Share News

‘‘రోజుకు పద్దెనిమిది గంటలు రాసేవాడిని’’

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:34 AM

బాలల కోసం రచన అనుకున్నప్పుడు ప్రధానంగా పది సంవత్సరాలు పైబడిన పిల్లల్ని దృష్టిలో వుంచుకుంటాను. సాధ్యమైనంత సరళంగా భాష వుండేలా జాగ్రత్తపడతాను. ‘అందమైన పూలతోట’ నవల రాసేటప్పుడు మా పిల్లల్ని పక్కన...

‘‘రోజుకు పద్దెనిమిది గంటలు రాసేవాడిని’’

బాల సాహిత్య రచన చేసేటప్పుడు మీ తక్కిన రచన భాష శైలులు నుంచి ఏ విధంగా భిన్నంగా రాస్తారు?

బాలల కోసం రచన అనుకున్నప్పుడు ప్రధానంగా పది సంవత్సరాలు పైబడిన పిల్లల్ని దృష్టిలో వుంచుకుంటాను. సాధ్యమైనంత సరళంగా భాష వుండేలా జాగ్రత్తపడతాను. ‘అందమైన పూలతోట’ నవల రాసేటప్పుడు మా పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని స్థూలంగా కథ చెప్పి ఇప్పుడు మీరయితే ఏం చేస్తారు అని అడిగాను. వారు చెప్పిన సమాధానాలు విన్నాక నవల మొదలయింది. ఇది అప్పట్లో బాలజ్యోతి పత్రికలో మొదటి బహుమతి పొందిన నవల. అప్పటికీ, ఇప్పటికీ అది ప్రయోగాత్మక రచన. మరో ప్రయోగం ‘మా హృదయం’. ఇది కూడా ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లల దృష్టి కోణం నుండి రాసింది. స్వాతి మాసపత్రికలో చివరి సీరియల్‌. అమ్మ నుండి మొదలై నాన్నతో ఇది ముగుస్తుంది. దాదాపు 48 అంశాలు. ముందు మా పిల్లలు సృజన్‌, స్పందన్‌లతో రెండు అంశాల మీద రాయించాను. ఆ భాషను అర్థం చేసుకున్నాను. నేను కూడా ఒకప్పటి పిల్లవాడిని కాబట్టి చిన్నప్పటి నా ఆలోచనలు, అనుభూతులు జోడించాను. అది కూడా బాల సాహిత్యంలో ప్రయోగాత్మక రచనగా నిలింది. ఇవన్నీ నాలుగు దశాబ్దాల క్రితం రచనలు.


పిల్లలు ఫ్యాంటసీని ఇష్టపడతారు. వాటితోపాటు నేను ఆధునిక పిల్లల జీవితాల గురించి రాశాను. ‘జమీందారు కోట’, ‘దేవతా ఓ దేవతా’, ‘ఆట’, ‘పిల్లల పుస్తకం’, ‘దారితప్పిన పిల్లవాడు’, ‘మాయాలోకం’ ఇలాంటివే. నా ప్రతి నవలలోనూ అణగారిన వర్గాల పిల్లల పాత్రలు వుంటాయి.

బాల సాహిత్యం రాయగలగటానికి మీ చుట్టూ పిల్లల బాల్యం, మీ బాల్యం ప్రభావం ఎంత?

నేను బాల సాహిత్యం రాయటానికి ప్రథానమైన సోర్స్‌ అప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లలే. వారిని నిశితంగా గమనిస్తుంటాను. వారి మాటలు, అల్లర్లు, కోరికలు, కోపతాపాలు ఇవన్నీ దగ్గరగా చూస్తుంటాను. అవే అనేక కథలూ, నవలలుగా రూపొందాయి. పెద్దల కోసం రాసినవయినా, ‘మంచుమైదానం’, ‘బాబూ ఓ బాబూ’, ‘మా తాత-గీత-మాప్రయాణం’ ఇంకెన్నో నవలల్లో పిల్లలు ప్రధానపాత్రధారులు. నా మనవరాలు సాన్వి అజాద్‌ నాకు అయిదారు నవలలకు ప్రేరణ అయింది. నా పిల్లలు, వారితో స్నేహం చేసినవారు... ఇలా అనేకమంది. వారి భావాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వారిని చిత్రించే ప్రయత్నం చేశాను.


ఇంక నా బాల్యం, నా కష్టాలు, కన్నీళ్లూ నా ఆస్తి. మాది పెద్ద మైదానం. అక్కడ గట్టు మీద మూడు చింత చెట్లు- మా మైదానంలో అన్ని కులాలు, మతాల, వర్గాల ప్రజలు వున్నారు. ఓ రకంగా ఆర్‌.కె. నారాయణ్‌ ‘మాల్గుడి డేస్‌’ లాంటి జీవితం దగ్గరగా మా రేపల్లెలో చూశాను. నాన్న నా ఏడు సంవత్సరాల వయసులో చనిపోయారు. అప్పుడు మృత్యువు అంటే తెలియదు. నాన్నను ప్రకృతిలో వెతుక్కున్నాను. క్రీస్తులా పునరుత్థానం చెందుతాడని నమ్మకం. ఇదంతా ‘మనోప్రస్థానం’ నవలలో వుంటుంది. అలా మా మైదానంలో ఇప్పటి వరకు తవ్వుకుంది స్వల్పమే. ఇంకెన్నో అనుభవాలు వున్నాయి. నా జీవితం నాన్న కమ్యూనిస్టు నేపథ్యంలో నన్ను తీవ్రవాదంలోకి నెట్టలేదు. సమన్వయాన్ని నేర్పాయి. నాకు కాస్త గౌరవాన్ని ఇచ్చింది బాల్యం-పిల్లలు. అలాగే మా అమ్మ విజయలక్ష్మి లక్ష్మణరావు. నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన సోదరులు-అక్కలూ, వీరందరి తర్వాత నా భార్య జానకి, నా పిల్లలు, మనవడూ, మనవరాళ్లు, స్నేహితులు, గురువులు వాళ్లందరూ లేకపోతే నేను ఏమైపోయేవాడినో తెలియదు.


మీరు చదివిన బాలసాహిత్య రచనల్లో మిమ్మల్ని ప్రభావితం చేసినవేమిటి?

చిన్నతనంలో ‘చందమామ’, ‘బాలమిత్ర’ లాంటి పత్రికలు అందుబాటులో వుండేవి. అలాగే ఆంధ్రపత్రికలో ‘రామచరిత మానస్‌’ అని సీరియల్‌గా వస్తుండేది. నెల రోజులు, వారం రోజులు ఎదురు చూసేవాళ్లం. మా రేపల్లె గ్రంథాలయానికి వెళ్లాక అక్కడ పిల్లల నవలలు దొరికాయి. ఎవరు రాశారో తెలియదు. రచయితల పేర్లు చూసేవాడ్ని కాదు. అందులో అద్భుత ప్రపంచమే ప్రధానం. అప్పట్లోనే కథలు రాయాలనిపించింది. పత్రికలకు ఎలా పంపాలో తెలియదు. పది సంవత్సరాల వయసులో కొన్ని రచనలు చేసినా అవన్నీ పోయాయి. తర్వాత కాలంలో సోవియట్‌ రచనలు. అవి పిల్లలవి కావచ్చు, పెద్దవారి కోసం కావచ్చు. తక్కువ ధరలో దొరికేవి. అవి చదవటం వలన నాకు సరళత్వం వచ్చింది. అలాగే సౌందర్య దృష్టి వచ్చింది. ఆ రచనలు ఎంత హాయిగా వుంటాయో- పోప్లార్‌ చెట్లు, తొలి ఉపాధ్యాయుడు, జమీల్యా లాంటివి. తర్వాత ‘పిల్లలకే నా హృదయం అంకితం’ లాంటి పుస్తకాలు. రవీంద్రుడి నుండి నాకు అందుబాటులోకి వచ్చిన వివిధ దేశాల మహా రచయితలు పిల్లల కోసం రచించిన సాహిత్యం. అలాగే రైలుబడి లాంటి పుస్తకాలు. ఇవన్నీ నా జీవితాన్ని మలుపు తిప్పాయి.


మీరు వందకుపైగానే పుస్తకాలు రాశారు. ఇంత విరివిగా రాయటానికి రచయితకి ఎలాంటి శిక్షణ, క్రమశిక్షణ అవసరం?

నేను మన మహా రచయితల, రచయిత్రుల పుస్తకాలు చాలా కాలం చదవలేదు. దానికి కారణం నాకు అందుబాటులో లేకపోవటం. పందొమ్మిది సంవత్సరాల లోపు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. ఉద్యోగం లేదు. ఆస్తులు అమ్మి ఉద్యమాల్లో పాల్గొని, ఆరు సంవత్సరాలు జైలు జీవితం గడిపి, పార్టీ చీలక ముందు మా తండ్రి చనిపోయారు. అయిదుగురు పిల్లలం. కేవలం డెబ్బై అయిదు రూపాయలతో మా అమ్మ మమ్మల్ని పెంచింది. నాలుగు ముక్కలు కార్డులో రాయటానికి మా అమ్మ గంట తీసుకునేది. తను చదువుకుంది మూడో తరగతి. అందుకోసం నేను రాసే ప్రతి వాక్యం వెనుక మా అమ్మ వుంది. రోడ్డు మీద నిలబడిన నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య జానకి వుంది. నేను అనేక రకాల ఉద్యోగాలు చేశాను. 1983 నుండి నా రచనలు వెలుగు చూడటం మొదలు పెట్టాయి. అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. నవలను రెండు మూడు రోజుల్లో రాశాను. ఓ పని మొదలు పెడితే అది పూర్తి అయ్యేదాకా అశాంతి. టివీకి రాసినా సాహిత్యాన్ని వదలలేదు. రోజుకు పద్దెనిమిది గంటలు రాసేవాడిని.


మనం ఎంత కష్టపడ్డాం అనేది పాఠకులకు అనవసరం. మనం ఏ రంగాన్ని ప్రేమిస్తే ఆ రంగంలో మన ముద్ర వేయాలంటే వ్యక్తిగత ఆనందాల్ని పక్కన పెట్టాలి. నా ఆరోగ్యం దెబ్బతింది. అయినా నాకు దిగులు లేదు. అలాగే ఎప్పటికప్పుడు ప్రక్రియలు మార్చాలి. అప్పుడు ఫ్రెష్‌గా వుంటాం. మళ్లీ అక్కడ నేర్చుకుంటాం. ఆ రకంగా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశాను, చేస్తున్నాను. ఇంకా ఓపిక వుంది. అందుకే క్రమశిక్షణ అనేది ఎవరికి వారు పాటించాల్సింది. శిక్షణ అవసరమే. అప్పట్లో మాకు బతుకు సమస్య. పడుతూ లేస్తూ ముందుకు నడిచాను. పుస్తకాలు, సంభాషణలు, ప్రజలు వీరందరూ ఎవరికయినా అదృశ్య గురువులు. ప్రత్యక్షంగా కూడా. నాకు ఆంగ్లం రాదు. అది వచ్చి వుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది.

ముందుగా నన్ను ఆదరించిన పత్రికలకు, సంపాదకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పట్లో రచయితగా గుర్తింపు పొందటానికి అవకాశాలు తక్కువ. కమర్షియల్‌ సాహిత్యం, మహిళా రచయిత్రుల కాలం అది. స్పేస్‌ లేదు. అప్పుడు ఖాళీగా బాలసాహిత్యం కనిపించింది. అప్పట్లో ఈ అవార్డులు లేవు. పిల్లల నవలలను ఆదరించి వుంటే మరో పది నవలలు రాసి వుండేవాడిని కదా అనిపిస్తుంది.

నేను ఏ సంస్థల్లోనూ సభ్యుడ్ని కాదు. అందుకు కారణం ఆ నియమాలకు తగ్గట్లు పనిచేసే అవకాశాలు లేకపోవటం. అలాంటి సంస్థల్లో కొన్ని పరిమితులు వుంటాయి. అందుకే స్వేచ్ఛగా, విస్తృతంగా రచనలు చేశాను. ప్రజలకు వ్యతిరేకంగా రచనలు వుండకుండా జాగ్రత్త పడుతుంటాను.

పి. చంద్రశేఖర అజాద్‌

Updated Date - Jul 01 , 2024 | 12:34 AM