ఎల్ఐసీ పేరుతో నకిలీ ప్రకటనలు... తస్మాత్ జాగ్రత
ABN , Publish Date - Apr 25 , 2024 | 05:35 AM
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పేరు, లోగోలను, కొందరు సీనియర్ అధికారుల పేర్లను అనధికారికంగా ఉపయోగించుకుంటూ...
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పేరు, లోగోలను, కొందరు సీనియర్ అధికారుల పేర్లను అనధికారికంగా ఉపయోగించుకుంటూ మోసపూరిత శక్తులు సామాజిక మాధ్యమ వేదికగా జారీ చేస్తున్న నకిలీ ప్రకటనలకు మోసపోవద్దని పాలసీదారులు, ప్రజలను ఎల్ఐసీ హెచ్చరించింది. ఎక్స్ వేదికగా ఎల్ఐసీ ఈ హెచ్చరిక చేస్తూ అలాంటి ప్రకటనలు వెలువడినప్పుడు అవి అధికారికమైనవేనా అని ధ్రువీకరించుకోవాలసి సూచించింది.
‘‘కొందరు వ్యక్తులు/కొన్ని సంస్థలు ఎల్ఐసీ అధికారులు, మాజీ అధికారుల పేర్లను, సంస్థ బ్రాండ్ లోగోను, పేరును ఉపయోగించుకుని మోసపూరిత ప్రకటనలు సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి మోసపూరిత ప్రకటనల బారిన పడవద్దని ఈ వేదిక ద్వారా మా కస్టమర్లను హెచ్చరిస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. అలాంటి మోసపూరిత వ్యక్తులు, సంస్థలు ఇచ్చే యుఆర్ఎల్ పై క్లిక్ చేసి వారి వలలో పడవద్దని తెలిపింది.