‘‘రాసిన దాని కంటే, నేను ఎవరు అనేదే గ్లోరిఫై అవుతున్నది!’’
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:30 AM
కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు, మొదటి రెండు కథలు తెలుగు లోనే రాసాను. ఆ కథలను తోట అపర్ణ గారికి చూపిస్తే, ‘ఇవి తెలుగు కథలా! బంజారా కథలా!’ అని అడిగారు. అవి మావాళ్ళ కథలని చెప్పాను. ‘మరి మీవాళ్ళు తెలుగు భాష అంత...
మీ ‘ఢావ్లో’ కథా సంపుటిలో గోర్ బంజారాల జీవితాన్ని చిత్రించేందుకు తెలుగు భాషను వాడాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? మీకంటే ముందు ఈ వర్గం రిప్రజెంటేషన్ ఈ భాషలో అతితక్కువ ఉండటం వల్ల కథలు రాయటంలో ఇబ్బందులేమైనా ఎదురయ్యాయా?
కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు, మొదటి రెండు కథలు తెలుగు లోనే రాసాను.
ఆ కథలను తోట అపర్ణ గారికి చూపిస్తే, ‘ఇవి తెలుగు కథలా! బంజారా కథలా!’ అని అడిగారు. అవి మావాళ్ళ కథలని చెప్పాను. ‘మరి మీవాళ్ళు తెలుగు భాష అంత స్పష్టంగా మాట్లాడుతారా’ అని ప్రశ్నించారు. అప్పుడు మా వాళ్లు మాట్లాడే తెలుగును కథలోని పాత్రలకు అనుగుణంగా వాడాలని నిశ్చయించు కున్నాను. అలా నిజామాబాద్‌లో బంజారాలు మాట్లాడే భాషని కథలో వాడుతూ వచ్చాను. బంజారా పదాలను పరిచయం చేయాలనుకుని కథల్లో చొప్పించిన కొన్ని పదాలను తర్వాత వద్దని తీసేస్తే, ఆచార్య సూర్యాధనంజయ్ గారు, ఉంచిన వాటికి కింద ఫుట్ నోట్ ఇస్తే బాగుంటుంద న్నారు. నేనేమో పూర్తిగా ఆంధ్ర తెలుగుకి అలవాటు పడిపోయాను, చుట్టూ ఉన్నవాళ్లు మాట్లాడేది కూడా అలాగే ఉండడంతో, ఒకరకంగా తెలుగంటే అదే అనేంత అలవాటు పడిపో యాను. తెలంగాణ జిల్లాల్లోని తండాల్లో మా వాళ్ళు మాట్లాడే భాష ప్రత్యేకంగా ఉంటుంది. కానీ అదే భాషని రాద్దాం అనుకున్న ప్పుడు, నాకు తెలియకుండానే భాష షిఫ్ట్ అయిపోయేది.
సవాళ్ళు ఎదుర్కొన్నానని అనను కానీ, ఎడ్యుకేట్ అయ్యానని అనుకుంటున్నాను. రిప్రెజెంటేషన్ తక్కువ ఉండడం వల్ల ఇబ్బందేమీ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వేళ ఉండి ఉంటే పాఠకులలో ఓ అభిప్రాయం ఏర్పడిపోయి ఉండేది. అప్పుడు కొత్తగా వస్తున్న సాహిత్యాన్ని వారు అక్కున చేర్చుకున్నా, బంజారాల మీద వారికి ముందు నుండీ ఉన్న అభిప్రాయం మారుతుందా అన్నది కచ్చితంగా చెప్పలేము. అలాగని నాకంటే ముందు రాయబడిన సాహిత్యం మా జీవితం కాదని అనను. అలాగని నేను రాస్తున్నది పూర్తిగా బంజారా జీవితమనీ అనను. సగం మాత్రమే బంజారా, మిగిలింది తెలుగు జీవితమే. వీలైనంత వరకు సంపూర్ణ బంజారా జీవితాన్ని అక్షరీకరించాలన్నదే నా ఆరాటం.
సాహిత్యం వైపు మీ తొలి అడుగుల గురించి చెప్పండి?
2009-10లో తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న కాలం. శ్రీ విజయ సాయి హై స్కూల్ (బోధన్) లో నేను హాస్టల్‌లో ఉంటూ చదుకుంటున్న రోజులవి. అప్పటికే బొమ్మలు స్కెచ్‌లు వేసే వాడిని. మొదట బొమ్మలే వేశాను, కానీ ఎందుకో తర్వాత వాటికి రెండు లైన్ల క్యాప్షన్స్ రాయాలని అనిపించి, రాయడం అలవాటు చేసుకున్నాను. తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబందించి పంపా సాహితి పీఠం (బోధన్) వారి కోసం ‘తెలంగాణ ఔన్నత్యం’ అనే కవితని రాస్తే మా తెలుగు టీచర్ శిరీష ఎడిట్ చేశారు. ఆ తర్వాత అలానే స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా, నా స్పీచ్ ఉండేది. ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి నా పెయింటింగ్ గిఫ్ట్‌గా ఇవ్వడం ఇవి తప్పనిసరిగా ఉండేవి. ఆ రకంగా రచనల వైపు తొలి అడుగులు పడ్డాయని చెప్పొచ్చు.
ఈ పుస్తకానికి పెట్టిన ‘ఢావ్లో’ అనే శీర్షిక గురించి చెప్పండి?
మా వాళ్లలో ముఖ్యంగా స్త్రీలు ఢావ్లోను కచ్చితంగా నేర్చుకుంటారు. ఢావ్లో అంటే విషాద గీతమని అర్థం. దీనిని విషాద సమయాల్లోనే కాదు, ఆనంద సమయాల్లోనూ, ఎదురుపడినప్పుడల్లా కౌగిలించుకొని పాడుకుంటూ ఏడుస్తుంటారు/ ఏడుస్తూ పాడుకుంటారు. మా పూర్వీకులు పాడుకున్న పాటలు, లిఖితపూర్వకంగా లేకున్నా, మౌఖికంగానే కొత్త తరాన్ని చేరుతున్నాయి. ఇప్పటికీ కాలానికి అనుగుణంగా భిన్న సందర్భాలను, అనేక అనుభ వాలను తమలోని ఉద్వేగంతో జోడించి ఢావ్లోను కొత్తగా పాడుకుంటున్నారు. ఈ మార్పు ద్వారా తమ పూర్తి బాధను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ మౌఖిక సంప్రదాయం ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నా, కూసింత మోడరన్‌గా కూడా మారింది. ముఖ్యంగా నా కథా సంపుటికి ఈ శీర్షిక పెట్టడానికి కారణం ఏంటంటే, చుట్టూ ఉన్న సాహితీ మిత్రులందరూ వాళ్ల బాల్యంలో వాళ్ళు చూసిన, విన్న ఈ ఢావ్లోను గురించి అడిగారు. నా మొదటి పుస్తకం బల్దేర్ బండితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక అక్కడ ప్రయాణాన్ని కొనసాగించాను. ఆ ప్రయాణం తర్వాత నా కథ చెప్పడం అవసరం కదా అనిపించింది. అందుకే ఢావ్లోను వినిపించాను.
ఈ కథల పట్ల వచ్చిన స్పందనల్లో మీరు మర్చిపోలేనివి? మీ కుటుంబం, తోటి గోర్ బంజారాల స్పందనలు?
నిజానికి నా ఇంగ్లీష్ పుస్తకం చక్మక్‌కి వచ్చిన సమీక్షల్లో నా తెలుగు పుస్తకాలకు పావు వంతు సమీక్షలు కూడా రాలేదు. దీనికి గల కారణం తెలిసిందే, నేను బంజారా సంచార తెగకు సంబందించిన వాడిని కావడం. నేను రాసిన దాని కంటే, నేను ఎవరు అనేదే గ్లోరిఫై అవుతున్నది. ఇది ఒక్క నా విషయమనే కాదు, బహుశా వేరే గిరిజన, ఆదివాసీ కొత్త గొంతుకలకు కూడా ఇలానే కావొచ్చు. చేసిన పని కంటే, మన బాక్‌గ్రౌండ్ ఎక్కువగా ప్రచారమౌతుంది. కొన్నిసార్లు గ్లోరిఫికేషన్ అవసరమే కానీ, సాహిత్యం విషయంలో ఇది అనవసరం. మా ఇంట్లో వాళ్లకు ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను ఇలా రాసుకుంటూ జీవితం పాడు చేసుకుంటున్నానేమో అనే బాధ, మా తండా వాళ్లకు నేనేదో గొప్పపని చేసినందుకే పత్రికలు నా గురించి రాసాయనే ఆనందం అలానే ఉంటాయి. బాగా రాశానని దానికి గల కారణాలు చెప్పిన వారు ఉన్నారు. బాలేవు అని అన్నారే తప్పించి, ఎందుకో కారణం ఇప్పటి దాకా వాళ్ళు చెప్పలేదు, నేనింకా ఎదురు చూస్తునే ఉన్నాను. కాస్తో కూస్తో చదుకున్న వాళ్ళు పుస్తకాన్ని అపురూపంగా మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. మా నాన్న తరం వాళ్ళు నా పుస్తకాలను ఇంట్లో దాచుకుని, వాళ్ళ చుట్టాలకు మా తండా పిల్లాడు రాసాడు అని చూపించుకుంటున్నారని వాళ్ళూ వీళ్ళూ చెప్తుంటే భలే అనిపిస్తుంటుంది.
సాహిత్యంలో మున్ముందు మీరు ముఖ్యంగా చేయాలనుకుంటున్నవి, రాయాలనుకుంటున్నవి?
సాహిత్యంలో కొత్త కొత్త పోకడలు వస్తూనే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్, సర్రియలిజం, మ్యాజికల్ రియాలిజం ఇలాంటి వాటి గురించి వింటూ ఉంటాం. వీలైనంత వరకు వీటిని నా రచనల్లో సహజంగా తీసుకురావాలని అనుకుంటున్నాను. రాసే వాటిలో సహజత్వం ఎంతుంటుందో తెలీదు కానీ, ఇది నా ఆలోచన, నా రచనాభిలాష. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు మొత్తం 35 గిరిజన, సంచార, ఆదివాసీ తెగలు ఉన్నాయి. నా అవగాహన మేరకు, వాటిలో కొన్ని తెగలకు సంబందించి సాహిత్య సృజన చేసినా చాలనుకుంటున్నాను. రాయడం అనేది కచ్చితం, కానీ ఎంత కాలం రాస్తాను, ఏం రాస్తాను అనేది చుట్టూ వాతావరణమే డిసైడ్ చేస్తుందని నమ్ముతాను. ప్రస్తుతానికి సూర్యాధనంజయ్, ధనంజయ నాయక్, మంత్రి శ్రీనివాస్ గార్లతో కలిసి ఓ సంకలనానికి పని చేస్తున్నాను.
ఈమెయిల్: rameshkarthik225@gmail.com
రమేశ్ కార్తీక్ నాయక్