Kisan Vikas Patra Scheme:అదిరిపోయే స్కీమ్.. తక్కువ ఇన్వెస్ట్‌తో డబుల్ ప్రాఫిట్..
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:47 PM
రిస్క్ లేకుండా లాభాలు తీసుకొచ్చే దారి కోసం వెతుకులాడుతున్నారా? అయితే, ఈ స్కీమ్ మీకోసమే. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు గ్యారెంటీ రెట్టింపు లాభాలు అందుకోవచ్చు. తపాలాశాఖ తీసుకొచ్చిన ఆ స్కీం ఏంటంటే?
భారతీయుల్లో సంపాదించే ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు ఎంతోకొంత ఆదా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి చదువులకు అయ్యే ఖర్చు, ఇంటి అవసరాలకు ముందు నుంచే దాచి ఉంచాలని తాపత్రయపడతారు. కానీ, చాలామందికి ఎందులో పొదుపు చేస్తే డబ్బు సురక్షితంగా ఉంటుందో సరైన అవగాహన ఉండదు. కొందరేమో తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందాలనే ఆశతో నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలు, స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ మధ్య చిన్న మొత్తాల్లో సిప్‌లు వేస్తున్నా అనుకున్న మొత్తంలో డబ్బు చేతికొస్తుందని గ్యారెంటీ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇలాంటి పొదుపు పథాకాలపై అవగాహన కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే పెట్టుబడికి గ్యారెంటీ ఇస్తూనే నిలకడైన రాబడి పొందాలని కోరుకునే వారికోసమే కిసాన్ వికాస్ పత్ర (KVP) అనే ఆకర్షణీయ పథకం ప్రవేశపెట్టింది పోస్ట్ఆఫీస్. ఇందులో మీ డబ్బు సురక్షితంగా ఉండటమే గాక కచ్చితమైన సమయానికి అనుకున్న మొత్తం మీ చేతికొస్తుంది. ఈ పథకం ద్వారా పొదుపు చేసేవారికి ఎంత వడ్డీరేట్లు, ప్రయోజనాలు దక్కుతాయంటే..
తపాలాశాఖ తీసుకొచ్చిన కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. జీరో రిస్క్‌తో 115 నెలల్లో కచ్చితంగా రెట్టింపు రాబడి మీకు లభిస్తుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడు నెలకు రూ.1000లు. గరిష్ఠంగా అయితే ఇంతే పొదుపు చేయాలనే నియమేం లేదు. 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులే. మీరు గనక క్రమం తప్పకుండా పదేళ్ల పాటు ప్రతి నెలా ఈ పథకంలో పొదుపు చేస్తే తప్పకుండా రెట్టింపు లాభాలు అందుకుంటారు.
కిసాన్ వికాస్ పత్ర పథకంలో వడ్డీరేట్లు..
ఉదాహరణకు, కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఎవరైనా రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలలు అంటే 10 సంవత్సరాలు తిరగకముందే డబుల్ అమౌంట్ చేతికొస్తుంది. ప్రతి త్రైమాసికానికి కలిపి 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పెట్టుబడిదారులకు గ్యారెంటీగా సరైన సమయంలో చెల్లింపులు చేయబడతాయి. చక్రవడ్డీ ఇవ్వడం వల్ల రూ.10 లక్షలు పొందుతారు. ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ వెళితే కచ్చితంగా అనుకున్న సొమ్ము అందుకోగలుగుతారు. ఇది తక్కువ ఆదాయం ఉండే వారికి కిసాన్ వికాస్ పత్ర అత్యంత ఆకర్షణీయమైన సురక్షిత పెట్టుబడి పథకం.
మెచ్యూరిటీ పన్నులు..
కిసాన్ వికాస్ పత్ర (KVP) నుంచి వచ్చే రిటర్న్‌లకు తప్పనిసరిగా పన్ను వర్తిస్తుంది. వాస్తవానికి పథక వ్యవధిని 123 నెలలుగా నిర్ధారించినా, తర్వాత అది 120 నెలలకు తగ్గించబడింది. ప్రస్తుతం 115 నెలలుగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సురక్షితంగా వేగవంతమైన రాబడిని అందుకోవచ్చు.
KVPలో ఖాతా ఎంపికలు..
కిసాన్ వికాస్ పత్ర పథకంలో వ్యక్తిగత, జాయింట్ ఖాతాలు తెరుచుకునేందుకు వీలుంది. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలు అయినా తెరవచ్చు. పరిమితి లేకుండా బహుళ ఖాతాల్లో డబ్బు పొదుపు చేసుకునేందుకు ఈ పథకం ఎంతో అనుకూలం.
సురక్షిత, లాభదాయక పెట్టుబడి..
రిస్క్ చేయకుండా పెద్ద మొత్తాలను ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందాలని ఆశించేవారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. గరిష్ఠ పరిమితి లేదు కాబట్టి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పొదుపు చేసుకోవచ్చు.