Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!
ABN , Publish Date - Sep 09 , 2024 | 08:43 PM
జీవిత బీమా తీసుకునే వారు ఆరు అంశాల ఆధారంగా పాలసీ ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, బీమా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుతాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకోని పరిస్థితుల్లో కుటుంబపెద్ద దూరమైనప్పుడు మిగిలిన వారిని ఆదుకునేదే జీవిత బీమా. అయితే, దీని విషయంలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. కొందరు ఏజెంట్లు దీని ప్రయోజనాలను గోరంతలను కొండతలుగా చేసి కస్టమర్లకు అంటగడుతుంటారు. కాబట్టి, బీమా తీసుకోదలిచిన వారు ఆరు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి (Life Insurance).
Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!
జీవిత బీమా అవసరం వ్యక్తుల పరిస్థితుల బట్టి మారుతుంటుంది. ముఖ్యంగా కుటుంబం తమపై ఆధారపడి ఉంటే మాత్రం జీవిత బీమా తప్పనిసరి. అయితే, పెళ్లి కాని వారు, తమపై ఎవరూ ఆధారపడి లేరనుకునే వారికి జీవిత బీమా అవసరం కాకపోవచ్చు. అలాగే మంచి ఆస్తిపాస్తులు ఉన్న వారికి కూడా జీవిత బీమా అవసరం అంతగా ఉండదు.
బీమా కవరేజీ ఎంతనేదానిపై కూడా దృష్టి పెట్టాలి. సాధారణగా వార్షిక ఆదాయానికి 8-10 రెట్లు ఉన్న బీమా తీసుకోవాలి. వ్యక్తులు మరణించిన సందర్భాల్లో వారిపై ఆధారపడ్డ వారికి పూర్తిస్థాయి ఆర్థిక రక్షణ ఉండేలా పాలసీ ఎంచుకోవాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, పెళ్లి ఖర్చుల వంటివన్నీ బీమా మొత్తంతో తీరాలి.
బీమా ఎంచుకునే సమయంలో ప్రీమియంపై కూడా దృష్టి పెట్టాలి. సాధారణంగా వ్యక్తుల నికర ఆదాయంలో ప్రీమియం ఐదు శాతానికి మించకూడదు. ఉదాహరణకు 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఏటా 50 వేలకు మించి ప్రీమియం చెల్లించరాదు. ఈ నిబంధన పాటించని చాలా మందికి ప్రీమియం భారంగా మారి మధ్యలోనే చెల్లింపులను నిలిపివేస్తారు. చివరకు బీమా ప్రయోజనాన్ని కోల్పోతారు.
బీమాను పన్ను పొదుపు సాధనంగా చూడకూడదనేది నిపుణుల మాట. కానీ దీర్ఘకాలిక లక్షణం ఉన్న బీమాను చాలా మంది పన్ను పొదుపు కోసం వినియోగిస్తుంటారు. కానీ, సెక్షన్ 80 సీసీ ఇచ్చే ఇతర మినహాయింపుల ద్వారా బీమా కంటే ఎక్కువ స్థాయిలో పన్ను పొదుపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇన్సురెన్స్ పాలసీల కాలపరిమితి 20 నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఇంత సుదీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించినప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనాలు కలిగి గొప్ప మొత్తం చేతికొస్తుంది. ఇది బాగానే ఉన్నప్పటికీ వార్షిక రాబడి పరంగా చూస్తే మాత్రం మరో కోణం కనిపిస్తుంది. ఉదాహరణకు ఏటా 50 వేల ప్రీమియంతో 25 ఏళ్ల తరువాత పాలసీ మెచ్యురిటీ నాటికి రూ.30 లక్షలు అందుతుందంటే చాలా మంది సంబరపడిపోతారు. ఈ పాలసీ వాస్తవ వార్షిక రాబడి మాత్రం 6.22 శాతంగానే ఉంటుంది. ఇక పెరిగే ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటే 25 ఏళ్ల తరువాత అందే 30 లక్షలతో అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోవచ్చు.
ఇక బీమా తీసుకునే సమయంలో ఆరోగ్యానికి సంబంధించి ఏ అంశాన్ని దాచకూడదు. లేకపోతే క్లెయిమ్ చేసుకునే సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తొచ్చు. చివరకు పాలసీనే చెల్లకుండా పోవచ్చు.