Hyderabad: రెండు రోజుల్లో అరకోటి స్వాహా..
ABN, Publish Date - May 26 , 2024 | 11:03 AM
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్తరకం స్కీములతో బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు అందినంతా దండుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకొని రూ. కోట్లు కొల్లగొడుతున్నారు.
- ఇన్వెస్టిమెంట్, డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో బురిడీ
- అందినంత దోచుకున్న సైబర్ క్రిమినల్స్
- సైబర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్ సిటీ: రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్తరకం స్కీములతో బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు అందినంతా దండుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకొని రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్(Hyderabad City Commissionerate) పరిధిలో సైబర్ నేరగాళ్లు కేవలం రెండు (గురు, శుక్ర) రోజుల్లోనే అరకోటికిపైగా సొత్తును కొల్లగొట్టారు. బాధితుల్లో మహిళలు, లాయర్లు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు తెలిసింది.
- రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి రూ. 14.73లక్షలు..
మీ పేరుతో అనుమానాస్పద పార్సిల్ విదేశాలకు వెళ్తున్నది.. అందులో 7 నకిలీ పాస్‌పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, 5 కేజీల దుస్తులు, 960 గ్రాముల కొకైన్ ఉన్నాయి అని నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. డిజిటల్ అరెస్టు, ఇంటరాగేషన్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. మీ బ్యాంకు ఖాతానుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని సమాచారం ఉందని భయపెట్టారు. చివరకు కేసు నుంచి బయటపడేస్తామని నమ్మించి రూ. 14,73లక్షలు కొల్లగొట్టారు.
- గోల్డ్‌మెన్ సాచ్స్‌లో పెట్టుబడులంటూ బురిడీ..
హైదరాబాద్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన కనిపించింది. గోల్డ్‌మెన్ సాచ్స్‌కు అనుబంధ సంస్థలుగా ఉన్న మా యునైటెడ్ బుల్స్‌లో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలోనే 5-20 శాతం లాభాలు వస్తాయని ప్రకటనలో రాసిఉంది. దాంతో వెంటనే ఆ మహిళ ఫేస్‌బుక్‌లో లింక్ ఓపెన్ చేసింది. దాంతో వెంటనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అవినాష్ ఏ7 అనే వాట్సాప్ గ్రూపులో సభ్యురాలిగా చేర్చారు. కొద్దిరోజులు ప్రతి రోజు రాత్రి స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై, లాభనష్టాలపై క్లాసులు ఇచ్చేవారు. ఆ తర్వాత వారి నుంచి పెట్టుబడులు రూపంలో డబ్బులు జమ చేయించుకొని వాటిని గోల్డ్‌మెన్ సాచ్స్‌తో పాటు.. ఇతర అనుబంధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తామని నమ్మించారు.
ఈ క్రమంలో మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళకు మంచి లాభాలు వచ్చాయి. డబ్బులు సైతం విత్‌డ్రా చేసుకునేది. అలా మెల్లగా లాభాలు ఆశచూపించిన సైబర్ కేటుగాళ్లు ఆమె నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి రూ. 25,82,700లు కొల్లగొట్టారు.
- క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని..
నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసింది. మీరు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు మంజూరైంది. 2023లో మీరు అప్లై చేశారు. కానీ ఇప్పుడు అది ఓకే అయిందన్నారు. ఆన్‌లైన్‌లో యాక్టివ్ చేసుకోవచ్చు అంటూ యాక్టివేట్ చేస్తున్నట్లు నటించిన కేటుగాళ్లు ఓటీపీలు, సీవీవీ తెలుసుకొని ఆమె క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.79లక్షలు కొల్లగొట్టారు.
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ. 3.71లక్షలు..
మీ పేరుతో అనుమానాస్పద పార్సిల్ విదేశాలకు వెళ్తున్నది. అందులో 5 నకిలీ పాస్‌పోర్టులు, 3 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నాయంటూ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. డిజిటల్ అరెస్టు, ఇంటరాగేషన్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. మీ బ్యాంకు ఖాతానుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని భయపెట్టారు. చివరకు కేసు నుంచి బయటపడేస్తామని నమ్మించి రూ. 3,71,581లు కొల్లగొట్టారు.
- ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ పెట్టి రూ. 5.60లక్షలు..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతితక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బాధితుని నుంచి రూ. 5.60లక్షలు కొల్లగొట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితునికి స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ఒక లింక్ కనిపించింది. దాన్ని క్లిక్ చేయగానే గుర్తుతెలియని వ్యక్తులు బాధితున్ని ఒక వాట్సాప్ గ్రూపులో యాడ్ చేశారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ గురించి తెలియజేస్తూ పెట్టుబడులు పెట్టిస్తూ ప్రారంభంలో లాభాలు చూపించారు. అలా మెల్లగా అతన్ని నమ్మించి రూ. 5.60లక్షలు ఇన్వెస్టిమెంట్ చేయించి ఆ డబ్బును కొల్లగొట్టి కాంటాక్టు కట్ చేశారు.
లింకులను నమ్మొద్దు...
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్టిమెంట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను, సోషల్‌మీడియాలో వచ్చే లింకులను నమ్మొద్దని, వాటికి ఆకర్షితులై కష్టపడి దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలో పోసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu Newshy
Updated Date - May 26 , 2024 | 11:03 AM