Health News: మందులు లేకుండా హై బీపీకి చెక్ పెట్టొచ్చా?
ABN, Publish Date - Jul 31 , 2024 | 08:03 AM
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పనిఒత్తిడి, ఇతర కారణాలతో తీవ్రమైన ఆందోళనలకు గురవుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలితో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రక్తపోటు గురించి.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పనిఒత్తిడి, ఇతర కారణాలతో తీవ్రమైన ఆందోళనలకు గురవుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలితో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రక్తపోటు గురించి. ఇది వచ్చినా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు.
విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో తమకు హై బీపీ ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ధమనుల్లో రక్తపోటు పెరిగినప్పుడు హై బీపీ వస్తుందని వైద్యులు చెప్తుంటారు. దీని బారిన పడ్డారంటే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే. అధిక రక్తపోటు వల్ల పక్షవాతం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. అయితే వయసుతో సంబంధం లేకుండా ఒకసారి బీపీ ఉందో లేదో చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం అవుతుంది.
మందులు లేకుండా అధిక రక్తపోటు నివారించాలంటే..!
అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండాలన్నా, హై బీపీ రోగులు మందులు లేకుండా దాన్ని తగ్గించుకోవాలన్నా ముఖ్యంగా జీవనశైలిని మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ముఖ్యంగా వంటలో వాడే ఉప్పును తగ్గించాలి. ఉప్పు అధికంగా తినడం అనేది హై బీపీని పెంచుతుంది. దీంతో మనం ముందుగా చెప్పుకున్నట్లు రకరకాల సమస్య బారిన పడతాం.
హై బీపీ నివారించేందుకు పొటాషియం అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. అలాగే కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి.
అలాగే ఒత్తిని నివారించుకోవాలి. ఈరోజుల్లో పని ఒత్తిడి, ఆందోళనలు తీవ్రంగా ఉంటున్నాయి. దానికి కారణం పోటీ ప్రపంచం, మన జీవనశైలి. ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి అనేది అధిక రక్తపోటును పెంచుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచే పనులు చేయాలి. ధ్యానం, యోగాపై దృష్టి పెట్టాలి. అలాగే మంచి నిద్ర కూడా హై బీపీని అదుపులో ఉంచుతుంది.
ముఖ్యంగా ధూమపానం అలవాటును దూరం పెట్టాలి. సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనేది హై బీపీని పెంచుతుంది. కాబట్టి ఈ అలవాటును దరిచేరనీయకపోవడం చాలా మంచిది. ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున్న దీని జోలికి వెళ్లకపోవడం మంచిది.
అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు అనేది హై బీపీని పెంచుతుంది. కాబట్టి ఎప్పుకప్పుడు వ్యాయామం చేస్తుండాలి. దానికి వాకింగ్ లేదా జిమ్‌కు వెళ్లడం మంచిది. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయలేని వారు ఇంట్లో ఉండి కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు చెప్తూ అనేక వీడియోలు యూట్యూబ్‌లో దొరుకుతాయి. అవి ఫాలో అయితే సరి. కాబట్టి మంచి జీవనశైలితో ఆరోగ్యాన్ని కాపాడుకోండి, హై బీపీకి చెక్ పెట్టండి.
Updated Date - Jul 31 , 2024 | 08:04 AM