Share News

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:39 PM

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పట్టణ పేదలు, మధ్యతరగతి జీవులకు బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ పథకం కింద ఏకంగా కోటి మందికి గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన
Nirma-Sitaraman

న్యూఢల్లీ: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పట్టణ పేదలు, మధ్యతరగతి జీవులకు బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ పథకం కింద ఏకంగా కోటి మందికి గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 1 కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రయోజనాన్ని అందించనునన్నట్టు వివరించారు. పట్టణ ప్రజల గృహ అవసరాలను గుర్తించామని, ఈ మేరకు అర్బన్ హౌసింగ్‌ ద్వారా సమస్యను పరిష్కరించనున్నట్టు వివరించారు. ఈ పథకం కింద రానున్న ఐదు సంవత్సరాల్లో మరో రూ. 2.2 లక్షల కోట్లు కేంద్ర సాయం అందుతుందని ఆమె చెప్పారు.


ముద్ర పథకం కింద రుణ పరిమితి పెంపు

మరోవైపు ముద్ర పథకం కింద రుణ పరిమితిని కూడా పెంచుతున్నట్టు సీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు మరింత సులభంగా ఆర్థిక సాయాన్ని పొందేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని సీతారామన్ స్పష్టం చేశారు. తద్వారా కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు వీలు కల్పిస్తామని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రం దోహదపడుతుందని సీతారామన్ వివరించారు.


కాగా రికార్డు స్థాయిలో సీతారామన్ వరసుగా ఏడవసారి కేంద్ర బడ్జెట్‌ 2024-25ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆధారిత ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది. ఇక అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ16 లక్షల కోట్లుగా లెక్కగట్టింది.

Updated Date - Jul 23 , 2024 | 12:39 PM