అంబేడ్కర్ చేసిన ‘తిరుగుబాటు హెచ్చరిక’
ABN , Publish Date - Jul 03 , 2024 | 01:07 AM
భారత రాజ్యాంగం ఒక్కరోజులో తయారైంది కాదు. దాదాపు మూడొందల మంది మూడేళ్ళకు పైగా భారీ కసరత్తు చేసి రూపొందించిన రాజ్యాంగం మనది. మొదట్లో అయితే దాదాపు నాలుగు వందల మంది...
భారత రాజ్యాంగం ఒక్కరోజులో తయారైంది కాదు. దాదాపు మూడొందల మంది మూడేళ్ళకు పైగా భారీ కసరత్తు చేసి రూపొందించిన రాజ్యాంగం మనది. మొదట్లో అయితే దాదాపు నాలుగు వందల మంది సభ్యులు ఉండేవారు.
ఆనాడు మనది వలసదేశం. వ్యవసాయిక దేశం. వెనుకబడిన దేశం. సాంఘిక రంగంలో క్రూరమైన భూస్వామ్య భావజాలం బలంగా ఉన్న దేశం. మెరుగైన సమాజం కోసం ప్రజలు తాపత్రయం పడుతున్న కాలం అది.
అప్పటికి రాజ్యాంగ సభ ముందున్న ప్రధాన ప్రత్యామ్నాయం రాజకీయ రంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్థిక రంగంలో పెట్టుబడీదారీ వ్యవస్థ. ఈ రెండు విభాగాల్లో యూరప్, అమెరికా దేశాలు చాలా ముందున్నాయి. అనేక దేశాల నుండి, అనేకమంది ఆలోచనాపరుల నుండి అనేక ఆదర్శాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణల్ని విదేశాల నుండి స్వీకరించినట్టు సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను కూడా స్వీకరించడం ఒక చారిత్రక అవసరమే.
జాన్ లాక్, రూస్సో, థామస్ జెఫర్సన్, అబ్రహాం లింకన్, ఫ్రెంచ్ రివల్యూషన్... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది అయిపోతుంది. జర్మనీకి చెందిన వెయిమర్ (Weimar) రాజ్యాంగం కూడ ఇందులో ఉంది. వాటన్నింటి వివరాల్లోకీ వెళితే అదో పెద్ద గ్రంథం అవుతుంది. అయితే, భారత రాజ్యంగ నిర్మాతలు పూర్తిగా విదేశీ సిద్ధాంతాల ప్రభావంలో పడిపోయి దేశీయ సాంప్రదాయాలను పక్కన పెట్టేశారు అనే విమర్శ కూడా ఒకటి వున్నది. ఈ విమర్శను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చాలా బలంగా ఎక్కుపెట్టింది.
సంఘపరివారం దృష్టిలో దేశీయ పౌర సాంప్రదాయం అంటే మనుస్మృతి. మనుస్మృతినే భారత రాజ్యాంగంగా ప్రకటించాలని వాళ్ళు చాలా కాలంగా చాలా స్పష్టంగా చెపుతున్నారు. చాలా బలంగా ఒత్తిడి పెంచుతున్నారు. ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని విమర్శిస్తూ, మనువును కొనియాడుతూ ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’ అనేక వ్యాసాలు రాసింది, రాస్తున్నది.
కేవలం రాజ్యాంగ రచనా కమిటికి చైర్మన్‌గా మాత్రమే గాక దాని రూపశిల్పిగానూ వ్యవహరించింది బాబాసాహెబ్ అంబేడ్కర్. రాజ్యాంగంలో ప్రజాస్వామిక ఆత్మను ఆయన చాలా జాగ్రత్తగా అమర్చాడు. అదే భారత రాజ్యాంగానికి ప్రాణం. మనువాదులకు ప్రజాస్వామ్యం అంటే పడదు. అంబేడ్కర్‌కు మనుస్మృతి అంటే పడదు. దేశ సామాన్య ప్రజల మీద మనువు సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలువరించడానికే ప్రజాస్వామిక రాజ్యాంగ రచన సాగింది. రాజ్యాంగ రచనలో ఇది ప్రధాన అంశం. ప్రజాస్వామిక రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. ఇక మనువు ఆధిపత్యం అంతం అవుతుందని అంబేడ్కర్ స్వయంగా ప్రకటించాడు.
భారత రాజ్యాంగం దేశీయ సాంప్రదాయాలను అస్సలు పట్టించుకోలేదు అనడం కూడా నిజం కాదు. ఆయన దేశీయ సాంప్రదాయాలు రెండింటిని గట్టిగా పట్టించుకున్నాడు. ఒకదాని గురించి స్పష్టంగా చెప్పాడు. మరోదాని గురించి నేరుగా చెప్పలేదు గానీ అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు. తాను బుద్ధుని బోధనల నుంచి ఉత్తేజాన్ని పొంది రాజ్యాంగ రచన సాగించినట్టు అంబేడ్కర్ చెప్పుకున్నాడు. రాజ్యాంగ ప్రధాన ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలను తాను బుద్ధుని నుంచి స్వీకరించినట్టు ఒక సందర్భంలో వివరించాడు. అయితే రాజ్యాంగం మీద అంబేడ్కర్ చెప్పని ప్రభావం కూడ మరొకటి ఉంది. అది సాయుధ పోరాటం.
1946లో రాజ్యాంగ సభ ఏర్పడే నాటికే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతపు రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతు–కూలీ రాజ్యం కోసం సాయుధ పోరాటం కొనసాగుతోంది. 1948 ఫిబ్రవరిలో భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాము స్వాతంత్ర్యంగా భావిస్తున్నది నిజానికి అధికార మార్పిడి మాత్రమేనని నిర్ధారించింది. దేశంలోని పీడిత ప్రజలు తమ విముక్తి కోసం సాయుధులై పోరాడాలని పిలుపిచ్చింది. తెలంగాణలో ప్రధానంగానూ, దేశంలోని మరో రెండు మూడు ప్రాంతాల్లో స్వల్పంగానూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొన్నాళ్ళు సాయుధ పోరాటాలు కొనసాగాయి. అయితే 1948 సెప్టెంబరు నెలలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టింది.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టినప్పటికీ, దేశంలో సాయుధ పోరాట ముప్పు పూర్తిగా తప్పిపోయినట్టు కాదని అంబేడ్కర్ భావించాడు. దేశంలో ప్రజాస్వామిక పాలన విఫలం అయితే ప్రజలు సాయుధులై తిరగబడతారని స్పష్టంగా గుర్తించాడు. కమ్యూనిస్టు పార్టీ పేరును నేరుగా ప్రస్తావించలేదు గానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పొంచి వున్న సాయుధ పోరాట ముప్పు గురించి మాత్రం రాజ్యాంగ సభలోనే చాలా స్పష్టంగా చెప్పాడు. రాజ్యాంగ సభలో 1949 నవంబరు 25న చేసిన చివరి ప్రసంగంలో అంబేడ్కర్ ఈ హెచ్చరిక చేశాడు:
‘మూడేళ్ళు కష్టపడి ఒక గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపొందించాం. సమానత్వం మన సిద్ధాంతం; సోదరభావం మన లక్ష్యం. మన రాజ్యాంగం ప్రస్తుతానికి రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించింది. యుక్త వయస్సు వచ్చిన ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించాం. ప్రతి ఓటుకూ సమాన విలువ ఇచ్చాం. సంపూర్ణ సమానత్వ సాధన దిశగా ఇది తొలి అడుగు. అయితే, రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధించినంత మాత్రాన సరిపోదు. సాంఘీక, ఆర్థిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించాలి. ఈ రాజ్యాంగం ఆధారంగా రేపు ఏర్పడబోయే ప్రభుత్వాలు ఈ రెండు లక్ష్యాలను ప్రథమ కర్తవ్యాలుగా భావించి సాకారం చేయాలి. ఈ కర్తవ్యాలను ప్రభుత్వాధినేతలు నిర్లక్ష్యం చేస్తే, సాంఘిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వానికి బాధితులైన ప్రజలు తిరగబడతారు. అంతిమంగా, మనం ఇన్నేళ్ళు కష్టపడి నిర్మించిన ఈ ప్రజాస్వామిక భవనాన్ని పేల్చిపడేస్తారు’ అని హెచ్చరించాడు. (అంబేడ్కర్ ప్రసంగ భాగానికి ఇది యథాతథ అనువాదం కాకపోయినా సారాంశం మాత్రం అదే).
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట పంథాను వదిలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టిన తరువాత కూడ దేశంలో సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. ఈ అంశాన్ని అంబేడ్కర్ సరిగ్గానే అంచనా వేశాడు. ఇప్పుడు సాగుతున్న మణిపూర్ పరిణామాలు అలాంటివే.
ప్రజాస్వామ్యానికీ, సాయుధ పోరాటానికీ మధ్య ఒక విలోమానుపాత సంబంధం వుంటుంది. దేశాధినేతలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే సాయుధపోరాటాలు వెనక్కు తగ్గుతాయి. దేశాధినేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సాయుధ పోరాటాలు తలెత్తుతాయి. సాయుధ పోరాటాలు తలెత్తితే ఆ తప్పు ప్రజలది కాదు; ప్రభుత్వాధినేతలది. ‘అప్పుడు మరొకర్ని నిందించే అవకాశం కూడ వుండదు; మనల్ని మనమే నిందించుకోవడంతప్ప’, (If things go wrong, we will have nobody to blame except ourselves) అంటూ అంబేడ్కర్ ఆ ప్రసంగాన్నిముగించాడు.
దేశంలో ఒక వైపు మనుస్మృతిని అభావం చేయడం, మరోవైపు భవిష్యత్తులో తలెత్తే సాయుధ పోరాటాలను నివారించడం అనే లక్ష్యాలతో ప్రజాస్వామిక రాజ్యంగ రచన సాగింది. దీని అర్థం ఏమంటే, ప్రజాస్వామ్యం బలహీనపడితే ఒకవైపు మనుస్మృతి, మరో వైపు సాయుధ పోరాటాలు బలపడతాయి.
ఇక్కడో కిటుకు ఉంది. మనుస్మృతిని పునరుద్ధరించాలనుకునేవారు ఉద్దేశ్యపూర్వకంగానే, ప్రణాళికబద్ధంగానే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవచ్చు. ప్రజాస్వామిక ఎన్నికల ద్వారా పాలనాధికారాన్ని దక్కించుకున్నవారు రాజ్యాంగ ఆదర్శాలను, విలువలను తుంగలో తొక్కి నిరంకుశ పోకడలకు పోయినప్పుడు సహజంగానే రాజ్యాంగానికి ఉన్న ఆమోదాంశం సంక్షోభంలో పడుతుంది. అప్పుడు సాయుధ పోరాటాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు