Maharashtra: బయటకు తీసుకెళ్లని భర్త.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
ABN, Publish Date - Jul 09 , 2024 | 01:31 PM
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజమే. చిన్న చిన్న విషయాలకు కూడా విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరేమో అప్పటికప్పుడే ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కానీ..
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజమే. చిన్న చిన్న విషయాలకు కూడా విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరేమో అప్పటికప్పుడే ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కానీ, మరికొందరు మాత్రం మనసుకి తీసుకొని, తీవ్ర కోపాద్రిక్తులవుతారు. అప్పుడు నేరాలు చేసేందుకు కూడా వెనుకాడరు. చంపడమో లేదా చావడమో చేస్తారు. తాజాగా మహారాష్ట్రలో (Maharashtra) అలాంటి ఘటనే వెలుగు చూసింది. భర్త తనని బయటకు తీసుకువెళ్లలేదని.. ఓ మహిళ తన కూతురిని చంపేయడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్గార్ జిల్లాలోని సిస్నే గ్రామంలో ఓ జంట నివసిస్తోంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. భర్త ఓ మత్స్యకారుడు. పని నిమిత్తం అతడు ఇంట్లో కన్నా బయటే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. పని లేనప్పుడు కూడా భార్య, కూతురిని ఇంట్లోనే వదిలేసి.. స్నేహితులతో బయటకు వెళ్తుంటాడు. తనకూ బయట తిరగాలనుందని, ఎప్పుడైనా తీసుకెళ్లమని భార్య ఎన్నిసార్లు కోరినా అతడు పట్టించుకోలేదు. కట్ చేస్తే.. ఈ ఆదివారం పని ముగించుకొని ఇంటికొచ్చిన భర్త, కాసేపట్లతోనే తన స్నేహితులతో కలిసి బయటకెళ్లాడు. అర్థరాత్రి దాటిని తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ నెలకొంది.
‘నువ్వెప్పుడూ వెళ్తూనే ఉంటావ్, నన్ను ఒక్కసారి కూడా ఎందుకు బయటకు తీసుకెళ్లవు’ అంటూ భార్య నిలదీసింది. అయినా భర్త వినిపించుకోలేదు. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆమె.. క్షణికావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. తొలుత తన కూతురిని చంపేసి, ఆపై తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లికూతుళ్ల చావుకి అసలు కారణాలేంటో వెలికి తీస్తామని అధికారులు వెల్లడించారు.
Read Latest Crime News and Telugu News
Updated Date - Jul 09 , 2024 | 01:31 PM