిన తర్వాతే పే అండ్ అకౌంట్స్ కార్యాలయం (పీఏవో) దానిని పాస్ చేయాలి. కానీ... వైసీపీ హయాంలో అంతా గోల్‌మాల్! 2023లో కడప విమానాశ్రయం పనులకు సంబంధించి ఒక బిల్లును పరిపాలనాపరమైన అనుమతులేవీ లేకుండానే పీఏవో పాస్ చేసింది. సీఎ్‌ఫఎంఎ్‌సలో కూడా దీనిపై నియంత్రణ లేకుండా పోయింది. ఆడిటర్ జనరల్ (ఏజీ) తనిఖీలో ఈ తప్పుడు లెక్క బయటపడింది. కడప విమానాశ్రయం పనులను ఏపీఐఐసీ చేపట్టింది. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ (ఐ అండ్ ఐ), ఎనర్జీ, ఆర్థిక శాఖలకు తెలియకుండానే పీఏవో రూ.165.72 కోట్లను ఏపీఐఐసీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి చేరిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విమానాశ్రయ పనులు అనుకున్న మేరకు పూర్తయితేనే ఐ అండ్ ఐ గానీ, ఎనర్జీ శాఖ గానీ పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తాయి. దీనికీ ఒక పకడ్బందీ పద్ధతి ఉంది.
ముందుగా పనులు పూర్తయినట్లు క్షేత్ర స్థాయి అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. వాటిని జిల్లా స్థాయి అధికారులు ధ్రువీకరించాలి. తర్వాత సచివాలయ స్థాయిలో కార్యదర్శి పరిపాలనా అనుమతులు జారీ చేస్తేనే పీఏవో నుంచి నిధులు విడుదల అవుతాయి. కడప విమానాశ్రయ పనుల్లో ఈ ప్రక్రియ జరగనే లేదు. నిజంగా ఆ పనులు పూర్తయి ఉంటే అనుమతులు తీసుకునే బిల్లులు పాస్ చేసే వాళ్లు. పనులు చేయలేదు కనుకనే ఆ రెండు శాఖలను పక్కకు తప్పించి... నేరుగా పీఏవో ద్వారా బిల్లు పాస్ చేయించుకుని రూ.165.72 కోట్లను ఏపీఐఐసీ జేబులో వేసుకుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి 2023 మేలో రూ.202 కోట్లతో కడప విమానాశ్రయ పనులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇందులో రూ.37 కోట్ల పనులు, నిధులపై స్పష్టత లేదు. 165.72 కోట్లను ఏపీఐఐసీ ద్వారా ‘ఖర్చు’ చేసేశారు.
అన్ని నిబంధనలకు పాతర...
పరిపాలనా అనుమతులు లేకుండా బిల్లులు పాస్ చేయడం ససేమిరా కుదరదు. పాస్ అయిన బిల్లు ఓపెన్ చేయగానే పరిపాలనాపరమైన అనుమతులు కనపడాలి. ప్రభుత్వంలోని 33 శాఖల్లో ప్రజల సొమ్ముతో అనేక పనులు జరుగుతుంటాయి. బిల్లులు పరిశీలించే బాధ్యతను ఆయా శాఖలకే అప్పజెప్పడం సరికాదని భావించి... దానిని ఆర్థిక శాఖ పరిధిలో ఉండే పీఏవోకు అప్పగించారు. కానీ పీఏవో కూడా బిల్లుల పరిశీలనలో గోల్‌మాల్‌కి పాల్పడడం దారుణం! కడప విమానాశ్రయం పనుల బిల్లుకు సంబంధించి 2023 మే 25వ తేదీన ఆర్థిక శాఖ బీఆర్‌వో విడుదల చేసింది. 2006లో ఆర్థిక శాఖ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్న విధంగా సంబంధిత అన్ని శాఖల నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని ఆ బీఆర్‌వోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం ఐ అండ్ ఐ, ఎనర్జీ శాఖల అధిపతులు (హెచ్‌ఓడీలు), సచివాలయ శాఖల నుంచి ఆమోదం తప్పనిసరని తెలిపారు. కానీ 165.72 కోట్ల బిల్లుకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు లేవని ఆడిటర్ జనరల్(ఏజీ) గుర్తించింది.
ఇలాంటి బిల్లు ఎందుకు పాస్ చేశారంటూ పీఏవోను వివరణ కోరింది ఇది తీవ్రమైన నియమాల ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిపాలనాపరమైన అనుమతుల్లేకుండా ఈ బిల్లు చెల్లించడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆపడం గమనార్హం. పూర్తికాని, జరగని పనులకు కూడా జగన్ హయాంలో వందల కోట్ల బిల్లులు చెల్లించారు. కడప విమానాశ్రయంలోనూ ఇదే కథ నడిచిందనే అనుమానాలున్నాయి. ఈ దుర్వినియోగంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Updated Date - Nov 26 , 2024 | 03:38 AM