ఔషధం వంటి గుణమున్న మనిషి
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:53 AM
ఎప్పుడు ఫోన్ చేసినా ‘‘ఎవురూ.. షరీఫా.. ఏం నాయనా.. బావుండావా.. భార్యా పిల్లోల్లు.. బావుండారు గదా..’’ అంటారు కేతు గారు. ఆయన ఆత్మీయ పలకరింపులు ఆయనతో స్నేహం చేసిన ఎవరికైనా అంత సులువుగా మరుపుకు రావు...
ఎప్పుడు ఫోన్ చేసినా ‘‘ఎవురూ.. షరీఫా.. ఏం నాయనా.. బావుండావా.. భార్యా పిల్లోల్లు.. బావుండారు గదా..’’ అంటారు కేతు గారు. ఆయన ఆత్మీయ పలకరింపులు ఆయనతో స్నేహం చేసిన ఎవరికైనా అంత సులువుగా మరుపుకు రావు.
‘‘ఈ ముండాకొడుకులు సాహిత్య రంగాన్ని గబ్బు పట్టిచ్చాండారు నాయనా.. నువ్వేమి పట్టించుకోగాకు, నీ పని నువ్వు జేసుకో.. రాసుకుంటా పోతా ఉండు... ఏమి మాట్లాడేదానికి కాలం గాదు..’’ అని ఆయన ఆవేదనతో చేసిన సూచనలు ఇంకా నన్ను కలవరపెడుతూనే ఉన్నాయి.
ఎప్పుడో 2011లో ‘జుమ్మా’ కథల పుస్తకం వేసుకుంటున్నప్పుడు ముందుమాట కోసం హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌లో ఉండే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అంతకుముందు ఆయన కథలతో పరిచయం కానీ ఆయనతో కాదు. కథలు ఒక దమ్ముతో రాసేవాళ్లను కలవాలంటే నాకు భయం. వాళ్లముందు తేలిపోయే ముఖం పెట్టుకుని ఎక్కడ కూర్చునేది? ఇక అప్పుడంటే తప్పదు కాబట్టి, అవసరం నాది కాబట్టి వెళ్లి కలిశాను. చక్కగా డిటిపి చేసిన కథల ప్రతిని ఆయనకిచ్చి వచ్చేశాను.
మళ్లీ ఆర్నెల్లకు ఆయనింటి ముందుకెళ్లి నసిగితే అప్పుడు ఆయన ‘‘నాకు రాసే ఓపిక లేకుండా పోతాండాది నాయనా. సెప్తాంటే రాసుకుంటావా?’’ అన్నారు. ఇదే భాగ్యం అనుకుని పెన్నూ, పేపర్ అడిగి తీసుకున్నాను. నన్ను తీసుకెళ్లి ఆయన బెడ్ రూము పక్కనున్న వరండాలో కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఒక పక్కన ఆయన కూడా కూర్చోని సిగరెట్టు వెలిగించారు. అప్పుడప్పుడు కాగితంలో నా కథల పక్కన రాసుకున్న నోట్సు చూసుకుంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఒక గంటన్నర తర్వాత ‘‘పిల్లోల్లు నాయనా మీరు.. ఇంకా చెబితే పాడైపోతారు.. సాల్లే..’’ అని ముసిముసిగా నవ్వుతూ ముగించారు. ‘‘అప్పటికే ఎక్కువ చెప్పేశారు సార్’’ అని నేను నవ్వుతూనే చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఈ కాలం కుర్రాళ్ల ప్రతిభను ఏ కొద్దిగా కూడా అతిశయోక్తి లేకుండా ఎంత మెచ్చుకోవాలో అంత మాత్రమే మెచ్చుకుని మేలు చేసే ఔషధం వంటి గుణం ఆయనది.
నా కథల పుస్తకానికి ఒకింత గుర్తింపు రావడం మొదలయ్యాక నేను ఆయన్ని తరచూ కలవడం మొదలుపెట్టాను. వెళ్లినప్పుడల్లా నా పుస్తకానికి సంబంధించిన సంగతులు చెప్పేవాణ్ని. ఆయన కూడా తనకు తెలిసిన మిత్రులకు పుస్తకం పంపారు. నా కథలను ఇంగ్లీషులోకి అనువాదం చేసిన దాసు కృష్ణమూర్తి గారు ఆయన ద్వారా పరిచయమైన వారే. ఇలా ఇంకొకరికి పరిచయం చేసేంత ప్రేమ నా కథల మీద ఆయనకుందని నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. తనకు నచ్చిన పని మౌనంగా చేసుకుపోతారని, నచ్చిన సాహిత్యాన్ని కూడా అంతే మౌనంగా ప్రచారం చేస్తారని తర్వాత నాకు అర్థమైంది.
ఆయనకెప్పుడూ నా ఉద్యోగ జీవితానికి సంబంధించిన బెంగ ఉండేది. జర్నలిజంలో పిహెచ్‌డి చేస్తున్నానని చెబితే సంతోషించి అంబేద్కర్ యూనివర్సిటీలో ఆయన సంపాదకత్వం వహించిన ప్రచార, ప్రసార మాధ్యమాల పుస్తకాల సెట్టును బహూకరించారు. ‘‘కతలు అన్నం పెట్టవని ఈ కీర్తికి బానిస కావొద్దని’’ ఆయన పదే పదే చెప్పే మాటలు నన్ను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.
మాటల సందర్భంలో ఒకసారి ఆయనకు ‘మటన్ ఖీమా’ ఇష్టమని తెలిసి తీసుకెళ్తే ఆ ఖీమా డబ్బులకు తోడు బోనస్‌గా పిల్లలకు చాక్లెట్ ప్యాకెట్ తీసుకోకుండా వెనక్కి రాలేకపోయాను. ఎదుటివాళ్ల అభిమానాన్ని ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవాలని ఆలోచించని ఉత్తముడు ఆయన.
హైదరాబాద్ వంటి నగరంలో ఎవరికి ఎవరూ కారు. ఒకర్నొకరు నిత్యం కలుసు కోవడం సాధ్యం కాదు. కాకపోతే మనకు తెలిసిన ఫలాన వ్యక్తి ఒకరు ఈ నగరంలోనే ఎక్కడో ఒక చోట ఉంటున్నారంటే అదో తెలీని భరోసా. ఆ భరోసాకు దెబ్బ తగిలింది. హైదరాబాద్ వదిలేసి ఆయన సొంత ప్రాంతం కడప చేరారు. అది నాకు కొంత వెలితిగా అనిపించినా.. ఇక నాదీ కడప ప్రాంతమే కాబట్టి.. ఊరెళ్లినప్పుడల్లా కలిసేవాణ్ని. కడప కేంద్రంగా ఆయన సాహితీ సేద్యం మొదలుపెట్టారు. అడపాదడపా సిపి బ్రౌన్ కార్యక్రమాల్లోనూ, యూనివర్సిటీ వ్యవహారాల్లోనూ పాల్గొనేవారు. కొన్ని కార్యక్రమాలకు నేనూ హాజరయ్యేవాణ్ని. కనిపించినప్పుడల్లా ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చోబెట్టుకుంటారు కానీ ఏమీ మాట్లాడరు. మాట్లాడకుండా పక్కన కూర్చోని ఉండటం నాకు ఇబ్బందే అయినా ఆయన అభిమానం చూపించే తీరే.. ఇలా ఉంటుందని గ్రహించి మౌనంగా ఉండిపోయేవాణ్ని.
కడపలో రెండేళ్ల కిందట ‘రాయలసీమ కథా కార్యశాల’ పెట్టినప్పుడు చివరిసారిగా కలిశాను. ఆ కార్యక్రమం పోస్టర్లు ఆయనే ఆవిష్కరించారు. తగిన సలహాలు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ‘రాయలసీమ యువత ఎక్కువగా సాహిత్యంలోకి రావాలని, సమాజంలో ప్రతిపక్షపాత్ర పోషించాలని’ మాట్లాడారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.
నాలుగు నెలల తర్వాత కడపలో శాంతి నారాయణ గారి ‘సాధన’ నవల పరిచయ సభలో ఆయన మాట్లాడాల్సి ఉంది. నేనూ వక్తనే కాబట్టి కడప వెళ్లాను. కానీ కేతు గారు రావడం లేదని ఆయన సతీమణికి ఆరోగ్యం బాగాలేక కూతురి దగ్గరికి ఒంగోలు వెళ్తున్నారని తెలిసింది. సాధన నవల పరిచయ సభను ముగించుకుని మరుసటి రోజు ఉదయానే ప్రస్తుతం నేను నివాసం ఉంటున్న ఊరు విజయవాడ చేరుకున్నానో లేదో జీర్ణించుకోలేని వార్తను పాలగిరి విశ్వప్రసాద్ అన్న ఫోన్ చేసి తెలిపాడు. అట్నుంచటే ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని సందర్శించాను. ఆయన నిర్జీవ దేహాన్ని చూశాకైనా నేను ఆయన లేడనే వార్తను నమ్మాలి కదా.. ఎందుకనో నమ్మకలేకపోతున్నాను.
అయితే కడపలో సాహితీ ధర్మానికి విరుద్ధంగా ఏదైనా జరుగుతోందంటే ‘పెద్దాయన ఉండాడు.. ఏమంటాడో..’ అని భయం ఒకటి ఉండేది. ఆ భయం ఇప్పుడు లేనందుకు మాత్రం నేను నిజంగానే దు:ఖిస్తున్నాను.
(జూలై 10న కేతు విశ్వనాథరెడ్డి జయంతి)
వేంపల్లె షరీఫ్