Headache: తలనొప్పి విపరీతంగా వేధిస్తోందా... అయితే దాన్ని తగ్గించే న్యాచురల్ రెమిడీస్ ఇవే..
ABN, Publish Date - Nov 08 , 2024 | 07:14 AM
పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు అందరూ ట్యాబ్లెట్లపై ఆధారపడుతుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య తలనొప్పి. ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఉద్యోగం, కుటుంబ సమస్యలతో ఆందోళనకు గురయ్యే వారు కోకొల్లలుగా కనిపిస్తుంటారు. పని ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులు సైతం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ స్కూల్, హోంవర్కులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక కొన్ని పాఠశాలలైతే ఆదివారం కూడా హోమ్ వర్క్‌లు ఇస్తూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు అందరూ ట్యాబ్లెట్లపై ఆధారపడుతుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతున్నారు. ప్రతిసారీ మాత్రలు వేసుకుని తలనొప్పి తగ్గించుకోవాలని చూస్తే భౌవిష్యత్తులో తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే తరచూ తలనొప్పికి గురవుతూ పనిపై దృష్టిపెట్టలేకపోతున్న వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. దాని వల్ల తలనొప్పికి చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
తలనొప్పికి చెక్ పెట్టే ఇంటి చిట్కాలు ఇవే..
వాల్‌నట్స్, బాదంపప్పు, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం అనేది తలనొప్పిని దూరం చేస్తుంది. కాబట్టి వాటిని రెగ్యులర్‌గా తినాలని వైద్యులు చెబుతున్నారు.
తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది టీ తాగుతుంటారు. అయితే ఈసారి మాత్రం అల్లం టీ ట్రై చేయండి. ఎందుకంటే అల్లం టీలో తలనొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల మానసిక ఉల్లాసం పెరగడంతోపాటు తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.
తలనొప్పికి ప్రధాన కారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. చాలా మంది రోజూ శరీరానికి కావాల్సిన మంచినీటిని అందించారు. మనం శరీరంలో సింహం భాగం నీటిదే. కొందరు దాహం అయినప్పుడు మాత్రమే నీటిని తాగుతుంటారు. అలాంటి వారి శరీరంలో నీటి శాతం తగ్గిపోయి అది తలనొప్పికి కారణం అవుతుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగండి.
చాలా మంది విశ్రాంతి లేకుండా పని చేస్తుంటారు. అయితే ఇలాంటి జీవనశైలి మానసిక ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. అలాంటి వారిలో తలనొప్పి వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటాయి. కాబట్టి శరీరం, మనస్సుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం. ఎటువంటి ఆలోచనలు లేకుండా రోజుకు కొన్ని గంటలు మీ కోసం కేటాయించుకోండి. దీని ద్వారా మనస్సు ప్రశాంతంగా మారిపోయి ఉత్సాహంగా ఉంటారు.
పని ఒత్తిడి లేదా ఇతర కారణాలతో చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని వల్ల ఒత్తిడి పెరిగిపోయి తలనొప్పి వస్తుంటుంది. అయితే యోగా, ధ్యానం చేయడం ద్వారా తలనొప్పిని తగ్గించవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ధ్యానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది.
Updated Date - Nov 08 , 2024 | 07:15 AM