JNTU: ‘పట్ట’నంత నిర్లక్ష్యం.. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు
ABN, Publish Date - Dec 27 , 2024 | 08:11 AM
జేఎన్‌టీయూ(JNTU) నుంచి యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు తమ డిగ్రీ పట్టాల కోసం గగ్గోలు పెడుతున్నారు. వర్సిటీ పరిధిలో అనుబంధ, అఫిలియేటెడ్ కళాశాలల నుంచి సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రతియేటా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేస్తున్నారు.
- ఇంకా స్నాతకోత్సవం నోటిఫికేషన్ ఇవ్వని వర్సిటీ ఉన్నతాధికారులు
- గడువు తీరిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లతో ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) నుంచి యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు తమ డిగ్రీ పట్టాల కోసం గగ్గోలు పెడుతున్నారు. వర్సిటీ పరిధిలో అనుబంధ, అఫిలియేటెడ్ కళాశాలల నుంచి సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రతియేటా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది మే/జూన్ నెలల్లో పరీక్షలు పాసైన వారికి మార్కుల జాబితాతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికెట్ల(పీసీ)ను జారీచేశారు. పీసీలు అందుకున్న విద్యార్థులకు ఆరు నెలల్లోగా స్నాతకోత్సవం నిర్వహించి ఒరిజినల్ డిగ్రీలను ప్రదానం చేయాల్సి ఉంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎస్సీ వర్గీకరణ అమలు చేయించడమే ఏకైక లక్ష్యం
వాస్తవానికి యూనివర్సిటీ జారీచేసిన ప్రొవిజనల్ సర్టిఫికెట్(పీసీ) ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. నవంబరుతో గడువు ముగియడంతో వివిధ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆయా సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకునే ముందు అభ్యర్థుల ఒరిజినల్ డిగ్రీ(ఓడీ)ల కోసం పట్టుపడుతున్నాయి. అలాగే, విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులు, ఈ ఏడాది పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం తమ ఒరిజినల్ డిగ్రీ చేతికి ఎప్పుడు అందుతుందా అని ఎదురు చూస్తున్నారు.
నోటిఫికేషన్ ఇవ్వకుండా నిలువుదోపిడీ..
యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీల ప్రదానం నిమిత్తం స్నాతకోత్సవం నిర్వహిం చాల్సి ఉంటుంది. గత జనవరి 5న జేఎన్‌టీయూ స్నాతకోత్సవం నిర్వహించగా, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గతేడాది డిసెంబరులోనే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏడాది డిసెంబరు నెల మరో రెండ్రోజుల్లో ముగుస్తున్నా, రానున్న జనవరిలో నిర్వహించాల్సిన స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ అధికారులు జారీ చేయలేదు. నోటిఫికేషన్ జారీచేసి ఉంటే.. విద్యార్థులు తమ ఓడీకి దర ఖాస్తు చేసుకొని కేవలం రూ.600లు చెల్లిస్తే సరిపోతుంది. అలాకానీ పక్షంలో ప్రి-కాన్వకేషన్ పేరుతో ఓడీ కోసం అభ్యర్థులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో స్నాతకోత్సవం నోటిఫికేషన్ జారీ చేయకుండా వర్సిటీ ఉన్నతాధికారులు విద్యార్థులను నిలువుదోపిడి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది యూజీ కోర్సులు పూర్తి చేసిన వారు సుమారు 88,000 మంది ఉండగా, 11,000 మంది పీజీ కోర్సులు పూర్తి చేశారు. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డి), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) పూర్తి చేసిన వారు కలిపితే మరో 1,000 మందికి పైగా ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా సుమారు లక్ష మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్నాతకోత్సవం కోసం నోటిఫికేషన్ జారీచేయకపోవడం విడ్డూరంగా ఉందని, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌చార్జి వీసీ అయినా ఈ విషయమై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 27 , 2024 | 08:11 AM