Drinking Habit: అదే పనిగా బీర్లు తాగుతున్నారా.. అయితే డేంజర్..
ABN, Publish Date - Oct 27 , 2024 | 07:43 AM
యువత ముఖ్యంగా బీర్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరైతే విద్యార్థి దశ నుంచే బర్త్ డే పార్టీలు లేదా ఇతర కారణాలతో మద్యం తాగుతున్నారు. ఆ వయసులో వారికి అలా చేయడం క్రేజీగా అనిపిస్తుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: "మద్యం ఆరోగ్యానికి హానికరం" ఈ కొటేషన్ మనం సినిమా థియేటర్లు, మద్యం సీసాలపై చూస్తుంటాం. మద్యం సేవించే వారి శ్రేయోభిలాషులు సైతం తాగుబోతుల మేలు కోరి చెబుతుంటారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా మందు బాబుల తీరు మాత్రం మారదు. పీపాలు పీపాలు తాగుతూ మత్తులో మునిగి తేలుతుంటారు. అయితే ఇటీవల కాలంలో యువకులు సైతం ఎక్కువగా మందుకు బానిసలు అయిపోతున్నారు.
యువత ముఖ్యంగా బీర్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరైతే విద్యార్థి దశ నుంచే బర్త్ డే పార్టీలు లేదా ఇతర కారణాలతో మద్యం తాగుతున్నారు. ఆ వయసులో వారికి అలా చేయడం క్రేజీగా అనిపిస్తుంటుంది. అయితే బీర్లు ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీర్లలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ అతిగా సేవిస్తే మాత్రం అనర్థాలు తప్పవని చెబుతున్నారు. బీర్లు అతిగా తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
బీర్లు అతిగా తాగితే వచ్చే సమస్యలు ఇవే..
బీర్లు అతిగా తాగితే దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్ర పిండాలపై ఒత్తిడి పెరిగి అవి పాడవుతాయని చెబుతున్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా మద్యం సేవించే వారే ఉంటారని కాబట్టి అతిగా తాగొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
మద్యం అతిగా సేవిస్తే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
బీర్లు ఎక్కువగా తాగడం వల్ల కాలేయానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అతిగా తాగే వారి కాలేయం కొవ్వుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మద్యానికి బానిసైన వారికి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తొలుత మత్తులో నిద్రపోయినా తర్వాత వారికి నిద్రాభంగం జరుగుతుంది. దీని వల్ల సరైన నిద్ర ఉండదు. మరుసటి రోజు అలసట, మానసిక ఒత్తిడికి గురవుతారు.
బీరులో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరుగుతారని, తద్వారా ఊబకాయం సమస్య బారిన పడతారని చెబుతున్నారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
మద్యం అతిగా సేవిస్తే అది మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలు దెబ్బతినడంతో జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకునే (డెషిషన్ మేకింగ్) సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు.
బీర్లు ఎక్కువగా సేవిస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనేక రకాల సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. మద్యం అతిగా సేవిస్తే కుటుంబం, స్నేహితులు దూరం అవుతారు. ఉద్యోగ రీత్యా అనేక సమస్యలు తలెత్తవచ్చు. చివరికి ఉద్యోగం పోయి రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. దీంతో వల్ల జీవితం దుర్భరమవుతుంది.
అయితే బీరు మితంగా తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మగవారు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించకుండా తాగాలి. అలాగే ఆడవారు గ్లాసుకు మించకుండా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అతిగా తాగితే మాత్రం పైన చెప్పుకున్న సమస్యల బారిన పడడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
Updated Date - Oct 27 , 2024 | 07:43 AM