Loksabha Elections: మోదీకి ఇల్లు లేదు, కారు కూడా..
ABN, Publish Date - May 15 , 2024 | 04:37 AM
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..
సొంత ఇల్లు, కారు లేవు.. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రధాని వెల్లడి
వారాణసీ నుంచి నామినేషన్
గంగా సప్తమి పర్వదినాన దాఖలు
చంద్రబాబు, పవన్ సహా ఎన్డీయేకు చెందిన పలువురు
నేతల హాజరు
వారాణసీ, మే 14: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా.. మంగళవారం ఉదయం ఆయన జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశలో (జూన్ 1న) పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వారాణసీ ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు మంగళవారమే. గంగాదేవి భూమికి దిగివచ్చిన గంగా సప్తమి, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో.. మోదీ ఈరోజును ఎంచుకున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేశారు.
అక్కడ జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ‘‘కాశీతో నా అనుబంధం అద్భుతమైనది, విడదీయలేనిది, పోలిక లేనిది. మాటల్లో చెప్పలేనిది. మీ అందరి ఆప్యాయతతో పదేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తురావట్లేదు. ఈరోజు గంగమ్మ తల్లి నన్ను తన దత్తత తీసుకుంది’’ అని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
నామినేషన్ అనంతరం నేరుగా.. కాశీలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్థానిక పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రతి బూత్‌లోనూ.. గతంలో పోలైన ఓట్ల కంటే 370 ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆయన ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ఈ చారిత్రక నియోజకవర్గం (వారాణసీ) నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం’’ అని పేర్కొన్నారు. కాశీ ప్రజలను తన కుటుంబసభ్యులుగా అభివర్ణించారు. ‘‘ప్రజల మద్దతుతో మూడోసారి కూడా గెలిచి.. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇనుమడించిన ఉత్సాహంతో కృషి చేస్తా. ‘జై బాబా విశ్వనాథ్’’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆ నలుగురూ..
2014, 2019 తరహాలోనే.. ఈసారి కూడా మోదీ నామినేషన్ వేయడానికి వేర్వేరు వర్గాలకు చెందిన నలుగురు ప్రపోజర్లను(లోక్‌సభ అభ్యర్థిగా బలపర్చేవారు) ఎంచుకున్నారు. ఆ నలుగురూ.. పండిత్ గణేశ్వర్ శాస్త్రి, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుశ్వాహ, సంజయ్ సోంకర్. వీరిలో పండిత్ గణేశ్వర్ శాస్త్రి ప్రముఖ జ్యోతిష్కుడు, వేదపండితుడు, న్యాయశాస్త్ర కోవిదుడు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం పెట్టింది ఆయనే.
2022 ఫిబ్రవరిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణానికి కూడా ముహూర్తం పెట్టింది ఈయనే. గణేశ్వర్ శాస్త్రి తాతముత్తాతలు.. తమిళనాడులోని తిరువసనల్లూరు నుంచి ఎప్పుడో వారాణసీకి వచ్చి స్థిరపడ్డారు. మరో ప్రపోజర్.. వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని సేవాపురి ప్రాంతానికి చెందిన బైజ్‌నాథ్ పటేల్ ఆరెస్సెస్ కార్యకర్త. జనసం్‌ఘతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యక్తి.
ఇంకో ప్రపోజర్ లాల్‌చంద్ కుశ్వాహా(65).. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ వారాణసీ జోనల్ ఇన్‌చార్జ్. మరో ప్రపోజర్.. సంజయ్ సోంకర్ (50) దళితుడు. వారాణసీ జిల్లా విభాగం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదు
తనకు మొత్తం రూ.3.02 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని మోదీ ప్రకటించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. పోల్ అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, చేతిలో ఉన్న డబ్బు వివరాలను వెల్లడించారు. ఆ అఫిడవిట్ ప్రకారం.. మోదీకి కారు లేదు. సొంత ఇల్లు లేదు. భూములుగానీ, షేర్లుగానీ లేవు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులూ లేవు.
ఎస్‌బీఐలో పిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మాత్రం రూ.2.86 కోట్లున్నాయి. రూ.2.68 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు, రూ.9.12 లక్షల విలువైన జాతీయ పొదుపు పత్రాలు ఆయన పెట్టుబడులు. ఇక, ఆయన చేతిలో ఉన్న నగదు.. 52,920 రూపాయలు. వారాణసీ, గాంధీనగర్‌లోని రెండు బ్యాంకు ఖాతాల్లో 80,304 రూపాయలు ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతాన్ని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వస్తున్న వడ్డీని తన ఆదాయ వనరులుగా చూపారు. 2018-19లో తన ఆదాయం రూ.11.14 లక్షలుగా చూపిన మోదీ.. 2022-23లో రూ.23.54 లక్షలుగా పేర్కొన్నారు. 2014లో మోదీ తన ఆస్తుల విలువను రూ.1.66 కోట్లు, 2019లో రూ.2.51 కోట్లుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని మోదీ అన్నారు.
బీజేపీ కంచుకోట.. వారాణసీ
వారాణసీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట! ఇక్కడ హిందూ జనాభా 75 శాతం కాగా.. ముస్లింలు 20 శాతం దాకా ఉన్నారు. హిందువుల్లో.. 10శాతం ఎస్టీలు, 0.7 శాతం ఎస్సీలు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 65 శాతం.. అర్బన్ ఓటర్లు 35 శాతం.
ఒక్క 2004 ఎన్నికల్లో మినహా.. 1991 నుంచి ఇప్పటిదాకా ఆ నియోజకవర్గాన్ని బీజేపీనే దక్కించుకుంది. 2004 ఎన్నికల్లో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్కే మిశ్రా అక్కడ విజయం సాధించారు. ఇక, మోదీ 2014లో 3.71 లక్షల ఓట్ల ఆధిక్యంతో (56.37 శాతం ఓట్లు).. 2019లో 4.79 లక్షల ఓట్ల ఆధిక్యంతో (63 శాతం ఓట్లతో) అద్భుత విజయాలు సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాత రికార్డులను ఛేదించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. ఈసారి ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ అజయ్ రాయ్‌ని వరుసగా మూడోసారి రంగంలోకి దించింది.
Updated Date - May 15 , 2024 | 08:49 AM