Nigella sativa: నల్ల జీలకర్ర.. దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
ABN, Publish Date - Sep 24 , 2024 | 04:39 PM
నల్ల జీలకర్ర ఎక్కువగా తినే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, వాంతులు, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వంటగదిలో నిత్యం కనిపించే పదార్థాల్లో జీలకర్ర ఒకటి. అయితే నల్ల జీలకర్ర గురించి మీకు తెలుసా. నల్ల జీలకర్ర అనేది ఔషధ గుణాలు కలిగిన ఆహార పదార్థం. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీనిలో ఉంటే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. అయితే నల్ల జీలకర్రను మనం తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ, శ్వాసకోశ సమస్యలకు చెక్..
నల్ల జీలకర్ర ఎక్కువగా తినే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, వాంతులు, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. నల్ల జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. దీన్ని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇది శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ సహా ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తపోటు, మధుమేహం నియంత్రణ..
నల్ల జీలకర్రను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షించడంలోనూ తోడ్పడుతుంది. అలాగే నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని తరచూ వినియోగించడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్థులకు ఉపశమనం లభిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరిచి రక్తంలో చక్కెరస్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
రోగనిరోధక శక్తి మెరుగవుతుంది..
రోగనిరోధక శక్తి పెంచేందుకు నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. తద్వారా శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా, వచ్చినా వాటి నుంచి బయటపడేందుకు సైతం ఇది దివ్య ఔషధమనే చెప్పాలి. అలాగే నల్ల జీలకర్రలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్వేచ్ఛా రాడికల్స్‌ని నియంత్రిస్తాయి. అలాగే శరీరంలో దెబ్బతిన్న కణజాలాల పునరుద్ధరణకు సైతం ఇవి బాగా తోడ్పడతాయి. దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు సైతం చెక్ పెట్టొచ్చు.
చర్మ సమస్యలకు దివ్య ఔషధం..
నల్ల జీలకర్ర అనేక రకాల చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. మొటిమలు, చర్మంపై ముడతలు వంటి అనేక సమస్యలను ఇది తగ్గిస్తుంది. నల్ల జీలకర్రను నేరుగా లేదా ద్రవం రూపంలో చర్మంపై పూయడం ద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే మృదువుగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే నల్ల జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ వ్యాధులు సహా కీళ్ల నొప్పులు, ఇతర వాపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊబకాయం సమస్యకు చెక్..
నల్ల జీలకర్ర తరచూ తింటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు చెప్తున్నారు. ఇది శరీరంలో కొవ్వును తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలినట్లు డాక్టర్లు చెప్తున్నారు. అధిక బరువు, అధిక కొవ్వు నిల్వలను తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు నల్ల జీలకర్ర సహాయపడుతుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ విరివిగా వియోగించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, శరీర స్వభావాన్ని బట్టి నల్ల జీలకర్ర వాడే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Updated Date - Sep 24 , 2024 | 04:39 PM