ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: బీజేపీకి ‘ఆమె’ మద్దతు తక్కువే!

ABN, Publish Date - Jun 15 , 2024 | 02:27 PM

ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.

ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.


రైతుల ఆగ్రహమే భారతీయ జనతా పార్టీకి కనీస మెజారిటీని నిరాకరించిందా? దళితులలో రహస్య వ్యాకులత బీజేపీకి వ్యతిరేకంగా పని చేసిందా? ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు బీజేపీకి దూరమయ్యారా? లేక ముస్లిం ఓటర్ల వ్యతిరేకత వల్లే పాలక పక్షానికి సీట్ల ఆధిక్యత లభించలేదా? బీజేపీ కొత్తగా సమకూర్చుకున్న మహిళా ఓటుకు ఏమయింది? 18వ సార్వత్రక ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఈ ప్రశ్నలకు కీలక ప్రాధాన్యమున్నది.

ఆ ఫలితాల సమగ్ర విశ్లేషణ అనేక భ్రమలను తొలగించింది. జాతీయ స్థాయిలో ప్రధాన సామాజిక వర్గాల ఓటింగ్ ప్రాధాన్యాలలో ఎటువంటి మార్పు లేదు. అయితే దళితులు, పేదలు, సన్నకారు రైతాంగ వర్గాలలో అటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు, ముస్లిం ఓటర్లు సంఘటితమయ్యారు. అగ్రకులాలు, మధ్యతరగతి ప్రజలు, హిందువులలోని బాగా వెనుకబడిన కులాలవారు, ఆదివాసీలలో బీజేపీ తన ప్రభావాన్ని, ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నది. ఓటింగ్ తీరుతెన్నులలో ఈ మార్పులు, యథాతథ పరిస్థితుల మూలంగా ఎన్‌డీఏకు లభించిన ఓట్ల శాతం జాతీయ స్థాయిలో లభించిన ఓట్ల శాతం తగ్గిపోయింది రాష్ట్ర స్థాయిలో ఆయా సామాజక వర్గాల ఓటింగ్ ప్రాధాన్యాలలో మార్పులు చాలా ఆసక్తికరంగాను, ప్రభావ శీలంగాను ఉన్నాయి. మా విశ్లేషణ ఒక బృహత్ రాజకీయ సవాల్‌ను నివేదిస్తుంది. 1990ల్లో అధికార సాధనలో బీజేపీ ఉత్థానం ఒక కొత్త సామాజిక కూటమిని సృష్టించింది.. ‘అగ్ర’ కులాల, ‘మధ్య’ తరగతి, పట్టణ ప్రాంతాల, , పురుష ఓటర్ల సామాజిక సంకీర్ణమది. ఈ సామాజిక సంకీర్ణం రాజకీయ మెజారిటీని సాధించేందుకు సామాజికంగా దిగువ స్థాయిలో ఉన్న కులాలను కూడా కలుపుకున్నది. మోదీ జాతీయ స్థాయిలో రంగంలోకి వచ్చిన తరువాత ఈబీసీలు, పేదలు, ఆదివాసీలను కలుపుకోవడం ద్వారా ఆ సామాజిక కూటమి మరింతగా సంఘటితమయింది. అయితే ఈబీసీలు, పేదలు, ఆదివాసీలు ఈ సామాజిక సంకీర్ణంలో అనుబంధ, ప్రతీకాత్మక భాగస్వాములు మాత్రమే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ సార్వత్రక ఎన్నికలలో బీజేపీ రాజకీయ ఓటమికి లోనయినప్పటికీ దానికి మద్దతునిచ్చే సామాజిక సంకీర్ణం చాలవరకు ఆ పార్టీ పక్షానే ఉన్నది. సామాజిక వ్యవస్థలో బాగా దిగువ స్థాయిలో ఉన్న పేదలు, గ్రామీణులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలను ఏకం చేసే రాజకీయ కర్తవ్యం నెరవేరేందుకు ఇంకా చాలా దూరం పయనించవలసి ఉన్నది. సామాజికంగా అధిక సంఖ్యాకులు అయిన బహుజనులను రాజకీయంగా అధిక సంఖ్యాక వర్గంగా మార్చవలసి ఉన్నది. బహుజనులను రాజకీయ అధిక సంఖ్యాకులుగా మార్చడమనేది కాంగ్రెస్, ఇండియా కూటమిలోని దాని భాగస్వామ్యపక్షాల ముందున్న ఒక ప్రధాన సవాల్.


1) హిందూ అగ్రకులాల వారు బీజేపీకి విధేయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. సార్వత్రక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఏదో ఒక రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనే వార్తలు రావడం పరిపాటిగా ఉంది. ఇటీవలి ఎన్నికలలో యూపీలో రాజ్‌పుట్‌లు, గుజరాత్‌లో క్షత్రియులు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అగ్రకులాల హిందువులు బీజేపీకి అత్యంత విధేయ ఓటు బ్యాంకుగా ఉన్నారని మా విశ్లేషణలో వెల్లడయింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఉన్న ‘ముస్లిం ఓటు బ్యాంకు కంటే బీజేపీకి ఉన్న అగ్రకులాల ఓటు బ్యాంకే చాలా పెద్దది. మొత్తం ఓటర్ల మొగ్గు బీజేపీ నుంచి ఇతర పార్టీల వైపు ఉన్నప్పుడు అగ్రకులాల హిందువులు సైతం స్వల్పసంఖ్యలో బీజేపీకి దూరమయ్యారు. హర్యానా, యూపీలలో ఓటింగ్ ధోరణులే ఇందుకు నిదర్శనాలు.

2) ఇండియా కూటమి వైపు కిసాన్ సామాజిక వర్గాల మొగ్గు : గ్రామీణ ప్రాంతాలలో భూవసతి గల రైతు కులాలు (సవర్ణేతరులు, అయితే చాల వరకు ఓబీసీ యేతరులు) బీజేపీకి కాకుండా ఇండియా కూటమికి మద్దతు తెలిపారు వ్యవసాయరంగ దురవస్థలు, రైతుల ఆందోళనలే ఇందుకు కారణం కావచ్చు. రాజస్థాన్, హర్యానాలో జాట్‌లు, యూపీలో యాదవులు, మహారాష్ట్రలో మరాఠాలు కర్ణాటకలో కొంతవరకు లింగాయత్‌లు, ఒక్కళిగలు ఎన్‌డీఏను దెబ్బ తీశారు. అయినప్పటికీ బీజేపీ కొన్ని రైతు కులాల వారిలో తన ఓట్ల వాటాను పెంచుకున్నది. గుజరాత్‌లో పాటీదార్లు, మధ్యప్రదేశ్‌లో యాదవులు బీజేపీ విజయానికి బాగా తోడ్పడ్డారు.


3) కీలక రాష్ట్రాలలో నష్టపోయినా ఈబీసీలను నిలుపుకున్న బీజేపీ : గ్రామీణ భారతదేశంలో బీజేపీ ప్రధాన మద్దతుదారులుగా బాగా వెనుకబడిన కులాల వారు ఆవిర్భవించారు. అయితే ఈ వర్గాల మద్దతు విషయంలో దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసమున్నది.

4) బీఎస్పీకి దూరమైన దళిత ఓటర్లు: ఉత్తరప్రదేశ్‌లోను, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలోను బీఎస్పీకి, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాడి దళిత ఓటర్లు దూరమయ్యారు. ఇండియా కూటమి వైపు వారు మొగ్గారు. అయినప్పటికీ బీజేపీ, దాని మిత్రపక్షాలు దళిత ఓట్లలో తమ వాటాను ఐదు శాతం మేరకు కోల్పోయాయి. మధ్యప్రదేశ్, గుజరాత్‌లో దళిత ఓటర్ల మద్దతును బీజేపీ నిలుపుకున్నది. అలాగే తెలంగాణలో మాదిగలు బీజేపీకి మద్దతునిచ్చారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళిత ఓట్లను మళ్లీ గణనీయంగా పెంచుకున్నాయి. ఈ విషయంలో ఇండియా కూటమి ఎన్‌డీఏతో సరిసమానంగా ఉన్నది.


5) హిందూ ఆదివాసీ ఓట్లలో ఎన్‌డీఏ ఆధిక్యత: ఈ పరిణామం కాంగ్రెస్‌కు కలవరపాటు కలిగించేది. 2009 – 2024 మధ్య బీజేపీ ఆదివాసీల వాటా ఇతోధికంగా పెరిగింది. ఆదివాసీ ఓటర్లలో కాంగ్రెస్ బీజేపీ కంటే 20 శాతం మేరకు వెనుకబడి ఉన్నది. హిందూ ఆదివాసీ ఓట్లను బిజూ జనతాదళ్, బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ నష్టపోయిన మేరకు బీజేపీ లబ్ధి పొందింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో హిందూ ఆదివాసీ ఓట్లను కాంగ్రెస్ గణనీయంగా కోల్పోయింది.

6) బీజేపీ ఓటమి లక్ష్యంగా సంఘటితమైన ముస్లిం ఓటర్లు: ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ఎడతెగని ప్రచారం కారణంగా ఆ పార్టీని ఓడించేందుకు ముస్లింలు సంఘటితమయ్యారు. జాతీయ స్థాయిలో సగటు ఓటింగ్ (65 శాతం) కంటే ముస్లింల ఓటింగ్ (62 శాతం) స్వల్పంగా తక్కువ. బీజేపీకి వ్యతిరేకంగా వేసిన ఓట్లు 65 శాతం మేరకు ఉన్నాయి. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను కూడా కలుపుకుంటే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటింగ్ శాతం మరింత అధికంగా ఉంటుంది. 2019లో యూపీఏ / ఇండియా కూటమికి ముస్లిం ఓట్లు 45 శాతం లభించగా 2024లో అది 65 శాతం మేరకు ఉన్నది. అయితే ఈ పెరుగుదల ఒక మిథ్య మాత్రమే. ఎందుకంటే సమాజ్‌వాది పార్టీ, జేకేఎన్‌సీ మొదలైన పార్టీలు 2019లో యూపీఏ కూటమిలో భాగస్వాములుగా లేవు. ముస్లిం ఓట్లు ఈ పార్టీలకు గణనీయంగా పడి ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత విశ్లేషణలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు కనుకనే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటింగ్ శాతం అత్యధికంగా ఉన్నది. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కారణంగా ముస్లిం ఓట్లలో చీలిక సంభవించలేదు.

౭) కాంగ్రెస్‌కు పేద ఓటర్ల, బీజేపీకి ధనిక ఓటర్ల మద్దతు: పేద ప్రజల ఓట్లలో బీజేపీ వాటా స్తంభించిపోయింది. పేదల ఓట్లలో కులాల వారీ చీలికలు సంభవించాయనేందుకు రుజువులు లేవు. పేదల, నిరుపేదల ఓట్లలో బీజేపీ తన వాటా లోటును మోదీ రంగంలోకి వచ్చిన తరువాత భర్తీ చేసుకోగలిగింది. అయితే సంపన్నవర్గాల వారి ఓట్లలో తన వాటాను అంతకంతకూ పెంచుకొంటోంది. పేదల అనుకూల గ్యారంటీల ద్వారా పేదల ఓట్లలో తమ వాటాను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గణనీయంగా పెంచుకున్నాయి. అయితే పేద ప్రజల సానుకూల విధానాలను ఓట్లకు ప్రాతిపదికలుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ఇంకా చాలా దూరం ప్రయాణించచవలసి ఉన్నది.

8) మహిళా ఓటర్ల మద్దతులో బీజేపీ ఎప్పటి మాదిరిగానే వెనుకబడి ఉన్నది: ఈ సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అయితే మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో వెనుకబడే ఉన్నది.

9) బీజేపీకి యువ ఓటర్ల మద్దతు తగ్గుదల: ఐరోపాలో మాదిరిగా మన దేశంలో వయస్సుల వారీగా ఓటింగ్ ప్రాధాన్యాలు లేవు. 35 సంవత్సరాల వయసులోపు ఓటర్ల మద్దతు బీజేపీకి 1 నుంచి 2 శాతం మేరకు తగ్గిపోయింది యువ ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారనేందుకు గట్టి రుజువులు లేవు.

10) నగరాలలో ఎన్‌డీఏ, గ్రామాలలో ఇండియా కూటమికి మద్దతు: నగర ప్రాంతాలలో తన ప్రాబల్యాన్ని బీజేపీ నిలబెట్టుకున్నది. చిన్న పట్టణాలు, గ్రామాలలో మద్దతును స్వల్పంగా కోల్పోయింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన (యుబిటి) ముంబైలోను, డీఎంకే చెన్నైలోను మంచి ఫలితాలను సాధించినప్పటికీ ఈ కూటమికి నగరాలలో చాలా తక్కువ మద్దతు మాత్రమే లభించింది. గ్రామీణ, చిన్న పట్టణాలలోనే ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు ప్రధాన విజయాలను సాధించాయి.

(శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో)

(ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ విశ్లేషకుడు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్రయాదవ్‌ అందిస్తున్న ఐదు వ్యాసాల పరంపరలో ఇది నాలుగవది)

Updated Date - Jun 15 , 2024 | 02:27 PM

Advertising
Advertising