బ్రెడ్, సేమియా... పిల్లలకు మంచివేనా..
ABN, Publish Date - Dec 22 , 2024 | 08:43 AM
మార్కెట్లో దొరికే మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ వంటివన్నీ సాధారణంగా మైదాతో తయారుచేస్తారు. హోల్ గ్రెయిన్ బ్రెడ్ మాత్రం గోధుమ పిండితో చేస్తారు. మామూలు సేమియా కూడా పొట్టు తీసిన గోధుమల నుండే తయారుచేస్తారు.
బ్రెడ్, సేమియా ఏ పిండితో తయారుచేస్తారు? మా పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రేమలత నెల్లుట్ల, మేడిపల్లి
మార్కెట్లో దొరికే మిల్క్ బ్రెడ్, వైట్ బ్రెడ్ వంటివన్నీ సాధారణంగా మైదాతో తయారుచేస్తారు. హోల్ గ్రెయిన్ బ్రెడ్ మాత్రం గోధుమ పిండితో చేస్తారు. మామూలు సేమియా కూడా పొట్టు తీసిన గోధుమల నుండే తయారుచేస్తారు. ఈ బ్రెడ్, సేమియా, నూడుల్స్, పాస్తా వంటివన్నీ సాధారణంగా గోధుమలు, గోధుమ పిండి, మైదాపిండి నుండి వచ్చేవే. ఈమధ్య ఓట్స్, చిరుధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్, సేమియా, నూడుల్స్, పాస్తా వంటివి కూడా లభిస్తున్నాయి. ధాన్యాలతో చేసిన ఆహారంలో సాధారణంగా పిండి పదార్థాలు మాత్రమే అధికంగా ఉంటాయి. వీటిని ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం చేసుకోవాలంటే బ్రెడ్‌తో కూరగాయ ముక్కలు, గుడ్డు, పనీర్ వంటివి చేర్చి శాండ్విచ్లు చేయడం, సేమియా, పాస్తాతో చేసే వంటకాల్లో కూరగాయలు, పప్పులు, గింజలు వేయడం, నూనె, చీజ్, సాస్ వంటి వాటిని తక్కువగా వాడడం మొదలైన జాగ్రత్తలు తీసుకొంటే... మితంగా తీసుకున్నప్పుడు మైదాతో చేసినవైనా వీటివలన పిల్లలకైనా పెద్దలకైనా ఇబ్బంది ఉండదు.
జొన్నలు, సజ్జలు, రాగుల్లో రాత్రి భోజనంలో తినడానికి ఏవి అనువైనవి? లేదా, నలభై ఏళ్ళు పైబడిన వారు రాత్రిపూట కూడా అన్నమే తినడం మంచిదా? ఈ ధాన్యాల విశిష్టత వివరించండి. వీటన్నింటిలో ఏది మంచిదో తెలియచేయండి.
- లత కర్నాటి, కృష్ణాపురం
జొన్నలు, సజ్జలు, రాగులు మూడూ కూడా తృణధాన్యాలు. వీటిల్లో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న వంటి ధాన్యాలలానే పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కానీ బియ్యంతో పోలిస్తే ఈ తృణ ధాన్యాలలో పీచు పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. కొన్నింటిలో ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఇలా పీచుపదార్థం ఉండడం వలన రక్తంలో గ్లూకోజు నియంత్రించడంలో బియ్యం కంటే తృణధాన్యాలు మెరుగ్గా పనిచేస్తాయి. అందువలన రాత్రివేళనే కాదు, ఎప్పుడైనా బియ్యానికి ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చు.
పరిమితి మించకుండా తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు తృణధాన్యాలన్నీ కూడా శక్తినిచ్చే పిండి పదార్థాలు, కొన్ని రకాల బీ విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలనూ అందిస్తాయి. అదే అధికంగా తీసుకొంటే అనవసరమైన క్యాలరీలనూ ఇస్తాయి. బియ్యంలో కూడా పాలిష్ చేసిన బియ్యంతో పోల్చినప్పుడు ముడి బియ్యంలో పీచు, బీ విటమిన్లు కొంచెం ఎక్కువగా లభిస్తాయి. నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు వారు కేవలం ఒక రకమైన ధాన్యమే తినాలి అనే నిబంధనేమీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారంలో అన్ని రకాల ధాన్యాలకు చోటుంది. రాత్రివేళ ఆహారంలో మితంగా పిండి పదార్థాలు, అధికంగా పీచు పదార్థాలనిచ్చే కూరగాయలు, ఆకుకూరలు తీసుకొంటే అన్ని రకాలుగానూ మంచిది. అలాగే, మరీ ఆలస్యంగా కాకుండా రాత్రి భోజనాన్ని కాస్త పెందలాడే ముగిస్తే మంచిది.
మా పాపకు ఐదేళ్లు. ఈ మధ్య తరచూ కాళ్ళు నొప్పులంటోంది. ఏమైనా పోషకాహార లోపమా? ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
- మౌనిక, నల్గొండ
కొందరు పిల్లల్లో విటమిన్ డీ లోపం ఉండడం వలన కండరాలు, ఎముకల్లో నొప్పి రావచ్చు. విటమిన్ డీ లోపం వల్ల ఆహారంలో లభించే క్యాల్షియం కూడా శరీరం శోషించుకోదు. అందువలన కాళ్ళనొప్పితో పాటుగా ఆకలి సరిగా లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, త్వరగా కోపం రావడం, తరుచూ జలుబు, దగ్గు వంటివి రావడం... మొదలైన లక్షణాలు ఉన్నట్టయితే విటమిన్ డీ లోపం ఉండి ఉండవచ్చు. కేవలం లక్షణాలను బట్టి విటమిన్ డీ లోపం తెలుసుకోలేం. దీనికొరకు రక్త పరీక్ష చేసి మీ పాప ఆరోగ్యస్థితి గురించి పిల్లల వైద్యులే చెప్పగలరు. ఒకవేళ విటమిన్ డీ లోపం ఉన్నట్టయితే వారు ఇచ్చే మందులతో పాటుగా, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఎండ పూర్తిగా తగ్గక ముందు పిల్లలను ఒక అరగంట పాటు ఎండలో ఆడనివ్వండి. ఆహారంలో పాలు, పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
Updated Date - Dec 22 , 2024 | 08:43 AM