Hindustani Classical Music : అల్లావుద్దీన్ ఖాన్ అనశ్వర సప్తస్వరాలు
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:00 AM
అదొక అపురూపమైన రసానుభూతి. గొప్పదనం సమక్షంలో ఉన్నానని నాకు నేను ప్రప్రథమంగా తెలుసుకున్న సందర్భమది. యాభై హేమంతాల క్రితం (1974లో) న్యూఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ఒక షామియానా కింద ఆసీనులమయి వున్నాము.
గతానుగతం
బాబాగా ప్రేమాస్పదుడు అయిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ (1862–1972) ఇరవయ్యో శతాబ్ది ప్రముఖ సంగీత ఉపాధ్యాయులలో ఒకరు. ఆయన సంగీత విద్యా కుటుంబం విస్తృతమైనది. అందులో పండిట్ రవి శంకర్, పన్నాలాల్ ఘోష్, నిఖిల్ బెనర్జీ మొదలయిన వారితో పాటు తనయుడు అలీఅక్బర్ ఖాన్, తనయ అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఎందరో బాబా శిష్యులు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ధ్రువతారలుగా వెలుగొందుతున్నారు.
అదొక అపురూపమైన రసానుభూతి. గొప్పదనం సమక్షంలో ఉన్నానని నాకు నేను ప్రప్రథమంగా తెలుసుకున్న సందర్భమది. యాభై హేమంతాల క్రితం (1974లో) న్యూఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ఒక షామియానా కింద ఆసీనులమయి వున్నాము. నేను కళాశాల విద్యాభ్యాసంలోకి ప్రవేశించిన తొలి సంవత్సరమది. నా స్నేహితులు కొంతమంది మోడరన్ స్కూల్‌లో జరగనున్న సంగీత సభకు నన్ను తీసుకువెళ్లారు. అలీ అక్బర్ ఖాన్ సరోద్‌పై లయాన్విత సరిగమలను, రవి శంకర్ సితార్‌పై సుకుమార రాగాలను, అల్లా రఖాఖాన్ తబలాపై మనసు, తనువును పులకరింప చేసిన శబ్దరావాలను ఆ కచేరిలో వినిపించారు. దశాబ్దాలు గడిచిపోయినందున ఆ సంగీత మాంత్రికులలో ఎవరు ఏ రాగాలను వాయించిందీ గుర్తుచేసుకోలేక పోతున్నాను. అయితే పరిసరాలను విస్మరింపచేసిన ఆ వాద్యధ్వనులు నన్ను సంపూర్ణంగా మంత్రముగ్ధుని చేశాయన్నది నాకు ఇంకా ఒక పచ్చని జ్ఞాపకంగా ఉన్నది. అలీ అక్బర్ ఖాన్, రవి శంకర్ ఇరువురికీ గురువు అయిన అల్లావుద్దీన్ ఖాన్ స్మృత్యర్థం ఆ సంగీత సభను నిర్వహించారు.
యాభై సంవత్సరాల క్రితం న్యూఢిల్లీ మోడరన్ స్కూల్‌లో నా సంగీతాసక్తులను పూర్తిగా మార్చి వేసిన ఆ రాత్రి, కొద్ది రోజుల క్రితం అన్నపూర్ణాదేవి సుర్ బహర్‌పై అద్భుతంగా వాయించిన మంజ్ ఖమాజ్ రాగం రికార్డింగ్‌ను వింటున్నప్పుడు, మళ్లీ జ్ఞాపకమొచ్చింది. ఆ రాగాన్ని ఇంతకు ముందు ఎన్నోసార్లు విన్నాను. అయితే ఇప్పుడు అది ఎలాగో మన మహోజ్వల సంగీత వారసత్వం, ప్రత్యేకించి ఒక నిర్దిష్ట ఘరానా (మైహర్) గురించి ప్రగాఢంగా ఆలోచింపచేసింది.
అలీ అక్బర్ ఖాన్ తోబుట్టువు, రవి శంకర్ మొదటి భార్య అన్నపూర్ణాదేవి. తండ్రి అల్లావుద్దీన్ ఖాన్ వద్దే ఆమె సంగీత శిక్షణ పొందారు. ఆమె ఎంచుకున్న, ఆమెకు బాగా ఇష్టమైన వాద్యపరికరం సుర్ బహర్. అయితే ఈ ప్రతిభావంతురాలి సంగీత జీవితం సాఫీగా సాగిపోలేదు. వివాహ జీవితంలో వైపరీత్యాలు ఆమెను ఏకాంతవాసానికి గురిచేశాయి. అయితే ఆమె సంగీత వైదుష్యం పలువురు గొప్ప సంగీతకారులను సృష్టించింది. వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా వారిలో ఒకరు. (అన్నపూర్ణ జీవితం, సంగీత వైదుష్యం, వారసత్వంపై నిర్మల్ చందర్ ఇటీవల ఎ–6 ఆకాశ్ గంగ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందించారు).
అన్నపూర్ణ సంగీతాన్ని వింటూ 1974లో ఆ రాత్రి అలీ అక్బర్ ఖాన్, రవి శంకర్‌ల సరోద్, సితార్ వాద్యాల గురించిన ఆలోచనలు అల్లావుద్దీన్ ఖాన్‌పై వేద్ మెహతా రాసిన వ్యాసాన్ని మళ్లీ చదివేందుకు నన్ను పురిగొల్పాయి. అల్లావుద్దీన్ ఖాన్‌ను పలుమార్లు స్వయంగా చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా వేద్ ఆ వ్యాసాన్ని రాశారు. ఆసక్తికరంగా ఉన్న వేద్ కథనంలో కల్పన ఎక్కడ ముగిసిందో, వాస్తవం ఎక్కడ ప్రారంభమయిందో చెప్పడం కష్టం. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న ఒక మూర్మూల గ్రామం నుంచి అల్లావుద్దీన్ జీవన ప్రస్థానం ప్రారంభమయిందని వేద్ విరించారు. తనకు సంగీతాన్ని నేర్పగల గురువులను అన్వేషిస్తూ కలకత్తాకు వచ్చిన అల్లావుద్దీన్ ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా ఓర్పుగా భరిస్తూ, ఎదుర్కొంటూ కఠిన, గంభీర గురువుల వద్దకు చేరగలిగారు. ఆయన తన స్వతస్సిద్ధ సంగీత ప్రతిభను గురువుల శుశ్రూషతో పరిపూర్ణం చేసుకున్నారు. ఈ సంగీత జిజ్ఞాసువు, ఆనాటి సుప్రసిద్ధ సంగీతకారుడు వహీద్ ఖాన్ బీన్‌కార్ వద్ద శిక్షణ పొందడానికి రాంపూర్ వెళ్లారు. బీన్‌కార్ దయతలచలేదు. ఆయనను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు అల్లావుద్దీన్ శతథా ప్రయత్నించారు. ఫలితం లేకపోయింది. విసిగిపోయిన అల్లావుద్దీన్ ఒక రోజు రాంపూర్ నవాబుకు తన గోడు చెప్పుకున్నాడు. నవాబు సూచన మేరకు గర్విష్ఠి అయి వహీద్ ఖాన్ తన శిష్యుడిగా అల్లావుద్దీన్‌ను స్వీకరించాడు.
అల్లావుద్దీన్ ఆ తరువాత మధ్య భారతంలోని మైహర్ అనే చిన్న సంస్థానానికి వెళ్లి. లోకోత్తర సంగీతాన్ని సృష్టిస్తూ ప్రతిభావంతులైన శిష్యులను అద్వితీయ సంగీతకారులుగా తీర్చిదిద్దుతూ జీవితాంతం అక్కడే ఉండిపోయారు. ఆయన శిష్యులలో, ఇప్పటికే ప్రస్తావితమైనవారే కాకుండా సితార్ విద్వాంసుడు నిఖిల్ బెనర్జీ, వేణుగాన విద్వాంసుడు పన్నాలాల్ ఘోష్ తదితరులు ఉన్నారు. అన్నట్టు ఏమంత ప్రతిభావంతుడు కానప్పటికీ మైహర్ మహారాజా కూడా అల్లావుద్దీన్ శిష్యగణంలో ఒకరు. సంగీత బోధన చేయని సమయాలలో అల్లావుద్దీన్ నమాజ్ చేసేవారు. మతాచారం ప్రకారం రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసేవారు. అంతేకాకుండా మైహర్ పట్టణంలోని హిందూ దేవాలయంలో నిత్యం పూజలు, ప్రార్థనలు చేస్తుండేవారు. క్రమంగా మైహర్‌లోను, సంగీతలోకంలోను ఆయన ‘బాబా’ (బెంగాలీలో తండ్రి, హిందుస్థానీలో గౌరవనీయ వృద్ధ విజ్ఞాని అని అర్థం)గా సుప్రసిద్ధమయ్యారు.
వేద్ మెహతా వ్యాసం (ఇది 1970లో ప్రచురితమైన ఆయన ‘పోర్ఠ్రైట్ ఆప్ ఇండియా’ పుస్తకంలో ఉంది) తరువాత అల్లావుద్దీన్ ఖాన్ జీవితం, సంగీతంపై ఇటీవల వెలువడిన అంజనా రాయ్, సహనగుప్తా పుస్తకాలు చదివాను. బాబా సంగీతం గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు మెహతా వ్యాసం కంటే ఈ పుస్తకాలు ఎక్కువగా ఉపకరించాయి. అల్లావుద్దీన్ వైయక్తిక, వృత్తిగత ప్రస్థానాలు, పలు విభిన్న సంగీత వాద్యాలను వాయించడంలో ఆయనకు ఉన్న అసమాన అధికారం, భారతీయ సంగీతానికి ఆర్కెస్ట్రా, పలు కొత్త జోడ్ రాగాలను సృష్టించడంలో ఆయన అసమాన కృషిని లోతుగా సమగ్రంగా ఈ పుస్తకాలు వివరించాయి. ఇరువురి కథనాలు పలుచోట్ల ఆరాధనాపూర్వకంగా ఉన్నప్పటికీ బోధనకు సంబంధించి బాబా సిద్ధాంతాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. వేద్ మెహతా ప్రకారం ‘బోధనలో బాదడం అంతర్భాగమే కాకుండా అనివార్యం’ అనేది బాబా సిద్ధాంతం! ఇది యథార్థమేనని నా బెంగాలీ స్నేహితులు ధ్రువీకరించారు, మైహర్ మహారాజా సైతం గురువు గారి అసహనం ఫలితంగా దేహశుద్ధికి గురయ్యారనే ఐతిహ్యం ఒకటి ఉన్నది మరి.
అల్లావుద్దీన్ ఖాన్ వ్యక్తిత్వంలోని ఈ లక్షణం ఈ తరం వారికి సహజంగానే నచ్చకపోవచ్చు. సహన గుప్తా పుస్తకానికి అన్నపూర్ణాదేవి రాసిన ముందు మాటలోని ముగింపు మాటలు నాకు ఎంతో సాంత్వననిచ్చాయి (అన్నపూర్ణాదేవి తన తండ్రి గురించి ఆంగ్లంలో రాసింది ఈ ముందు మాట ఒక్కటే కావచ్చు). ఆమె ఇలా రాశారు: ‘బాబా తన జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా మైహర్‌లో గడిపారు. భగవదత్తమైన తన సంగీతాన్ని ఇతరులకు వినిపించారు, శిష్యులకు బోధించారు. ఇరవయో శతాబ్ది మహోన్నత సంగీత వాద్యకారులలో పలువురు ఆయన శిష్యులే’. అలీఅక్బర్ ఖాన్, రవి శంకర్, పన్నాలాల్ ఘోష్, నిఖిల్ బెనర్జీ తదితరులను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు ఆమె తన పేరును ఆ జాబితాలో చేర్చలేదు. లలితకళాభిజ్ఞురాలుగా సుర్ బహర్ వాయిద్యంలో అద్వితీయ ప్రతిభాశాలిగా భారతీయ సంగీత జగత్తులో అన్నపూర్ణ సుప్రసిద్ధురాలు. ఆమె ముందు మాటలోని చివరి వాక్యం నా మనసులో నిలిచిపోయింది: ‘అన్నిటికీ మించి బాబా, నాకు తెలిసిన వారందరిలోను బహుశా పరిపూర్ణ లౌకికవాది’. అంజనారాయ్ కూడా ఇదే విధంగా రాశారు: అల్లావుద్దీన్ ఖాన్ సంకుచిత స్వభావుడు కాదు. మతాభినివేశ జాతీయవాది కాదు. ఆయన దేశభక్తి ప్రపూర్ణుడు. ఒక విశాల ప్రపంచ దృక్పథంలో మిళితమైన దేశభక్తి ఆయనది... హిందువులు ముస్లింల మధ్య సంపూర్ణ సమైక్యతను ఆయన ఆకాంక్షించారు. సకల మతాలు, విశ్వాశాల సమ్మేళనాన్ని ఆయన ఆశించారు’.
నేను సంగీత విద్వాంసుడిని కాను, సంగీత గుణగ్రహణ పారీణుడిని కాను, కేవలం ఔత్సాహిక శ్రోతను మాత్రమే. ఆ స్ఫూర్తితోనే ఈ కాలమ్ రాశాను. అదే స్ఫూర్తితో అల్లావుద్దీన్ సంగీత విద్యా కుటుంబంలోని వారి సంగీత కృతులలో వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన వాటిని ప్రస్తావించదలుచుకున్నాను. అవి: ఇంతకు ముందే ప్రస్తావించిన అన్నపూర్ణదేవి మంజ్ ఖమాజ్‌తో పాటు రవి శంకర్ పహాడి ఝింఝోతి; అలీ అక్బర్ ఖాన్ ఛాయానత్; నిఖిల్ బెనర్జీ రాగేశ్వరి, పన్నాలాల్ ఘోష్ హంసధ్వని, బహదూర్ ఖాన్ నత్ బిల్వాల్. సంగీత విశ్వంలో అల్లావుద్దీన్ ఖాన్ ఒక ధ్రువతార. ఆయన సంగీతం అజరామరమైనది అనేది ఎన్నటికీ ఎవరూ కొట్టివేయలేని సత్యం.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - Dec 28 , 2024 | 01:02 AM