Health News: ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే డేంజర్..
ABN, Publish Date - Oct 26 , 2024 | 07:17 AM
అవసరమైన దాని కంటే అధికంగా మాంసం తెచ్చినప్పుడు లేదా రేపటి కోసం తెచ్చినప్పుడు దాన్ని నిల్వ చేసేందుకు సాధారణంగా మనం ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేసిన మాంసాన్ని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా శాఖహారుల సంఖ్య కంటే మాంసాహారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా వారాంతాల్లో కచ్చితంగా మాంసం తినాల్సిందే. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలను హోటళ్లు 24గంటలపాటు అందుబాటులో ఉంచడంతో ఎప్పుడుపడితే అప్పుడు ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. అయితే ఇంట్లో తిన్నా, హోటళ్లలో తిన్నా ఎటువంటి మాంసాన్ని తింటున్నామో గమనించాలి. హోటళ్లు సైతం రోజుల తరబడి నిల్వ చేసి కుళ్లిన మాంసాన్ని వేడివేడిగా వండి వడ్డిస్తున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలా రోజుల తరబడి ఫ్రిజ్‌లో మాంసాన్ని నిల్వ చేసి తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.
అవసరమైన దాని కంటే అధికంగా మాంసం తెచ్చినప్పుడు లేదా రేపటి కోసం తెచ్చినప్పుడు దాన్ని నిల్వ చేసేందుకు సాధారణంగా మనం ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేసిన మాంసాన్ని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా నిల్వ చేసిన మాంసంపై రకరకాల బ్యాక్టీరియా చేరుతుందని, దాన్ని వండుకుని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన మాంసంపై ఈకొలి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతుంది. అలాంటి మాంసాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీసే సమయంలో చేతులకు అంటుకునే అవకాశం ఉంది. తద్వారా నోరు, ముక్కు నుంచి అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈకొలి పొట్టలోకి చేరి అనేక అనారోగ్యాలు కలిగిస్తుంది.
ఈకొలి బ్యాక్టీరియా పొట్టలోకి చేరినప్పుడు ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే కొందరికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తి డిహైడ్రేషన్ ఎక్కువై తీవ్ర అస్వస్థతకు గురవుతారు. పచ్చి మాంసాన్ని తెచ్చినప్పుడు దాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అలా ఏమాత్రం మంచిది కాదు. పచ్చి మాంసంపై వాటర్, రక్తం ఉంటుంది. దానిపై బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజన్‌కు కారణం అవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ దెబ్బతీస్తుంది. పేగులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాంసాన్ని తింటేనే మంచిదని వైద్యులు చెప్తున్నారు.
ఒకవేళ మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పచ్చి మాంసాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకుండా దాన్ని మెుదట శుభ్రంగా కడగాలి. తడి లేకుండా కాసేపు ఆరబెట్టి ఆ తర్వాత పొడిగా ఉన్న బాక్సులో పెట్టి అనంతరం స్టోర్ చేయాలి. అయితే ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే దానిలోని పోషకాలు సైతం పోతాయని చెబుతున్నారు. కాబట్టి మాంసాన్ని ఫ్రెష్ గా తెచ్చుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఎలాంటి మాంసాన్ని వినియోగిస్తున్నారో మనం తెలుసుకునే అవకాశం తక్కువ. పైగా రుచి కోసం వారు రకరకాల హానికరమైన పదార్థాలు వాడుతుంటారు. కాబట్టి బయట ఆహారాన్ని తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Updated Date - Oct 26 , 2024 | 07:17 AM