Stock Market: భారీ నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్.. ఆవిరైన రూ.14 లక్షల కోట్లు..
ABN, Publish Date - Aug 05 , 2024 | 12:29 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి. గ్లోబల్ బ్లడ్ బాత్‌ను అనుసరిస్తూ.. భారతీయ మార్కెట్లు ఇవాళ అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 2,600 పాయింట్లు పతనమై 78,385.49 వద్ద, నిఫ్టీ 463.50 పాయింట్లు పతనమై 24,254.20 వద్ద ఉన్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.80 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్ల వరకూ ఆవిరైంది.
ఇవాళ ఉదయం సెన్సెక్స్ 30 సూచీలో కొన్ని షేర్లు మాత్రమే లాభాల బాటలో పయనిస్తున్నాయి. వాటిలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. ఇక భారీగా పతనం దిశగా కొనసాగుతున్న షేర్లలో.. టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌అండ్‌టీ ఉన్నాయి. జూలైలో అమెరికాలో ఉద్యోగాల కల్పన ఊహించిన దాని కంటే దారుణంగా మందగించింది. దీంతో ఆర్థిక మాంద్యం తప్పదనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో దారుణంగా ఉద్యోగ కల్పన ఉంది. జులై నెలలో వ్యవసాయేతర రంగాల్లో 1.75 లక్షల వరకూ ఉద్యోగ కల్పన ఉండవచ్చని అంచనా వేస్తే.. 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకూ ఉండాలట. కానీ అందులో సగం మాత్రమే ఉద్యోగ కల్పన జరుగుతున్న నేపథ్యంలో మాంద్యం తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుంది. ఇక మార్కెట్ నష్టాలకు కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం కారణంగా తెలుస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడి నుంచైనా దేని గురించైనా చిన్న న్యూస్ వెలువడితే చాలు.. ఆయా కంపెనీల షేర్లు చిగురుటాకులా వణికి పోతాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మార్కెట్లు తీవ్ర ఆందోలనకు గురవుతున్నాయి.
Updated Date - Aug 05 , 2024 | 12:30 PM