Women: డిజిటల్ అరెస్ట్ పేరుతో లక్షల మోసం.. వీడియో కాల్‌లో బట్టలు విప్పమంటూ..
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:26 PM
రోజురోజుకూ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. అలాగే పోలీసుల అధికారుల పేరుతో అనేక రకాలుగా మోసాలు చేయడం కూడా పెరిగిపోతుంది. కళ్ల ముందు ఎన్ని నేరాలు జరిగినా అనేక మంది మోసపోతూనే ఉన్నారు. చివరకు చదువుకున్న విద్యావంతులు కూడా ఇలాంటి నేరగాళ్ల చేతిలో సులువుగా మోసపోవడం చూస్తున్నాం. తాజాగా..
రోజురోజుకూ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. అలాగే పోలీసుల అధికారుల పేరుతో అనేక రకాలుగా మోసాలు చేయడం కూడా పెరిగిపోతుంది. కళ్ల ముందు ఎన్ని నేరాలు జరిగినా అనేక మంది మోసపోతూనే ఉన్నారు. చివరకు చదువుకున్న విద్యావంతులు కూడా ఇలాంటి నేరగాళ్ల చేతిలో సులువుగా మోసపోవడం చూస్తున్నాం. తాజాగా, ఈ తరహా షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ముంబై యువతి ఘోరంగా మోసాపోయింది. వీడియో కాల్ చేసి బట్టలు విప్పమంటూ బలవంతం చేయడమంతో ఆమెకు అనుమానం వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..
ముంబైకు (Mumbai) చెందిన 26 ఏళ్ల యువతికి (young woman) ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫార్మాసూటికల్ కంపెనీలో పని చేస్తున్న ఆమెకు నవంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తాము ఢిల్లీ పోలీసులమంటూ అవతలి వారు పరిచయం చేసుకున్నారు. ‘‘జైల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మీ పేరు కూడా వచ్చింది’’.. అని అవతలి వారు అనడంతో సదరు యువతి భయంతో వణికిపోయింది.
డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ..
ఆమె భయపడుతోందని తెలుసుకున్న అవతలి వారు అసలు మోసానికి తెరలేపారు. మామూలు కాల్ చేసిన నేరస్థులు.. ఆ వెంటనే వీడియో కాల్ చేశారు. ‘‘విచారణ పూర్తయ్యే వరకూ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ (Digital arrest) చేస్తున్నాం’’.. అని చెప్పి బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. అధికారిక ధృవీకరణ కోసం రూ.1,78,000లు బదిలీ చేయాలని చెప్పారు. దీంతో ఆ యువతి వారు చెప్పినట్లుగా చేసింది. తర్వాత విచారణ పేరుతో హోటల్లో ఓ గది తీసుకుని, వీడియో కాల్ చేయమని చెప్పారు.
బట్టలు విప్పాలంటూ..
నేరస్థుల మాటలు నమ్మిన ఆమె వారు చెప్పినట్లుగానే హోటల్లో గది తీసుకుని వారికి వీడియో కాల్ చేసింది. అంతటితో ఆగని వారు ఆమెను బాడీ వెరిఫికేషన్ చేయాలంటూ బట్టలు కూడా విప్పమన్నారు. పదే పదే ఇలా బలవంతం చేయడంతో ఆమెకు అనుమానం వచ్చి చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు నరేష్ గోయల్ మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందంటూ బెదిరించి టెక్స్‌టైల్ దిగ్గజం శ్రీపాల్ ఓస్వాల్ వద్ద కూడా రూ.7కోట్లు మోసం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్ట్, వర్చువల్ అరెస్ట్ అనేది ఎక్కడా ఉండదని, ఎవరైనా ఇలాంటి పేర్లతో మోసం చేయాలని చూస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. కాగా, ముంబై యువతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:26 PM